సీమాంధ్రలో వైఎస్సార్ సీపీ క్లీన్ స్వీప్ ఖాయం
ఆచంట, న్యూస్‌లైన్ : సీమాంధ్రలో వైఎస్సార్ సీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీమాంధ్రలో కింగ్‌గా తెలంగాణలో కింగ్ మేకర్‌గా పాత్ర పోషించనున్నారని చెప్పారు. ఆదివారం ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీమాంధ్రలో 140 ఎమ్మెల్యే సీట్లతో పాటు, 25 ఎంపీ స్థానాలలో విజయం సాధించబోతుందని చెప్పారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మోడీ అనే పువ్వును తీసుకువచ్చి సీమాంధ్ర ప్రజల చెవిలో పెట్టాలని చూస్తున్నారని, అది కూడా ప్రజలు గమనించారన్నారు.
వారి పప్పులు ఉడకకపోవడంతో పవన్ కల్యాణ్ అనే జోకర్‌ను తీసుకొచ్చారని రామచంద్రరావు విమర్శించారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరు, పవన్ అన్నదమ్ములిద్దరూ రూ.70 కోట్లకు పార్టీని అమ్మేసుకున్న ఘనులని ఎద్దేవా చేశారు. ప్రజారాజ్యం పేరుతో తన సామాజిక వర్గాన్ని వారు వారు ముంచేశారన్నారు. వైఎస్సార్ సీపీ సీమాంధ్రలో కాపులకు 32 ఎమ్మెల్యే టికెట్లతో పాటు, ఆరు ఎంపీ స్థానాలు కేటాయించి సముచిత స్థానం కల్పించిందన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ నాయకుడు కౌరు సర్వేశ్వరరావు, రాష్ట్ర మహిళా విభాగం నాయకురాలు మామిడిశెట్టి కృష్ణవేణి, జిల్లా కార్యకర్గ సభ్యుడు వైట్ల కిషోర్‌కుమార్, నెక్కంటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.