విచారణ కోరే దమ్ముందా ?: షర్మిల | Do you have the guts to ask for enquiry, Sharmila dares Chandrababu naidu | Sakshi
Sakshi News home page

విచారణ కోరే దమ్ముందా ?: షర్మిల

Published Tue, Sep 17 2013 2:59 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

Do you have the guts to ask for enquiry, Sharmila dares Chandrababu naidu

అవినీతి కేసులపై చంద్రబాబుకు షర్మిల సవాల్
 చాలా ధర్మంగా ఆస్తులు సంపాదించానని అన్నారట
 ఢిల్లీ వెళ్తున్నారు కదా.. ఐఎంజీ, ఎమ్మార్, ఇతర కేసుల్లో
 మీ అవినీతిపై విచారణ జరపాలని రాష్ట్రపతి, ప్రధానిని కోరతారా?
 కాంగ్రెస్‌తో కుదిరిన ఏ డీల్ ప్రకారం రాష్ట్ర విభజనకు మద్దతు పలుకుతున్నారు?
 ఏ డీల్ కోసం ఇప్పుడు ఢిల్లీ వెళుతున్నారు.. ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ రాష్ట్ర విభజనకు పూనుకుంది
 చంద్రబాబు ఇప్పటికైనా తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకోవాలి
 చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేయాలి..
 అప్పటిదాకా సీమాంధ్రలో అడుగుపెట్టనీయకుండా తరిమికొట్టండి
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, ఎంఐఎంలు మాత్రమే సమైక్యాంధ్రప్రదేశ్ కోరుకుంటున్నాయి
 శ్రీకాకుళంలో ముగిసిన సమైక్య శంఖారావం బస్సు యాత్ర

  ‘సమైక్య శంఖారావం’ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  ‘‘చంద్రబాబుగారూ.. మీ ఆస్తులు రూ.40 లక్షలని, మీ కుటుంబ ఆస్తులు రూ.41 కోట్లు అని డిక్లేర్ చేశారట. చాలా ధర్మంగా మీరు ఆ ఆస్తులు సంపాదించానని అన్నారట! ఒకే ఒక మాట అడుగుతున్నాను.. నిజంగానే మీ ఆస్తులన్నీ అంత ధర్మంగా సంపాదించి ఉంటే, మీలో అవినీతి లేకపోతే.. ఎలాగూ మీరు ఢిల్లీకి వెళ్తున్నారు కదా.. ఐఎంజీ, ఎమ్మార్ కేసులతోపాటు మీపై అవినీతి ఆరోపణలు ఉన్న అన్ని కేసుల్లో విచారణ జరపాలని రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి లేఖలు రాసి విచారణ కోరే ధైర్యం ఉందా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ప్రశ్నించారు.
 
  కాంగ్రెస్ పార్టీతో కుదుర్చుకున్న ఏ డీల్ ప్రకారం.. సీమాంధ్రులకు ఇంత అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర విభజనకు మద్దతు పలుకుతున్నారని చంద్రబాబును నిలదీశారు. ‘‘ఏ డీల్ ప్రకారం తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవడం లేదు? ఏ డీల్ కోసమని మీ ఎంపీలను ఢిల్లీకి పంపారు? ఇప్పుడు ఏ డీల్ కోసం మీరు కూడా ఢిల్లీకి వెళ్తున్నారు?’’ అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో షర్మిల చేపట్టిన ‘సమైక్య  శంఖారావం’ బస్సుయాత్ర 14వ రోజు సోమవారంతో ముగిసింది. శ్రీకాకుళం జిల్లా రాజాం, శ్రీకాకుళం  పట్టణంలో నిర్వహించిన సమైక్య శంఖారావం సభలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారిని  ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే..
 
 ఏ డీల్ ప్రకారం విచారణలు జరగకుండా చూసుకుంటున్నారు?
 ‘‘అన్నింటా కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై చివరకు సీమాంధ్రులకు తీరని అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర విభజనకు మద్దతు పలుకుతున్న చంద్రబాబు గారు అంటారూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైందట! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్‌తో డీల్ పెట్టుకుందట. నిజంగానే మేం కాంగ్రెస్ పార్టీతో డీల్ పెట్టుకుంటే ఈరోజు జగన్‌మోహన్‌రెడ్డిగారు 16 నెలలుగా జైల్లో ఉండేవారా? డీల్ పెట్టుకొని ఉంటే చిరంజీవిగారి మాదిరిగా జగన్‌మోహన్‌రెడ్డి ఏ కేంద్ర మంత్రో అయ్యేవారు కాదా? ఏ ముఖ్యమంత్రో అయిపోయే వారు కాదా? 16 నెలలుగా నేరం రుజువు కాకుండానే జగన్‌మోహన్‌రెడ్డి గారు జైల్లో ఉన్నారంటే ఎవరు ఎవరితో కుమ్మక్కయినట్టు? ఎవరు ఎవరితో డీల్ పెట్టుకున్నట్టు? ఏ డీల్ ప్రకారం ఎఫ్‌డీఐ విషయంలో మీ ఎంపీలను గైర్హాజరు చేయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి సహాయపడ్డారు. ఏ డీల్ ప్రకారం చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో కలవక ముందు అవిశ్వాసం పెట్టకుండ, ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో కలిసిన తర్వాత, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోదన్న నమ్మకం ఏర్పడ్డ తర్వాత అవిశ్వాసం పెట్టారు మీరు? ఏ డీల్ ప్రకారం రెండోసారి అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే మీరు మాత్రం విప్ జారీ చేసి మరీ, నిస్సిగ్గుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడారు?
 
  ఏ డీల్ ప్రకారం పార్లమెంటు ఎన్నికల నుంచి పంచాయతీ ఎన్నికల దాకా ఏ ఎన్నికలు వచ్చినా పాలునీళ్లుగా కాంగ్రెస్‌తో కలిసిపోయి పనిచేస్తున్నారు? ఏ డీల్ ప్రకారం మీపై సీబీఐ, ఈడీ విచారణలు జరగకుండా చూసుకుంటున్నారు? ఐఎంజీ కేసులో హైదరాబాద్ నడిబొడ్డున 850 ఎకరాలను మీ బినామీ కంపెనీలకు ఇస్తే.. చంద్రబాబు నాయుడును విచారించడానికి మా వద్ద సిబ్బంది లేదు అని సీబీఐ అంటే మీరు ఏ డీల్ పెట్టుకున్నట్టు చంద్రబాబు గారు? ఎమ్మార్ కేసులో 550 ఎకరాలను మీరు మీ వాళ్లకు ఇచ్చుకుంటే మీ సీబీఐ ఏమో మిగతా వాళ్లందరిపై కేసులు పెడుతుంది, జైల్లో పెడుతుంది, కానీ మిమ్ములను మాత్రం కనీసం విచారణకు కూడా రమ్మనడం లేదంటే మీరు కుదుర్చుకున్న డీల్ కాదా చంద్రబాబుగారు..? ఏ డీల్ కోసం చిదంబరం గారిని, భరద్వాజ్ గారిని, ఆహ్మద్‌పటేల్ గారిని కలిశారు? ఇంకా కలుస్తూనే ఉన్నారు? 16 నెలలైనా రాజ్యాంగం ఇచ్చిన హక్కును కాదని జగన్‌కు బెయిల్‌రాకుండా ఈరోజు వరకు ఆపుతున్నారంటే డీల్ చేసుకుంది మీరు కాదూ చంద్రబాబు గారూ..?’’
 
 ఓట్లు, సీట్ల కోసం జాతినే చీల్చుతున్నారు..
 ‘‘కాంగ్రెస్ పార్టీ కేవలం ఓట్లు, సీట్ల కోసం, వారి స్వార్థ రాజకీయాల కోసం ఒక జాతినే చీల్చడానికి సిద్ధమైంది. టీఆర్‌ఎస్‌ను తమలో కలుపుకొనైనా సరే కేంద్రంలో లబ్ధి పొంది రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవడం కోసం విభజన అనే పేరుతో గొడ్డలితో నరికినట్లు ఈ రాష్ట్ర్రాన్ని రెండు ముక్కలు చేసి, అన్నదమ్ముల మధ్య చిచ్చుపెడతారా? మా ఓట్లు దండుకొని మా కళ్లే పొడుస్తారా? మా ఓట్లు దండుకొని మా బతుకులే బుగ్గిపాలు చేస్తారా అని ఈరోజు కోట్లమంది ప్రజలు కాంగ్రెస్ పార్టీని నిలదీస్తున్నారు. రైతులు, కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, మహిళలు అందరూ రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. కోట్ల మంది గుండెలు రగిలిపోతున్నాయి. కానీ ఈ కాంగ్రెస్, టీడీపీ నాయకులు మాత్రం చర్చలంటూ రోజుకు ఒకరి ఇంట్లో కూడి విందులు చేసుకుంటున్నారు. అదీ వీళ్లకు ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి! విభజన గురించి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిగారికి, బొత్సగారికి ముందుగానే తెలుసునని కేబినెట్ మంత్రి కిశోర్ చంద్రదేవ్ చెప్పారు. అంటే  వీళ్లకు రాష్ట్రాన్ని చీల్చుతారన్న సంగతి తెలిసి కూడా వాళ్ల పదవులు వాళ్లకు ఉంటే చాలని విభజనను అడ్డుకోలేదంటే వారిని ఏమనాలి?
 
 చేసిందంతా చేసి..
 చంద్రబాబు చేసిందంతా చేసి ఇప్పుడేమో విభజనకు కారణం వైఎస్సార్ అంటున్నారు. స్వయంగా ప్రధానమంత్రితో సహా రాష్ట్రంలో కోట్ల మంది ప్రజలు వైఎస్సార్ బతికే ఉంటే మన రాష్ట్రానికి ఈ గతి పట్టేదే కాదు అని చెప్తుంటే.. వైఎస్సార్ ఈ విభజనకు కారణం ఎలా అవుతారు చంద్రబాబు గారు? తెలుగుదేశం పార్టీతో సహా ఐదు పార్టీలు రాష్ట్ర విభజనకు మద్దతు పలికితే.. మూడు పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, ఎంఐఎం పార్టీలు ఎప్పుడూ విభజనకు మద్దతు పలకలేదు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉన్నా..  నిజాయితీ ఉన్నా ఇప్పటికైనా ఈ మూడు పార్టీల పక్షాన చేరాలి. కోట్ల మంది ప్రజలకు క్షమాపణ చెప్పి తప్పయిపోయిందని చెంపలు వేసుకొని తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి. ఆయన, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు  రాజీనామాలు చేయాలి. అంతవరకు చంద్రబాబు నాయుడుగాని, టీడీపీ నాయకులను గాని సీమాంధ్రలో అడుగుపెట్టడానికి వీలు లేదని చెప్పి ప్రజలంతా తరిమితరిమి కొట్టాలి. న్యాయం చేయడం మీ ఉద్దేశం కాదని తేలిపోయింది కనుక రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మా పార్టీ డిమాండ్ చేస్తోంది. మా పార్టీ స్టాండ్ సమైక్య ఆంధ్ర ప్రదేశ్. కోట్ల మందికి అన్యాయం జరుగుతుంటే జగనన్న చేతులు కట్టుకొని కూర్చోరు. సమైక్య రాష్ట్రం కోసం జగనన్న నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్  ఎందాకైనా పోరాటం చేస్తుంది’’
 
 జీతం పువ్వుల్లో పెట్టి ఇస్తాం..
 ‘‘సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న ఏపీన్జీవోల మీద, ప్రజల మీద ఈ సర్కారు కేసుల పెట్టి హింసిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, జగనన్న ముఖ్యమంత్రి కావడం ఖాయం. జగనన్న సీఎం అయిన తర్వాత ఉద్యమకారుల మీద పెట్టిన కేసులు ఎత్తివేయడం జరుగుతుంది.  తెలంగాణను వేరు చేయవద్దని, రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచాలని మన అన్నలు, మన అక్కలు ఎంతో కృషి చేస్తూ రోజుల తరబడి రోడ్ల మీదనే గడుపుతున్నారు. వీరికి ఈ సర్కారు కనీసం జీతం కూడా ఇవ్వడం లేదంటే వీళ్లను మనుషులు అనలా? లేక రాక్షసులు అనలా? ఏపీఎన్జీవో సంఘాల సభ్యులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాటిచ్చి చెప్తోంది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. జగన్‌మోహన్‌రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినవెంటనే ఒకవేళ అంతవరకు ఈ ప్రభుత్వం మీకు జీతాలు చెల్లించకపోతే.. ఆ జీతాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీకు పువ్వుల్లో పెట్టి చెల్లిస్తుంది. మీ జీతాలు చెల్లించడంతో పాటు ఒకనెల బోనస్ కూడా ఇచ్చి మిమ్ముల్ని గౌరవిస్తుందని జగనన్న తరఫున మీకు మాట ఇస్తున్నాం’’    - షర్మిల
 
 యాత్ర సాగిందిలా..
 సోమవారం సమైక్య శంఖారావం బస్సుయాత్ర విజయనగరం జిల్లా సాలూరు నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి శ్రీకాకుళం జిల్లా రాజాం చేరింది. ఇక్కడ జరిగిన సమైక్య శంఖారావం సభకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. వారిని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో యాత్ర ముగింపు సభలో షర్మిల మాట్లాడారు. ఆమె ప్రసంగించినంత సేపూ వర్షం కురిసింది. వర్షంలో తడుస్తూనే ప్రజలు ప్రసంగం విన్నారు. సోమవారం బస్సుయాత్రలో పాల్గొన్న నేతల్లో ఎమ్మెల్యేలు సుజయకృష్ణా రంగారావు, ధర్మాన కృష్ణదాసు, విజయనగరం జిల్లా పార్టీ కన్వీనర్, మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు, శ్రీకాకుళం జిల్లా పార్టీ కన్వీనర్ ధర్మాన పద్మప్రియ, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం, మాజీ ఎంపీ కణితి విశ్వనాథం, మాజీ ఎమ్మెల్యేలు కుంభ రవిబాబు, కంబాల జోగులు, బగ్గు లక్ష్మణరావు, ముదునూరు ప్రసాదరాజు, పార్టీ నేతలు పాలవలస రాజశేఖరం, వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురాం, బేబి నాయిన శ్రీకాకుళం జిల్లా స్థానిక నాయకులు సూర్యనారాయణ, వరుదు కళ్యాణి, కిల్లి రామ్మోహన్‌రావు, విశ్వాసరాయి కళావతి, పాలవలస విక్రాంతు, పీఎంజే బాబు, దువ్వాడ శ్రీనివాస్, గొర్లె కిరణ్, వజ్జె బాబూరావు, కల్మట వెంకటరమణ, కూన మంగమ్మ, తదితరులు ఉన్నారు. ప్రతిరోజు షర్మిల వెంట ఉన్నవారిలో వైఎస్ రాయల్‌రెడ్డి, డాక్టర్ హరికృష్ణ, అందూరి రాజగోపాల్‌రెడ్డి, ఆవుల భాస్కర్‌రెడ్డి, వి.ఇమాం భాష, ప్రచార కమిటీ సహాయ సమన్వయకర్త జొన్నల శ్రీనివాస్‌రెడ్డి, యాత్ర సమన్వయకర్త బృందం సభ్యులు గుత్తిరెడ్డి చంద్రహాస్‌రెడ్డి, పోలసాని సురేష్ కుమార్, లంకపోతు సబ్బారెడ్డి, దాడి విజయభాస్కర్‌రెడ్డి, నూనె దశరథరామిరెడ్డి, అంబటి రాఘవరెడ్డి తదితరులు ఉన్నారు.
 
 ముగిసిన బస్సు యాత్ర: తలశిల
 షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం బస్సుయాత్ర సోమవారంతో పూర్తయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు షెడ్యూల్ ప్రకారం షర్మిల 13 జిల్లాల్లో పర్యటించారని తెలిపారు. మొత్తం 80 నియోజకవర్గాలు, 115 మండలాలు, 32 మున్సిపాలిటీలు, 7కార్పొరేషన్లలో 2,245 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగిందని, 34 బహిరంగ సభల్లో షర్మిల ప్రసంగించారని తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యం గానే ఉంచాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని, తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు.. తన యాత్రకు ప్రజల ఆదరణ లేకే మధ్యలోనే ముగించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement