నేతలా.. ఊసరవెల్లులా ? : షర్మిల | Sharmila demand Chandrababu naidu to withdraw Telangana Letter | Sakshi
Sakshi News home page

నేతలా.. ఊసరవెల్లులా ? : షర్మిల

Published Fri, Sep 13 2013 2:29 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

Sharmila demand Chandrababu naidu to withdraw Telangana Letter

పదవి రాకముందు ఒకమాట.. వచ్చిన తర్వాత మరోమాటా?: షర్మిల
 ఢిల్లీ దర్బారులో వంగివంగి సలాం చేస్తూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు...
 గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచారు
 తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు ఇచ్చిన లేఖ వల్లే కాంగ్రెస్ విభజనకు పూనుకుంది
 ఓట్లు, సీట్ల కోసమే ఈ కాంగ్రెస్ పార్టీ..రాష్ట్రాన్ని చీల్చాలనుకుంటోంది
 టీడీపీ సహా ఐదు పార్టీలు విభజనకు అనుకూలంగా ఉంటే.. వైఎస్సార్ సీపీ, సీపీఎం,
 ఎంఐఎం మాత్రమే సమైక్యంగా ఉండాలన్నాయి
 చంద్రబాబు తన లేఖను వెనక్కి తీసుకోవాలి.. పార్టీ నేతలతో రాజీనామా చేయించాలి..
 అప్పటిదాకా సీమాంధ్రలో అడుగుపెట్టనీయకుండా తరిమికొట్టండి

 
సమైక్య శంఖారావం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి:  ‘‘ఈరోజు రాష్ట్రమంతా అట్టుడికిపోతోంది. కోట్ల మంది గుండెలు రగిలిపోతున్నాయి. మా ఓట్లు దండుకొని మా కళ్లే పొడుస్తారా? మా ఓట్లు దండుకొని మా బతుకులే బుగ్గిపాలు చేస్తారా? అని ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తుంటే.. మన నాయకులు మాత్రం ఓట్లేసిన ప్రజల కంటే తమ పదవులే ముఖ్యమని మళ్లీ నిరూపించుకున్నారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మండిపడ్డారు. ‘‘పదవి రాకముందు ఒకమాట, పదవి వచ్చిన తరువాత ఒకమాట మాట్లాడుతున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు గారు మనుషులా లేక ఊసరవెల్లులా..’’ అంటూ నిప్పులు చెరిగారు.

ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ర్ట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇంత మంది నేతలు సీమాంధ్రకు ఉండి కూడా.. అందరూ ఢిల్లీ దర్బారులో వంగివంగి సలాం చేస్తూ తెలుగు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని, ఓట్లేసి గెలిపించిన తెలుగు ప్రజలకు వెన్నుపొడిచారని విమర్శించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సుయాత్ర గురువారం పదో రోజు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో సాగింది. కృష్ణా జిల్లా కైకలూరు, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించిన ‘సమైక్య శంఖారావం’ సభలకు భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే...
 
‘‘కేబినెట్ మంత్రి కిశోర్ చంద్రదేవ్‌గారు అన్నారు.. కాంగ్రెస్ పార్టీ విభజన చేస్తుందని, ఆ విషయం గురించి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిగారికి, బొత్స గారికి మొదట్నుంచే పూర్తిగా తెలుసునని చెప్పారు. అంటే మన సీఎంకు కాంగ్రెస్  పార్టీ ఇంత నీచమైన ఆలోచన చేస్తుందని తెలిసి కూడా దానికి అడ్డుచెప్పలేదు ఎందుకని? కేవలం పదవి ఊడిపోతుందేమోనన్న భయంతోనే విభజనకు అడ్డు చెప్పలేదు. కాంగ్రెస్ ఈ ఆలోచన చేస్తుందన్న విషయం దిగ్విజయ్‌సింగ్ గారు ప్రకటన చేసేంత వరకు కిరణ్ కుమార్‌రెడ్డి గారు గోప్యంగా ఉంచిన మాట వాస్తవం కాదా? చేయాల్సిన అన్యాయం అంతా చేసేసిన తర్వాత.. ప్రజలు తనను సమాధానం చెప్పమని ఎక్కడ నిలదీస్తారోనని, ప్రజలు అడగాల్సిన ప్రశ్నలన్నింటినీ మళ్లీ ప్రజల్నే అడిగారంటే ఈ సీఎంకు ఎన్ని తెలివితేటలు ఉన్నాయని అనుకోవాలి.
 
బాబూ.. చేసిందంతా చేసి మొసలి కన్నీరా?
ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్షం నేత చంద్రబాబుగారికి ఏమైనా చలనం ఉందా? అసలు చ లనం ఎలా ఉంటుంది? రాష్ట్ర విభజనకు కారణమే ఆయన. ఒక బ్లాంకు చెక్కు ఇచ్చేసినట్టు తెలంగాణ  ఇచ్చేసుకోండి అని తెలంగాణకు అనుకూలంగా లేఖలు రాసిచ్చింది ఈ చంద్రబాబుగారే. కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రాన్ని విభజించే సాహసం చేసిందంటే అందుకు కారణం. చంద్రబాబు. పట్టపగలే ఇలా సీమాంధ్రుల గొంతు కోసిన చంద్రబాబు.. ఇప్పుడు ఆత్మగౌరవ యాత్ర అని చేస్తున్నాడట. ఇది హత్య చేసి ఆ శవం మీదే పడి వెక్కివెక్కి ఏడ్చినట్టుగా ఉంది. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చేసి ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టడానికి చంద్రబాబు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు.
 
మనరాష్ట్రంలో 8 కోట్ల మంది జనాభా ఉంటే అందులో 5 కోట్ల మంది సీమాంధ్రులే. ఇంత మందికి అన్యాయం జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఇన్ని కోట్ల మంది ప్రజల పక్షాన నిలబడి వారి పక్షాన గొంతు విప్పాల్సింది పోయి చంద్రబాబు గారు తనకు ఏమీ పట్టనట్టు తన స్వార్థం కోసం మౌనంగా ఉన్నాడంటే ఈయనను ప్రధాన ప్రతిపక్షం నాయకుడు అనలా లేకపోతే దుర్మార్గుడు అనలా? తెలుగుదేశం పార్టీతో సహా ఐదు పార్టీలు ఈ విభజనకు అనుకూలంగా ఉన్నాయని ప్రకటిస్తే.. మూడు పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, ఎంఐఎం విభజనకు అనుకూలం అని ఎప్పుడూ చెప్పలేదు. చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏమాత్రం నిజాయితీ ఉన్నా తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడం తప్పయిపోయిందని చెంపలు వేసుకొని చంద్రబాబు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి. కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేయడం తగదు అని చెప్పి అందుకు నిరసనగా ఆయన, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రాజీనామాలు చేయాలి. చంద్రబాబు తన లేఖను వెనక్కి తీసుకునేంత వరకు, ఆయన ఎమ్మెల్యేలు, ఎంపీల చేత రాజీనామాలు చేయించేంత వరకు ఆయననుగాని, టీడీపీ నాయకులను గాని సీమాంధ్రలో అడుగుపెట్టడానికి వీలులేదని తరిమితరిమి కొట్టాలి.
 
ఎన్నిసార్లు చెప్పినా...  దున్నపోతు మీద వాన పడ్డట్టేనా?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్‌లో కలిసిపోతుందని చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. ఆయన ఇలా ఆరోపించడం మొదటిసారి కాదు, ఆఖరిసారి కాదు. మేం ఎన్నిసార్లు సమాధానం చెప్పినా దున్నపోతు మీద వాన పడినట్టే. అయినా సరే చంద్రబాబు గారికి మళ్లీ సమాధానం చెప్తున్నాం. ఎఫ్‌డీఐ ఓటింగ్ విషయంలో రైతులు, చిన్న వర్తకులను మోసం చేసి కాంగ్రెస్‌తో కుమ్మక్కై మీ ఎంపీలను గైర్హాజరు పరిచింది మీరు కాదా చంద్రబాబు? ఏకంగా రూ.32 వేల కోట్ల కరెంటు చార్జీల భారం ప్రజల నెత్తిన మోపితే అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెడితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈగ కూడా వాలడానికి వీల్లేదని నిస్సిగ్గుగా విప్ జారీ చేసి మరీ ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోకుండా కాపాడింది మీరు కాదా? పార్లమెంటు ఎన్నికల నుంచి పంచాయతీ ఎన్నికల దాకా.. ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎమ్మెల్యే ఉప ఎన్నికలు ఇలా ఏ ఎన్నికలైనా కాంగ్రెస్‌తో పాలునీళ్లలా కలిసి పోయి కుమ్మక్కైంది మీరు కాదా చంద్రబాబూ..?
 
 ఐఎంజీ, ఎమ్మార్ లాంటి కేసుల్లో తనపై విచారణ జరగకుండా చీకట్లోనే చిదంబరాన్ని కలిసి చీకటి ఒప్పందాలు చేసుకొన్నది మీరు కాదా? ఆఖరికి వైఎస్సార్ చనిపోయారన్న ఇంగితం కూడా లేకుండా ఆయన మీద రూ.లక్ష కోట్లని అబద్ధపు ఆరోపణలు చేసి, కాంగ్రెస్‌తో కుమ్మక్కై జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టించింది మీరు కాదా? ఇప్పుడు ఇంత అన్యాయం జరుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని విడగొడతామని చెప్తున్నా ఆ విభజనకు మీరు మద్దతు పలుకుతున్నారే ఇది మీ కుమ్మక్కుకు రుజువు కాదా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీకి చెందిన నాయకులు అందరూ రాజీనామాలు చేసి, నిరాహార దీక్షలు చేశారు. ఇది అన్యాయం రాష్ట్రాన్ని విడగొట్టొద్దని లేఖలు రాస్తున్నారు. పోరాటం చేస్తూనే ఉన్నారు. మరి మీరేం చేశారు చంద్రబాబు గారు? ఇది అన్యాయమని, దానికి నిరసనగా మీరుగాని మీ ఎమ్మెల్యేలుగాని, ఎంపీలు గాని రాజీనామాలు చేశారా? తెలంగాణకు అనుకూలంగా మీరు ఇచ్చిన లేఖను  వెనక్కి తీసుకున్నారా? విభజనకు మద్దతు పలుకుతోంది, ఈ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైంది మీరు కాదా.. గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి చంద్రబాబు గారూ..?
 
ప్రజల తరఫున ఎందరు నేతలు గొంతెత్తారు?
హఠాత్తుగా ఎలాంటి పరిష్కారం చూపించకుండానే మన రాష్ట్రాన్ని విడగొడుతున్నారన్న సంకేతాలు పంపించిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులంతా రాజీనామాలు చేశారు. సీమాంధ్రకు చెందిన ఎందరు కాంగ్రెస్, టీడీపీ నాయకులు వాళ్ల పదవులను త్యాగం చేసి ప్రజల తరఫున గొంతెత్తారు? వైఎస్సార్సీపీ నాయకులు రాజీనామా చేసినప్పుడే కాంగ్రెస్, టీడీపీ నాయకులు కూడా రాజీనామాలు చేసి ఉంటే రాష్ట్రంలో జరుగుతున్న ఈ అన్యాయాన్ని దేశమంతా చూసి ఉండేది, కాంగ్రెస్ తన నిర్ణయాన్ని మార్చుకునేలా ఒత్తిడి పెరిగి ఉండేది. ఈ విభజన ప్రక్రియే ఆగిపోయి ఉండేది. కానీ ఈ కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఓట్లేసిన ప్రజల కంటే పదవులే ముఖ్యమని నిరూపించుకున్నారు’’
 
తోడుగా ఉంటామని మీకు మాటిస్తున్నాం..
ఇది ప్రజాస్వామ్య దేశమనే సంగతి కూడా మరిచిపోయి కాంగ్రెస్ అడ్డగోలు విభజనకు పూను కుంది. కేవలం ఓట్లు, సీట్ల కోసం టీఆర్‌ఎస్‌ను తమలో కలుపుకోనైనా సరే రాహుల్‌గాంధీని ప్రధానమంత్రి చేయాలన్న ఏకైక లక్ష్యంతో కోట్ల మంది ప్రజలను అన్యాయం చేయడానికి సిద్ధమైంది. తెలుగువారి భిక్షతో కేంద్రంలో, రాష్ట్రంలో గద్దెనెక్కి కూర్చొని తెలుగువారికే వెన్నుపోటు పొడిచింది. ఉద్యోగులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, మహిళలు.. ఒక్కరు కాదు... ఇద్దరు కాదు... కోట్లమంది రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. కానీ దుర్మార్గంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వారిపై కూడా కేసులు పెట్టింది. ఎన్జీవోలైతే వారి జీతాలను కూడా త్యాగం చేసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాటం చేస్తుంటే ఈ ప్రభుత్వం జీతాలివ్వకుండా వారి కడుపు మీద కొట్టే ప్రయత్నం చేస్తోంది.  మీ అందరికీ అండగా మేం నిలబడతామని, మీతో కలిసి పోరాటం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్జీవో సంఘాలకు, ఎన్జీవో సభ్యులకు మాటిస్తున్నాం.    
- షర్మిల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement