చీకటి ఒప్పందాల కోసమే.. చంద్రబాబు ఢిల్లీ పర్యటన : షర్మిల | chandrababu naidu goes to delhi for hide deals, says sharmila | Sakshi
Sakshi News home page

చీకటి ఒప్పందాల కోసమే.. చంద్రబాబు ఢిల్లీ పర్యటన : షర్మిల

Published Sat, Sep 14 2013 1:28 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

చీకటి ఒప్పందాల కోసమే.. చంద్రబాబు ఢిల్లీ పర్యటన : షర్మిల - Sakshi

చీకటి ఒప్పందాల కోసమే.. చంద్రబాబు ఢిల్లీ పర్యటన : షర్మిల

టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై షర్మిల ధ్వజం
బాబూ.. జగన్ బెయిల్ తెరమీదికి వచ్చిందనే కదా మీరు ఢిల్లీ వెళుతున్నది?
చీకట్లోనే చిదంబరాన్ని కలిసి ఒప్పందాలు చేసుకోవడానికే కదా?
గతంలో ఇలాగే మీ ఎంపీలు వెళ్లి ‘సాక్షి’ ఆస్తులను అటాచ్ చేయించి బెయిల్‌ను అడ్డుకోలేదా?
నాడు మీరు జెడ్‌ప్లస్ కమాండోలను కూడా కాదని మీడియా కళ్లుగప్పి చీకట్లో చిదంబరాన్ని కలవలేదా?
తెలంగాణపై లేఖను వెనక్కు తీసుకోకుండా ఢిల్లీ ఎందుకెళుతున్నారు?
ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించాలని చూస్తోంది
టీడీపీ సహా ఐదు పార్టీలు విభజనకు అనుకూలంగా ఉంటే..  వైఎస్సార్ సీపీ, ఎంఐఎం, సీపీఎం ఏనాడూ అనుకూలమని చెప్పలేదు
చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. లేఖను వెనక్కు తీసుకొని, రాజీనామాలు చేయాలి

 
 ‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ విషయంలో రాజకీయాలు చేయడానికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ వెళుతున్నారని జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ‘‘చంద్రబాబుగారూ.. జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ విషయం మళ్లీ తెరమీదికి వచ్చిందన్న కారణంతోనే మీరు ఇప్పుడు ఢిల్లీకి వెళ్లడం లేదా? మళ్లీ చీకట్లోనే చిదంబరాన్ని కలిసి చీకటి ఒప్పందాలు చేసుకోవడానికి కాదా మీరు ఢిల్లీకి వెళుతున్నది? కాంగ్రెస్ వారితో కలిసి కుట్రలు పన్నడానికి కాదా చంద్రబాబూ మీరు ఢిల్లీకి వెళుతున్నది?’’ అని షర్మిల ప్రశ్నించారు. ‘‘గతంలో ఇలాగే ఒక్క రోజులో బెయిల్ ఇస్తున్నారనగా.. మీ ఎంపీలను పంపి ‘సాక్షి’ ఆస్తులను అటాచ్ చేయించి బెయిల్‌ను అడ్డుకున్నారు.
 
 గతంలో మీ జెడ్‌ప్లస్ పోలీస్ కమాండోలు కూడా అవసరం లేదని చెప్పి.. మీడియా కళ్లు గప్పి మరీ చిదంబర రహస్య భేటీలు జరిపారు. మళ్లీ అందుకే కదా బాబూ ఇప్పుడు మీరు ఢిల్లీ వెళుతున్నది? లేకపోతే జెడ్‌ప్లస్ కేటగిరీ ఉన్న మీరు.. ఒక దొంగలా అందరి కళ్లూ గప్పి.. అహ్మద్ పటేల్‌ను కలవడానికి వెళుతున్నారా? లేకపోతే సోనియా గాంధీ కాళ్ల మీదపడి జగన్‌మోహన్‌రెడ్డికి ఎలాగైనా సరే బెయిల్ రాకుండా చూడండి అని వేడుకోవడానికి వెళుతున్నారా?’’ అని ఆమె నిలదీశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర 11వ రోజు శుక్రవారం తూర్పు గోదావరి జిల్లాలో సాగింది. రావులపాలెం, అమలాపురం పట్టణాల్లో ‘సమైక్య శంఖారావం’ సభలకు భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే..
 
 దమ్ముంటే సమాధానం చెప్పండి..
 ‘‘ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీకి వెళ్తారట. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోకుండా ఢిల్లీకి వెళ్లి ఏం ప్రయోజనం చంద్రబాబూ? నిజం చెబుతారని కాదుగానీ.. అసలు మీరు ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారో చెప్పండి. తెలంగాణకు అనుకూలంగా మీరు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోకుండా.. ఎందుకు ఢిల్లీకి వెళ్తున్నారో మీకు దమ్ముంటే సమాధానం చెప్పండి. మొన్న సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న కొంత మంది చంద్రబాబు దగ్గరకు వెళ్లి ఆయన యాత్రను అడ్డుకున్నారట. దానికి చంద్రబాబు వారి మీద మండిపడ్డారట. మీ అంతు చూస్తానని బెదిరించారట. మీ ఇళ్లలోనే కాదు, మీ ఊళ్లలో ఎలా ఉంటారో చూస్తానని చంద్రబాబు వారిని బెదిరించారట. చంద్రబాబూ.. మీరు మీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారా? అసలు ఏమనుకుంటున్నారండీ మీ గురించి మీరు?
 
 విభజనకు కారణమే చంద్రబాబు..
 తెలంగాణను ఇచ్చేసుకుంటే ఇచ్చేసుకోండి అని ఒక బ్లాంకు చెక్కు మీద సంతకం పెట్టినట్టు లేఖలు రాసిచ్చేశారు చంద్రబాబు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మన రాష్ట్రాన్ని విభజించే సాహసం చేస్తోందంటే దానికి కారణం చంద్రబాబు విభజనకు పలికిన మద్దతే. హత్య చేసి ఆ శవం మీదే పడి వెక్కివెక్కి ఏడ్చినట్టు చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేఖనిచ్చేసి ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. మన రాష్ట్రంలో 60 శాతం మంది ప్రజలకు గొప్ప అన్యాయం జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఈయన చేయాల్సిన పని పాలకపక్షం కాలర్ పట్టుకొని నిలదీయడం.
 
 కానీ, దిగ్విజయ్ సింగ్ ప్రకటన చేసిన వెంటనే ఈయన ప్రెస్‌మీట్ పెట్టి.. హైదరాబాద్‌ను రూ.4 లక్షల కోట్లకు అమ్మకానికి పెట్టారంటే ఇంతకంటే దుర్మార్గుడు, ఇంతకంటే ద్రోహి ఇంకొకరు ఉంటారా? తెలుగుదేశం పార్టీ సహా ఐదు పార్టీలు ఈ విభజనకు అనుకూలంగా ఉన్నామని చెప్తే.. మూడు పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, ఎంఐఎం విభజనకు అనుకూలమని ఏనాడూ చెప్పలేదు. చంద్రబాబుకు నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఆయనకు ఏమాత్రం నిజాయితీ ఉన్నా తెలంగాణకు తను కూడా వ్యతిరేకం అని ఈ మూడు పార్టీల పక్షాన నాలుగో పార్టీగా నిలబడాలి. ప్రజలకు  క్షమాపణ చెప్పి తెలంగాణకు అనుకూలంగా తను ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకోవాలి. ఆయన, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రాజీనామాలు చేసి నిరసన తెలియజేయాలి.
 
 సీఎం తెలిసీ గోప్యంగా ఉంచారు..
 కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసం, టీఆర్‌ఎస్‌ను తమలో కలుపుకొనైనా సరే కేంద్రంలో లబ్ధి పొంది రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేయడానికి పూనుకొంది కాంగ్రెస్ పార్టీ. తెలుగువారి ఓట్లు దండుకొని తెలుగువారిపైనే వేటు వేసింది. తెలుగువారి భిక్షతో కేంద్రంలో, రాష్ట్రంలో గద్దెనెక్కి కూర్చొని తెలుగువారికే వెన్నుపోటు పొడిచింది. ఇంత జరుగుతోంటే ఈ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి దిష్టిబొమ్మ లాగా కూర్చున్నారు. మన రాష్ట్రాన్ని చీల్చుతున్నారనే సంగతి ఈయనకు ఎప్పుడో తెలుసు. ఆయినా దానికి అడ్డు చెప్తే ఈయన పదవి పోతుందనుకొని అడ్డు చెప్పలేదు, దిగ్విజయ్‌సింగ్ వచ్చి మన రాష్ట్రాన్ని చీల్చుతున్నామని ప్రకటన చేసేంత వరకు కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు.
 
 విభజన సంకేతాలు రాగానే వైఎస్సార్ సీపీ రాజీనామాలు..
 హఠాత్తుగా ఎలాంటి పరిష్కారమూ చూపించకుండానే మన రాష్ట్రాన్ని విడగొడుతున్నారన్న సంకేతాలు వచ్చిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతమంది నాయకులు రాజీనామాలు చేశారు. గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి రాజీనామాలు చేసి.. నిరాహార దీక్షలు కూడా చేశారు. లేఖల మీద లేఖలు రాస్తూ మన రాష్ట్రాన్ని విడగొట్టొద్దని, రాష్ట్రానికి అన్యాయం చేయొద్దని ఈ రోజు వరకు పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ సీమాంధ్రకు చెందిన ఎంతమంది కాంగ్రెస్, టీడీపీ నాయకులు రాజీనామాలు చేసి ప్రజల తరఫున గొంతెత్తారు?’’
 
 బాబూ.. మీకు అంటువ్యాధులున్నాయా?
 ‘‘చంద్రబాబును చూసి వైఎస్ రాజశేఖరరెడ్డి భయపడేవారని చంద్రబాబు అంటున్నారట. చంద్రబాబూ.. మిమ్మల్ని చూసి ఎవరైనా భయపడటానికి మీకేమైనా అంటు వ్యాధులు ఉన్నాయా? మిమ్మల్ని చూస్తే వైఎస్సార్ ఒక జోకర్‌ను చూసినట్టు ఎంతలా నవ్వుకునేవారో మీకు గుర్తులేదా? చంద్రబాబూ.. సాక్షి టీవీకి చెప్పి ఆ క్లిప్పింగులు వేయించమంటారా?’’    
- షర్మిల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement