samaikya sankharavam bus yatra
-
విచారణ కోరే దమ్ముందా ?: షర్మిల
అవినీతి కేసులపై చంద్రబాబుకు షర్మిల సవాల్ చాలా ధర్మంగా ఆస్తులు సంపాదించానని అన్నారట ఢిల్లీ వెళ్తున్నారు కదా.. ఐఎంజీ, ఎమ్మార్, ఇతర కేసుల్లో మీ అవినీతిపై విచారణ జరపాలని రాష్ట్రపతి, ప్రధానిని కోరతారా? కాంగ్రెస్‌తో కుదిరిన ఏ డీల్ ప్రకారం రాష్ట్ర విభజనకు మద్దతు పలుకుతున్నారు? ఏ డీల్ కోసం ఇప్పుడు ఢిల్లీ వెళుతున్నారు.. ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ రాష్ట్ర విభజనకు పూనుకుంది చంద్రబాబు ఇప్పటికైనా తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకోవాలి చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేయాలి.. అప్పటిదాకా సీమాంధ్రలో అడుగుపెట్టనీయకుండా తరిమికొట్టండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, ఎంఐఎంలు మాత్రమే సమైక్యాంధ్రప్రదేశ్ కోరుకుంటున్నాయి శ్రీకాకుళంలో ముగిసిన సమైక్య శంఖారావం బస్సు యాత్ర ‘సమైక్య శంఖారావం’ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘చంద్రబాబుగారూ.. మీ ఆస్తులు రూ.40 లక్షలని, మీ కుటుంబ ఆస్తులు రూ.41 కోట్లు అని డిక్లేర్ చేశారట. చాలా ధర్మంగా మీరు ఆ ఆస్తులు సంపాదించానని అన్నారట! ఒకే ఒక మాట అడుగుతున్నాను.. నిజంగానే మీ ఆస్తులన్నీ అంత ధర్మంగా సంపాదించి ఉంటే, మీలో అవినీతి లేకపోతే.. ఎలాగూ మీరు ఢిల్లీకి వెళ్తున్నారు కదా.. ఐఎంజీ, ఎమ్మార్ కేసులతోపాటు మీపై అవినీతి ఆరోపణలు ఉన్న అన్ని కేసుల్లో విచారణ జరపాలని రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి లేఖలు రాసి విచారణ కోరే ధైర్యం ఉందా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీతో కుదుర్చుకున్న ఏ డీల్ ప్రకారం.. సీమాంధ్రులకు ఇంత అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర విభజనకు మద్దతు పలుకుతున్నారని చంద్రబాబును నిలదీశారు. ‘‘ఏ డీల్ ప్రకారం తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవడం లేదు? ఏ డీల్ కోసమని మీ ఎంపీలను ఢిల్లీకి పంపారు? ఇప్పుడు ఏ డీల్ కోసం మీరు కూడా ఢిల్లీకి వెళ్తున్నారు?’’ అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సుయాత్ర 14వ రోజు సోమవారంతో ముగిసింది. శ్రీకాకుళం జిల్లా రాజాం, శ్రీకాకుళం పట్టణంలో నిర్వహించిన సమైక్య శంఖారావం సభలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారిని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే.. ఏ డీల్ ప్రకారం విచారణలు జరగకుండా చూసుకుంటున్నారు? ‘‘అన్నింటా కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై చివరకు సీమాంధ్రులకు తీరని అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర విభజనకు మద్దతు పలుకుతున్న చంద్రబాబు గారు అంటారూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైందట! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్‌తో డీల్ పెట్టుకుందట. నిజంగానే మేం కాంగ్రెస్ పార్టీతో డీల్ పెట్టుకుంటే ఈరోజు జగన్మోహన్రెడ్డిగారు 16 నెలలుగా జైల్లో ఉండేవారా? డీల్ పెట్టుకొని ఉంటే చిరంజీవిగారి మాదిరిగా జగన్మోహన్రెడ్డి ఏ కేంద్ర మంత్రో అయ్యేవారు కాదా? ఏ ముఖ్యమంత్రో అయిపోయే వారు కాదా? 16 నెలలుగా నేరం రుజువు కాకుండానే జగన్మోహన్రెడ్డి గారు జైల్లో ఉన్నారంటే ఎవరు ఎవరితో కుమ్మక్కయినట్టు? ఎవరు ఎవరితో డీల్ పెట్టుకున్నట్టు? ఏ డీల్ ప్రకారం ఎఫ్‌డీఐ విషయంలో మీ ఎంపీలను గైర్హాజరు చేయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి సహాయపడ్డారు. ఏ డీల్ ప్రకారం చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో కలవక ముందు అవిశ్వాసం పెట్టకుండ, ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో కలిసిన తర్వాత, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోదన్న నమ్మకం ఏర్పడ్డ తర్వాత అవిశ్వాసం పెట్టారు మీరు? ఏ డీల్ ప్రకారం రెండోసారి అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే మీరు మాత్రం విప్ జారీ చేసి మరీ, నిస్సిగ్గుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడారు? ఏ డీల్ ప్రకారం పార్లమెంటు ఎన్నికల నుంచి పంచాయతీ ఎన్నికల దాకా ఏ ఎన్నికలు వచ్చినా పాలునీళ్లుగా కాంగ్రెస్‌తో కలిసిపోయి పనిచేస్తున్నారు? ఏ డీల్ ప్రకారం మీపై సీబీఐ, ఈడీ విచారణలు జరగకుండా చూసుకుంటున్నారు? ఐఎంజీ కేసులో హైదరాబాద్ నడిబొడ్డున 850 ఎకరాలను మీ బినామీ కంపెనీలకు ఇస్తే.. చంద్రబాబు నాయుడును విచారించడానికి మా వద్ద సిబ్బంది లేదు అని సీబీఐ అంటే మీరు ఏ డీల్ పెట్టుకున్నట్టు చంద్రబాబు గారు? ఎమ్మార్ కేసులో 550 ఎకరాలను మీరు మీ వాళ్లకు ఇచ్చుకుంటే మీ సీబీఐ ఏమో మిగతా వాళ్లందరిపై కేసులు పెడుతుంది, జైల్లో పెడుతుంది, కానీ మిమ్ములను మాత్రం కనీసం విచారణకు కూడా రమ్మనడం లేదంటే మీరు కుదుర్చుకున్న డీల్ కాదా చంద్రబాబుగారు..? ఏ డీల్ కోసం చిదంబరం గారిని, భరద్వాజ్ గారిని, ఆహ్మద్‌పటేల్ గారిని కలిశారు? ఇంకా కలుస్తూనే ఉన్నారు? 16 నెలలైనా రాజ్యాంగం ఇచ్చిన హక్కును కాదని జగన్‌కు బెయిల్రాకుండా ఈరోజు వరకు ఆపుతున్నారంటే డీల్ చేసుకుంది మీరు కాదూ చంద్రబాబు గారూ..?’’ ఓట్లు, సీట్ల కోసం జాతినే చీల్చుతున్నారు.. ‘‘కాంగ్రెస్ పార్టీ కేవలం ఓట్లు, సీట్ల కోసం, వారి స్వార్థ రాజకీయాల కోసం ఒక జాతినే చీల్చడానికి సిద్ధమైంది. టీఆర్ఎస్ను తమలో కలుపుకొనైనా సరే కేంద్రంలో లబ్ధి పొంది రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవడం కోసం విభజన అనే పేరుతో గొడ్డలితో నరికినట్లు ఈ రాష్ట్ర్రాన్ని రెండు ముక్కలు చేసి, అన్నదమ్ముల మధ్య చిచ్చుపెడతారా? మా ఓట్లు దండుకొని మా కళ్లే పొడుస్తారా? మా ఓట్లు దండుకొని మా బతుకులే బుగ్గిపాలు చేస్తారా అని ఈరోజు కోట్లమంది ప్రజలు కాంగ్రెస్ పార్టీని నిలదీస్తున్నారు. రైతులు, కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, మహిళలు అందరూ రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. కోట్ల మంది గుండెలు రగిలిపోతున్నాయి. కానీ ఈ కాంగ్రెస్, టీడీపీ నాయకులు మాత్రం చర్చలంటూ రోజుకు ఒకరి ఇంట్లో కూడి విందులు చేసుకుంటున్నారు. అదీ వీళ్లకు ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి! విభజన గురించి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిగారికి, బొత్సగారికి ముందుగానే తెలుసునని కేబినెట్ మంత్రి కిశోర్ చంద్రదేవ్ చెప్పారు. అంటే వీళ్లకు రాష్ట్రాన్ని చీల్చుతారన్న సంగతి తెలిసి కూడా వాళ్ల పదవులు వాళ్లకు ఉంటే చాలని విభజనను అడ్డుకోలేదంటే వారిని ఏమనాలి? చేసిందంతా చేసి.. చంద్రబాబు చేసిందంతా చేసి ఇప్పుడేమో విభజనకు కారణం వైఎస్సార్ అంటున్నారు. స్వయంగా ప్రధానమంత్రితో సహా రాష్ట్రంలో కోట్ల మంది ప్రజలు వైఎస్సార్ బతికే ఉంటే మన రాష్ట్రానికి ఈ గతి పట్టేదే కాదు అని చెప్తుంటే.. వైఎస్సార్ ఈ విభజనకు కారణం ఎలా అవుతారు చంద్రబాబు గారు? తెలుగుదేశం పార్టీతో సహా ఐదు పార్టీలు రాష్ట్ర విభజనకు మద్దతు పలికితే.. మూడు పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, ఎంఐఎం పార్టీలు ఎప్పుడూ విభజనకు మద్దతు పలకలేదు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉన్నా.. నిజాయితీ ఉన్నా ఇప్పటికైనా ఈ మూడు పార్టీల పక్షాన చేరాలి. కోట్ల మంది ప్రజలకు క్షమాపణ చెప్పి తప్పయిపోయిందని చెంపలు వేసుకొని తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి. ఆయన, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేయాలి. అంతవరకు చంద్రబాబు నాయుడుగాని, టీడీపీ నాయకులను గాని సీమాంధ్రలో అడుగుపెట్టడానికి వీలు లేదని చెప్పి ప్రజలంతా తరిమితరిమి కొట్టాలి. న్యాయం చేయడం మీ ఉద్దేశం కాదని తేలిపోయింది కనుక రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మా పార్టీ డిమాండ్ చేస్తోంది. మా పార్టీ స్టాండ్ సమైక్య ఆంధ్ర ప్రదేశ్. కోట్ల మందికి అన్యాయం జరుగుతుంటే జగనన్న చేతులు కట్టుకొని కూర్చోరు. సమైక్య రాష్ట్రం కోసం జగనన్న నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎందాకైనా పోరాటం చేస్తుంది’’ జీతం పువ్వుల్లో పెట్టి ఇస్తాం.. ‘‘సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న ఏపీన్జీవోల మీద, ప్రజల మీద ఈ సర్కారు కేసుల పెట్టి హింసిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, జగనన్న ముఖ్యమంత్రి కావడం ఖాయం. జగనన్న సీఎం అయిన తర్వాత ఉద్యమకారుల మీద పెట్టిన కేసులు ఎత్తివేయడం జరుగుతుంది. తెలంగాణను వేరు చేయవద్దని, రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచాలని మన అన్నలు, మన అక్కలు ఎంతో కృషి చేస్తూ రోజుల తరబడి రోడ్ల మీదనే గడుపుతున్నారు. వీరికి ఈ సర్కారు కనీసం జీతం కూడా ఇవ్వడం లేదంటే వీళ్లను మనుషులు అనలా? లేక రాక్షసులు అనలా? ఏపీఎన్జీవో సంఘాల సభ్యులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాటిచ్చి చెప్తోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. జగన్మోహన్రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినవెంటనే ఒకవేళ అంతవరకు ఈ ప్రభుత్వం మీకు జీతాలు చెల్లించకపోతే.. ఆ జీతాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీకు పువ్వుల్లో పెట్టి చెల్లిస్తుంది. మీ జీతాలు చెల్లించడంతో పాటు ఒకనెల బోనస్ కూడా ఇచ్చి మిమ్ముల్ని గౌరవిస్తుందని జగనన్న తరఫున మీకు మాట ఇస్తున్నాం’’ - షర్మిల యాత్ర సాగిందిలా.. సోమవారం సమైక్య శంఖారావం బస్సుయాత్ర విజయనగరం జిల్లా సాలూరు నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి శ్రీకాకుళం జిల్లా రాజాం చేరింది. ఇక్కడ జరిగిన సమైక్య శంఖారావం సభకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. వారిని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో యాత్ర ముగింపు సభలో షర్మిల మాట్లాడారు. ఆమె ప్రసంగించినంత సేపూ వర్షం కురిసింది. వర్షంలో తడుస్తూనే ప్రజలు ప్రసంగం విన్నారు. సోమవారం బస్సుయాత్రలో పాల్గొన్న నేతల్లో ఎమ్మెల్యేలు సుజయకృష్ణా రంగారావు, ధర్మాన కృష్ణదాసు, విజయనగరం జిల్లా పార్టీ కన్వీనర్, మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు, శ్రీకాకుళం జిల్లా పార్టీ కన్వీనర్ ధర్మాన పద్మప్రియ, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం, మాజీ ఎంపీ కణితి విశ్వనాథం, మాజీ ఎమ్మెల్యేలు కుంభ రవిబాబు, కంబాల జోగులు, బగ్గు లక్ష్మణరావు, ముదునూరు ప్రసాదరాజు, పార్టీ నేతలు పాలవలస రాజశేఖరం, వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురాం, బేబి నాయిన శ్రీకాకుళం జిల్లా స్థానిక నాయకులు సూర్యనారాయణ, వరుదు కళ్యాణి, కిల్లి రామ్మోహన్రావు, విశ్వాసరాయి కళావతి, పాలవలస విక్రాంతు, పీఎంజే బాబు, దువ్వాడ శ్రీనివాస్, గొర్లె కిరణ్, వజ్జె బాబూరావు, కల్మట వెంకటరమణ, కూన మంగమ్మ, తదితరులు ఉన్నారు. ప్రతిరోజు షర్మిల వెంట ఉన్నవారిలో వైఎస్ రాయల్‌రెడ్డి, డాక్టర్ హరికృష్ణ, అందూరి రాజగోపాల్‌రెడ్డి, ఆవుల భాస్కర్‌రెడ్డి, వి.ఇమాం భాష, ప్రచార కమిటీ సహాయ సమన్వయకర్త జొన్నల శ్రీనివాస్‌రెడ్డి, యాత్ర సమన్వయకర్త బృందం సభ్యులు గుత్తిరెడ్డి చంద్రహాస్‌రెడ్డి, పోలసాని సురేష్ కుమార్, లంకపోతు సబ్బారెడ్డి, దాడి విజయభాస్కర్‌రెడ్డి, నూనె దశరథరామిరెడ్డి, అంబటి రాఘవరెడ్డి తదితరులు ఉన్నారు. ముగిసిన బస్సు యాత్ర: తలశిల షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం బస్సుయాత్ర సోమవారంతో పూర్తయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు షెడ్యూల్ ప్రకారం షర్మిల 13 జిల్లాల్లో పర్యటించారని తెలిపారు. మొత్తం 80 నియోజకవర్గాలు, 115 మండలాలు, 32 మున్సిపాలిటీలు, 7కార్పొరేషన్లలో 2,245 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగిందని, 34 బహిరంగ సభల్లో షర్మిల ప్రసంగించారని తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యం గానే ఉంచాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని, తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు.. తన యాత్రకు ప్రజల ఆదరణ లేకే మధ్యలోనే ముగించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. -
చీకటి ఒప్పందాల కోసమే.. చంద్రబాబు ఢిల్లీ పర్యటన : షర్మిల
టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై షర్మిల ధ్వజం బాబూ.. జగన్ బెయిల్ తెరమీదికి వచ్చిందనే కదా మీరు ఢిల్లీ వెళుతున్నది? చీకట్లోనే చిదంబరాన్ని కలిసి ఒప్పందాలు చేసుకోవడానికే కదా? గతంలో ఇలాగే మీ ఎంపీలు వెళ్లి ‘సాక్షి’ ఆస్తులను అటాచ్ చేయించి బెయిల్‌ను అడ్డుకోలేదా? నాడు మీరు జెడ్‌ప్లస్ కమాండోలను కూడా కాదని మీడియా కళ్లుగప్పి చీకట్లో చిదంబరాన్ని కలవలేదా? తెలంగాణపై లేఖను వెనక్కు తీసుకోకుండా ఢిల్లీ ఎందుకెళుతున్నారు? ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించాలని చూస్తోంది టీడీపీ సహా ఐదు పార్టీలు విభజనకు అనుకూలంగా ఉంటే.. వైఎస్సార్ సీపీ, ఎంఐఎం, సీపీఎం ఏనాడూ అనుకూలమని చెప్పలేదు చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. లేఖను వెనక్కు తీసుకొని, రాజీనామాలు చేయాలి ‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ విషయంలో రాజకీయాలు చేయడానికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ వెళుతున్నారని జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ‘‘చంద్రబాబుగారూ.. జగన్మోహన్రెడ్డి బెయిల్ విషయం మళ్లీ తెరమీదికి వచ్చిందన్న కారణంతోనే మీరు ఇప్పుడు ఢిల్లీకి వెళ్లడం లేదా? మళ్లీ చీకట్లోనే చిదంబరాన్ని కలిసి చీకటి ఒప్పందాలు చేసుకోవడానికి కాదా మీరు ఢిల్లీకి వెళుతున్నది? కాంగ్రెస్ వారితో కలిసి కుట్రలు పన్నడానికి కాదా చంద్రబాబూ మీరు ఢిల్లీకి వెళుతున్నది?’’ అని షర్మిల ప్రశ్నించారు. ‘‘గతంలో ఇలాగే ఒక్క రోజులో బెయిల్ ఇస్తున్నారనగా.. మీ ఎంపీలను పంపి ‘సాక్షి’ ఆస్తులను అటాచ్ చేయించి బెయిల్‌ను అడ్డుకున్నారు. గతంలో మీ జెడ్‌ప్లస్ పోలీస్ కమాండోలు కూడా అవసరం లేదని చెప్పి.. మీడియా కళ్లు గప్పి మరీ చిదంబర రహస్య భేటీలు జరిపారు. మళ్లీ అందుకే కదా బాబూ ఇప్పుడు మీరు ఢిల్లీ వెళుతున్నది? లేకపోతే జెడ్‌ప్లస్ కేటగిరీ ఉన్న మీరు.. ఒక దొంగలా అందరి కళ్లూ గప్పి.. అహ్మద్ పటేల్‌ను కలవడానికి వెళుతున్నారా? లేకపోతే సోనియా గాంధీ కాళ్ల మీదపడి జగన్మోహన్రెడ్డికి ఎలాగైనా సరే బెయిల్ రాకుండా చూడండి అని వేడుకోవడానికి వెళుతున్నారా?’’ అని ఆమె నిలదీశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర 11వ రోజు శుక్రవారం తూర్పు గోదావరి జిల్లాలో సాగింది. రావులపాలెం, అమలాపురం పట్టణాల్లో ‘సమైక్య శంఖారావం’ సభలకు భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే.. దమ్ముంటే సమాధానం చెప్పండి.. ‘‘ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీకి వెళ్తారట. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోకుండా ఢిల్లీకి వెళ్లి ఏం ప్రయోజనం చంద్రబాబూ? నిజం చెబుతారని కాదుగానీ.. అసలు మీరు ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారో చెప్పండి. తెలంగాణకు అనుకూలంగా మీరు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోకుండా.. ఎందుకు ఢిల్లీకి వెళ్తున్నారో మీకు దమ్ముంటే సమాధానం చెప్పండి. మొన్న సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న కొంత మంది చంద్రబాబు దగ్గరకు వెళ్లి ఆయన యాత్రను అడ్డుకున్నారట. దానికి చంద్రబాబు వారి మీద మండిపడ్డారట. మీ అంతు చూస్తానని బెదిరించారట. మీ ఇళ్లలోనే కాదు, మీ ఊళ్లలో ఎలా ఉంటారో చూస్తానని చంద్రబాబు వారిని బెదిరించారట. చంద్రబాబూ.. మీరు మీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారా? అసలు ఏమనుకుంటున్నారండీ మీ గురించి మీరు? విభజనకు కారణమే చంద్రబాబు.. తెలంగాణను ఇచ్చేసుకుంటే ఇచ్చేసుకోండి అని ఒక బ్లాంకు చెక్కు మీద సంతకం పెట్టినట్టు లేఖలు రాసిచ్చేశారు చంద్రబాబు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మన రాష్ట్రాన్ని విభజించే సాహసం చేస్తోందంటే దానికి కారణం చంద్రబాబు విభజనకు పలికిన మద్దతే. హత్య చేసి ఆ శవం మీదే పడి వెక్కివెక్కి ఏడ్చినట్టు చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేఖనిచ్చేసి ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. మన రాష్ట్రంలో 60 శాతం మంది ప్రజలకు గొప్ప అన్యాయం జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఈయన చేయాల్సిన పని పాలకపక్షం కాలర్ పట్టుకొని నిలదీయడం. కానీ, దిగ్విజయ్ సింగ్ ప్రకటన చేసిన వెంటనే ఈయన ప్రెస్‌మీట్ పెట్టి.. హైదరాబాద్‌ను రూ.4 లక్షల కోట్లకు అమ్మకానికి పెట్టారంటే ఇంతకంటే దుర్మార్గుడు, ఇంతకంటే ద్రోహి ఇంకొకరు ఉంటారా? తెలుగుదేశం పార్టీ సహా ఐదు పార్టీలు ఈ విభజనకు అనుకూలంగా ఉన్నామని చెప్తే.. మూడు పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, ఎంఐఎం విభజనకు అనుకూలమని ఏనాడూ చెప్పలేదు. చంద్రబాబుకు నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఆయనకు ఏమాత్రం నిజాయితీ ఉన్నా తెలంగాణకు తను కూడా వ్యతిరేకం అని ఈ మూడు పార్టీల పక్షాన నాలుగో పార్టీగా నిలబడాలి. ప్రజలకు క్షమాపణ చెప్పి తెలంగాణకు అనుకూలంగా తను ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకోవాలి. ఆయన, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రాజీనామాలు చేసి నిరసన తెలియజేయాలి. సీఎం తెలిసీ గోప్యంగా ఉంచారు.. కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసం, టీఆర్ఎస్ను తమలో కలుపుకొనైనా సరే కేంద్రంలో లబ్ధి పొంది రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేయడానికి పూనుకొంది కాంగ్రెస్ పార్టీ. తెలుగువారి ఓట్లు దండుకొని తెలుగువారిపైనే వేటు వేసింది. తెలుగువారి భిక్షతో కేంద్రంలో, రాష్ట్రంలో గద్దెనెక్కి కూర్చొని తెలుగువారికే వెన్నుపోటు పొడిచింది. ఇంత జరుగుతోంటే ఈ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి దిష్టిబొమ్మ లాగా కూర్చున్నారు. మన రాష్ట్రాన్ని చీల్చుతున్నారనే సంగతి ఈయనకు ఎప్పుడో తెలుసు. ఆయినా దానికి అడ్డు చెప్తే ఈయన పదవి పోతుందనుకొని అడ్డు చెప్పలేదు, దిగ్విజయ్‌సింగ్ వచ్చి మన రాష్ట్రాన్ని చీల్చుతున్నామని ప్రకటన చేసేంత వరకు కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. విభజన సంకేతాలు రాగానే వైఎస్సార్ సీపీ రాజీనామాలు.. హఠాత్తుగా ఎలాంటి పరిష్కారమూ చూపించకుండానే మన రాష్ట్రాన్ని విడగొడుతున్నారన్న సంకేతాలు వచ్చిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతమంది నాయకులు రాజీనామాలు చేశారు. గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి రాజీనామాలు చేసి.. నిరాహార దీక్షలు కూడా చేశారు. లేఖల మీద లేఖలు రాస్తూ మన రాష్ట్రాన్ని విడగొట్టొద్దని, రాష్ట్రానికి అన్యాయం చేయొద్దని ఈ రోజు వరకు పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ సీమాంధ్రకు చెందిన ఎంతమంది కాంగ్రెస్, టీడీపీ నాయకులు రాజీనామాలు చేసి ప్రజల తరఫున గొంతెత్తారు?’’ బాబూ.. మీకు అంటువ్యాధులున్నాయా? ‘‘చంద్రబాబును చూసి వైఎస్ రాజశేఖరరెడ్డి భయపడేవారని చంద్రబాబు అంటున్నారట. చంద్రబాబూ.. మిమ్మల్ని చూసి ఎవరైనా భయపడటానికి మీకేమైనా అంటు వ్యాధులు ఉన్నాయా? మిమ్మల్ని చూస్తే వైఎస్సార్ ఒక జోకర్‌ను చూసినట్టు ఎంతలా నవ్వుకునేవారో మీకు గుర్తులేదా? చంద్రబాబూ.. సాక్షి టీవీకి చెప్పి ఆ క్లిప్పింగులు వేయించమంటారా?’’ - షర్మిల -
నేతలా.. ఊసరవెల్లులా ? : షర్మిల
పదవి రాకముందు ఒకమాట.. వచ్చిన తర్వాత మరోమాటా?: షర్మిల ఢిల్లీ దర్బారులో వంగివంగి సలాం చేస్తూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు... గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచారు తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు ఇచ్చిన లేఖ వల్లే కాంగ్రెస్ విభజనకు పూనుకుంది ఓట్లు, సీట్ల కోసమే ఈ కాంగ్రెస్ పార్టీ..రాష్ట్రాన్ని చీల్చాలనుకుంటోంది టీడీపీ సహా ఐదు పార్టీలు విభజనకు అనుకూలంగా ఉంటే.. వైఎస్సార్ సీపీ, సీపీఎం, ఎంఐఎం మాత్రమే సమైక్యంగా ఉండాలన్నాయి చంద్రబాబు తన లేఖను వెనక్కి తీసుకోవాలి.. పార్టీ నేతలతో రాజీనామా చేయించాలి.. అప్పటిదాకా సీమాంధ్రలో అడుగుపెట్టనీయకుండా తరిమికొట్టండి సమైక్య శంఖారావం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఈరోజు రాష్ట్రమంతా అట్టుడికిపోతోంది. కోట్ల మంది గుండెలు రగిలిపోతున్నాయి. మా ఓట్లు దండుకొని మా కళ్లే పొడుస్తారా? మా ఓట్లు దండుకొని మా బతుకులే బుగ్గిపాలు చేస్తారా? అని ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తుంటే.. మన నాయకులు మాత్రం ఓట్లేసిన ప్రజల కంటే తమ పదవులే ముఖ్యమని మళ్లీ నిరూపించుకున్నారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మండిపడ్డారు. ‘‘పదవి రాకముందు ఒకమాట, పదవి వచ్చిన తరువాత ఒకమాట మాట్లాడుతున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు గారు మనుషులా లేక ఊసరవెల్లులా..’’ అంటూ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ర్ట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇంత మంది నేతలు సీమాంధ్రకు ఉండి కూడా.. అందరూ ఢిల్లీ దర్బారులో వంగివంగి సలాం చేస్తూ తెలుగు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని, ఓట్లేసి గెలిపించిన తెలుగు ప్రజలకు వెన్నుపొడిచారని విమర్శించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సుయాత్ర గురువారం పదో రోజు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో సాగింది. కృష్ణా జిల్లా కైకలూరు, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించిన ‘సమైక్య శంఖారావం’ సభలకు భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే... ‘‘కేబినెట్ మంత్రి కిశోర్ చంద్రదేవ్‌గారు అన్నారు.. కాంగ్రెస్ పార్టీ విభజన చేస్తుందని, ఆ విషయం గురించి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిగారికి, బొత్స గారికి మొదట్నుంచే పూర్తిగా తెలుసునని చెప్పారు. అంటే మన సీఎంకు కాంగ్రెస్ పార్టీ ఇంత నీచమైన ఆలోచన చేస్తుందని తెలిసి కూడా దానికి అడ్డుచెప్పలేదు ఎందుకని? కేవలం పదవి ఊడిపోతుందేమోనన్న భయంతోనే విభజనకు అడ్డు చెప్పలేదు. కాంగ్రెస్ ఈ ఆలోచన చేస్తుందన్న విషయం దిగ్విజయ్‌సింగ్ గారు ప్రకటన చేసేంత వరకు కిరణ్ కుమార్‌రెడ్డి గారు గోప్యంగా ఉంచిన మాట వాస్తవం కాదా? చేయాల్సిన అన్యాయం అంతా చేసేసిన తర్వాత.. ప్రజలు తనను సమాధానం చెప్పమని ఎక్కడ నిలదీస్తారోనని, ప్రజలు అడగాల్సిన ప్రశ్నలన్నింటినీ మళ్లీ ప్రజల్నే అడిగారంటే ఈ సీఎంకు ఎన్ని తెలివితేటలు ఉన్నాయని అనుకోవాలి. బాబూ.. చేసిందంతా చేసి మొసలి కన్నీరా? ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్షం నేత చంద్రబాబుగారికి ఏమైనా చలనం ఉందా? అసలు చ లనం ఎలా ఉంటుంది? రాష్ట్ర విభజనకు కారణమే ఆయన. ఒక బ్లాంకు చెక్కు ఇచ్చేసినట్టు తెలంగాణ ఇచ్చేసుకోండి అని తెలంగాణకు అనుకూలంగా లేఖలు రాసిచ్చింది ఈ చంద్రబాబుగారే. కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రాన్ని విభజించే సాహసం చేసిందంటే అందుకు కారణం. చంద్రబాబు. పట్టపగలే ఇలా సీమాంధ్రుల గొంతు కోసిన చంద్రబాబు.. ఇప్పుడు ఆత్మగౌరవ యాత్ర అని చేస్తున్నాడట. ఇది హత్య చేసి ఆ శవం మీదే పడి వెక్కివెక్కి ఏడ్చినట్టుగా ఉంది. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చేసి ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టడానికి చంద్రబాబు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. మనరాష్ట్రంలో 8 కోట్ల మంది జనాభా ఉంటే అందులో 5 కోట్ల మంది సీమాంధ్రులే. ఇంత మందికి అన్యాయం జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఇన్ని కోట్ల మంది ప్రజల పక్షాన నిలబడి వారి పక్షాన గొంతు విప్పాల్సింది పోయి చంద్రబాబు గారు తనకు ఏమీ పట్టనట్టు తన స్వార్థం కోసం మౌనంగా ఉన్నాడంటే ఈయనను ప్రధాన ప్రతిపక్షం నాయకుడు అనలా లేకపోతే దుర్మార్గుడు అనలా? తెలుగుదేశం పార్టీతో సహా ఐదు పార్టీలు ఈ విభజనకు అనుకూలంగా ఉన్నాయని ప్రకటిస్తే.. మూడు పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, ఎంఐఎం విభజనకు అనుకూలం అని ఎప్పుడూ చెప్పలేదు. చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏమాత్రం నిజాయితీ ఉన్నా తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడం తప్పయిపోయిందని చెంపలు వేసుకొని చంద్రబాబు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి. కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేయడం తగదు అని చెప్పి అందుకు నిరసనగా ఆయన, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రాజీనామాలు చేయాలి. చంద్రబాబు తన లేఖను వెనక్కి తీసుకునేంత వరకు, ఆయన ఎమ్మెల్యేలు, ఎంపీల చేత రాజీనామాలు చేయించేంత వరకు ఆయననుగాని, టీడీపీ నాయకులను గాని సీమాంధ్రలో అడుగుపెట్టడానికి వీలులేదని తరిమితరిమి కొట్టాలి. ఎన్నిసార్లు చెప్పినా... దున్నపోతు మీద వాన పడ్డట్టేనా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్‌లో కలిసిపోతుందని చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. ఆయన ఇలా ఆరోపించడం మొదటిసారి కాదు, ఆఖరిసారి కాదు. మేం ఎన్నిసార్లు సమాధానం చెప్పినా దున్నపోతు మీద వాన పడినట్టే. అయినా సరే చంద్రబాబు గారికి మళ్లీ సమాధానం చెప్తున్నాం. ఎఫ్‌డీఐ ఓటింగ్ విషయంలో రైతులు, చిన్న వర్తకులను మోసం చేసి కాంగ్రెస్‌తో కుమ్మక్కై మీ ఎంపీలను గైర్హాజరు పరిచింది మీరు కాదా చంద్రబాబు? ఏకంగా రూ.32 వేల కోట్ల కరెంటు చార్జీల భారం ప్రజల నెత్తిన మోపితే అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెడితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈగ కూడా వాలడానికి వీల్లేదని నిస్సిగ్గుగా విప్ జారీ చేసి మరీ ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోకుండా కాపాడింది మీరు కాదా? పార్లమెంటు ఎన్నికల నుంచి పంచాయతీ ఎన్నికల దాకా.. ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎమ్మెల్యే ఉప ఎన్నికలు ఇలా ఏ ఎన్నికలైనా కాంగ్రెస్‌తో పాలునీళ్లలా కలిసి పోయి కుమ్మక్కైంది మీరు కాదా చంద్రబాబూ..? ఐఎంజీ, ఎమ్మార్ లాంటి కేసుల్లో తనపై విచారణ జరగకుండా చీకట్లోనే చిదంబరాన్ని కలిసి చీకటి ఒప్పందాలు చేసుకొన్నది మీరు కాదా? ఆఖరికి వైఎస్సార్ చనిపోయారన్న ఇంగితం కూడా లేకుండా ఆయన మీద రూ.లక్ష కోట్లని అబద్ధపు ఆరోపణలు చేసి, కాంగ్రెస్‌తో కుమ్మక్కై జగన్మోహన్రెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టించింది మీరు కాదా? ఇప్పుడు ఇంత అన్యాయం జరుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని విడగొడతామని చెప్తున్నా ఆ విభజనకు మీరు మద్దతు పలుకుతున్నారే ఇది మీ కుమ్మక్కుకు రుజువు కాదా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షులు జగన్మోహన్రెడ్డి, పార్టీకి చెందిన నాయకులు అందరూ రాజీనామాలు చేసి, నిరాహార దీక్షలు చేశారు. ఇది అన్యాయం రాష్ట్రాన్ని విడగొట్టొద్దని లేఖలు రాస్తున్నారు. పోరాటం చేస్తూనే ఉన్నారు. మరి మీరేం చేశారు చంద్రబాబు గారు? ఇది అన్యాయమని, దానికి నిరసనగా మీరుగాని మీ ఎమ్మెల్యేలుగాని, ఎంపీలు గాని రాజీనామాలు చేశారా? తెలంగాణకు అనుకూలంగా మీరు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకున్నారా? విభజనకు మద్దతు పలుకుతోంది, ఈ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైంది మీరు కాదా.. గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి చంద్రబాబు గారూ..? ప్రజల తరఫున ఎందరు నేతలు గొంతెత్తారు? హఠాత్తుగా ఎలాంటి పరిష్కారం చూపించకుండానే మన రాష్ట్రాన్ని విడగొడుతున్నారన్న సంకేతాలు పంపించిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులంతా రాజీనామాలు చేశారు. సీమాంధ్రకు చెందిన ఎందరు కాంగ్రెస్, టీడీపీ నాయకులు వాళ్ల పదవులను త్యాగం చేసి ప్రజల తరఫున గొంతెత్తారు? వైఎస్సార్సీపీ నాయకులు రాజీనామా చేసినప్పుడే కాంగ్రెస్, టీడీపీ నాయకులు కూడా రాజీనామాలు చేసి ఉంటే రాష్ట్రంలో జరుగుతున్న ఈ అన్యాయాన్ని దేశమంతా చూసి ఉండేది, కాంగ్రెస్ తన నిర్ణయాన్ని మార్చుకునేలా ఒత్తిడి పెరిగి ఉండేది. ఈ విభజన ప్రక్రియే ఆగిపోయి ఉండేది. కానీ ఈ కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఓట్లేసిన ప్రజల కంటే పదవులే ముఖ్యమని నిరూపించుకున్నారు’’ తోడుగా ఉంటామని మీకు మాటిస్తున్నాం.. ఇది ప్రజాస్వామ్య దేశమనే సంగతి కూడా మరిచిపోయి కాంగ్రెస్ అడ్డగోలు విభజనకు పూను కుంది. కేవలం ఓట్లు, సీట్ల కోసం టీఆర్ఎస్ను తమలో కలుపుకోనైనా సరే రాహుల్‌గాంధీని ప్రధానమంత్రి చేయాలన్న ఏకైక లక్ష్యంతో కోట్ల మంది ప్రజలను అన్యాయం చేయడానికి సిద్ధమైంది. తెలుగువారి భిక్షతో కేంద్రంలో, రాష్ట్రంలో గద్దెనెక్కి కూర్చొని తెలుగువారికే వెన్నుపోటు పొడిచింది. ఉద్యోగులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, మహిళలు.. ఒక్కరు కాదు... ఇద్దరు కాదు... కోట్లమంది రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. కానీ దుర్మార్గంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వారిపై కూడా కేసులు పెట్టింది. ఎన్జీవోలైతే వారి జీతాలను కూడా త్యాగం చేసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాటం చేస్తుంటే ఈ ప్రభుత్వం జీతాలివ్వకుండా వారి కడుపు మీద కొట్టే ప్రయత్నం చేస్తోంది. మీ అందరికీ అండగా మేం నిలబడతామని, మీతో కలిసి పోరాటం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్జీవో సంఘాలకు, ఎన్జీవో సభ్యులకు మాటిస్తున్నాం. - షర్మిల