కాంగ్రెస్‌తో కుమ్మక్కైంది బాబే : షర్మిల | Sharmila takes on chandrababu naidu in samaikya sankharavam | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తో కుమ్మక్కైంది బాబే : షర్మిల

Published Fri, Sep 6 2013 2:04 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

Sharmila takes on chandrababu naidu in samaikya sankharavam

ఆ నిజాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇతర పార్టీలపై ఆరోపణలు: షర్మిల
కాంగ్రెస్‌తో, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కుమ్మక్కైందని చంద్రబాబు అంటున్నారు
అదే నిజమైతే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  అన్యాయంగా జైల్లో ఎందుకు ఉంటారు?
చిరంజీవిలా కేంద్రమంత్రో లేదా ముఖ్యమంత్రో అయ్యుండేవారు కదా?
ఎవరితో ఎవరు కుమ్మక్కయ్యారో ప్రజలు గమనిస్తున్నారు చంద్రబాబూ..
కాంగ్రెస్‌తో కుమ్మక్కై వైఎస్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో పెట్టించి ఆయన కొడుకును జైల్లో పెట్టించింది మీరు కాదా?
3 నెలల్లో రావాల్సిన బెయిల్ 16 నెలలవుతున్నా రాలేదంటే మీ కుమ్మక్కు కారణం కాదా?
ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ విభజనకు యత్నిస్తోంది
రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా మీరు, మీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయరేం?
విభజనకు అనుకూలంగా మీరిచ్చిన లేఖను వెనక్కు తీసుకొని.. సమైక్యానికి అనుకూలంగా ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎంలతో చేరాలి

 
 ‘‘రాజశేఖరరెడ్డి చనిపోయారే అన్న ఇంగితం కూడా లేకుండా.. ఆయన మీద లక్ష కోట్ల రూపాయలు అని అబద్ధపు ఆరోపణలు మొదలుపెట్టి.. ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్పించి ఆయన కొడుకునే జైల్లో పెట్టించారే... ఇది కాంగ్రెస్ పార్టీతో మీరు కుమ్మక్కయి పెట్టించిన కేసు కాదా చంద్రబాబూ? చట్టప్రకారం ఎవరికైనా 3 నెలల్లో బెయిల్ రావాలి.. కానీ 16 నెలలవుతున్నా ఇప్పటివరకు బెయిల్ రాలేదు.. నేరమూ రుజువు కాలేదు.. ఇంతవరకు జగన్‌మోహన్‌రెడ్డి జైల్లో ఉన్నారంటే.. అది నీ చలవ కాదా? దానికి నీవు చేసిన కుట్రలు, కుమ్మక్కు రాజకీయాలు కారణం కాదా చంద్రబాబూ?’’
 
 ‘‘రాజధానిని అక్కడికి తానే నిర్మించినట్లు తొమ్మిదేళ్లలో హైదరాబాద్‌ను సింగపూర్‌లా తయారు చేశానని చంద్రబాబు అంటున్నారు. చంద్రబాబు హైదరాబాద్‌లో ఏం చేశారో.. ప్రజలందరికీ తెలుసు. హైదరాబాద్ చుట్టూ ఉన్న వేలకొద్దీ ఎకరాలను, వేలకోట్ల విలువ చేసే భూములను తన బినామీలకు, తన అనుకూలురకు రాసిచ్చేసుకున్నారు. ఇంకొంచెం ఉంటే హైదరాబాద్‌నే కాదు చార్మినార్‌ను కూడా తానే కట్టానంటారు చంద్రబాబు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా కట్టానంటారు. విశాఖపట్నంలో సముద్రాన్ని కూడా తానే వేయించానని అనగలరు.’’
 - షర్మిల
  ‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయిందని, ఇడుపులపాయతో ఇటలీకి లింకు ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణలను వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల తిప్పికొట్టారు. అసలు కాంగ్రెస్‌తో కుమ్మక్కయింది చంద్రబాబేనంటూ.. దానికి కారణాలను వివరించారు. ‘‘నిజంగానే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ... కాంగ్రెస్‌తో కుమ్మక్కయి ఉంటే ఈ రోజు జగన్‌మోహన్‌రెడ్డి జైల్లో ఉండేవారా? నిజంగానే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. కాంగ్రెస్‌తో కుమ్మక్కయి ఉంటే ఈ రోజు జగన్‌మోహన్‌రెడ్డి కూడా చిరంజీవిలాగా కేంద్రమంత్రి అయ్యుండేవారు కాదా? లేక ముఖ్యమంత్రి అయ్యుండేవారు కాదా? నిజానికి కాంగ్రెస్‌తో కుమ్మక్కయింది చంద్రబాబు.
 
 ఆ నిజాన్ని కప్పి పుచ్చుకోవడానికే ఇతరులు కుమ్మక్కయ్యారంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారాయన’’ అని ఆమె నిప్పలు చెరిగారు. ‘‘ఓట్ల కోసం, సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేయాలనుకుంటుంటే.. మీరేమో ఓట్లు పోతాయని, సీట్లు పోతాయని, మీకు క్రెడిట్ రాకుండా పోతుందని విభజనకు మద్దతు పలికారే.. మీరు కాదా చంద్రబాబూ కాంగ్రెస్‌తో కుమ్మక్కయింది?’’ అని ఆమె సూటిగా ప్రశ్నించారు. మూడు ప్రాంతాలకూ న్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర నాలుగో రోజు గురువారం అనంతపురం జిల్లా పామిడి మీదుగా కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. కర్నూలు జిల్లా డోన్(ద్రోణాచలం), కర్నూలు జిల్లా కేంద్రంలో సమైక్య శంఖారావం సభలకు జనకెరటాల్లా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ఆమె ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే..
 
 పార్లమెంటు నుంచి పంచాయతీదాకా..
 ‘‘కాంగ్రెస్‌తో కుమ్మక్కయిన చంద్రబాబు.. ఆ నిజాన్ని కప్పి పుచ్చుకోవడానికే ఇతరులు కుమ్మక్కయ్యారంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. ఎఫ్‌డీఐ ఓటింగ్ విషయంలో రైతులను, చిన్న వర్తకులను మోసం చేస్తూ నిస్సిగ్గుగా తన ఎంపీలను గైర్హాజరుపరిచి కుమ్మక్కును రుజువు చేసుకున్నది మీరు కాదా చంద్రబాబూ? ఎమ్మార్, ఐఎంజీ కేసుల్లో మీకొక న్యాయం.. మరొకరికి ఇంకొక న్యాయంలా సీబీఐ వ్యవహరిస్తోందీ అంటే దానికి కారణం చిదంబరాన్ని మీరు చీకట్లో కలిసి చీకటి ఒప్పందాలు చేసుకోవడం కాదా? ఎవరికి ఎవరితో లింకులు ఉన్నాయో ప్రజలు గమనిస్తున్నారు.
 
 ఎమ్మార్, ఐఎంజీ కేసుల్లో ఒక పోలీసు కానిస్టేబుల్‌తో విచారణ జరిపించి ఉన్నా ఈ పాటికి మీరు జైల్లో ఉండే వారు కాదా చంద్రబాబూ? ఏకంగా రూ.32 వేల కోట్లను ప్రజల నెత్తిన కరెంటు చార్జీల రూపంలో మోపినందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలూ కలిసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెడితే.. మీరు మట్టుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈగ కూడా వాలడానికి వీల్లేదని నిస్సిగ్గుగా విప్ జారీచేసి మరీ కూలిపోకుండా కాపాడలేదా? మరి మీరు కుమ్మక్కు కాకపోతే.. ఈ మైనారిటీ సర్కారును భుజాన వేసుకొని ఈ రోజు వరకు ఎందుకు మోస్తున్నారు? కాంగ్రెస్‌తో పాలు, నీళ్లలా కలిసిపోయి.. పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్నికల దాకా ప్రతి ఎన్నికల్లో కుమ్మక్కయింది మీరు కాదా?
 
 విభజనకు కారణమే చంద్రబాబు..
 రాష్ట్రంలో ఇంత ఘోరం జరుగుతుంటే, కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరుగుతోంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మటుకు చలనం లేకుండా ఉన్నారు. ఎందుకని? ఎందుకంటే.. విభజనకు కారణమే చంద్రబాబు కనుక. తెలంగాణ ఇచ్చేయండి.. అంటూ ఒక బ్లాంక్ చెక్‌లాగా లేఖ రాసిచ్చేశారు చంద్రబాబు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని విభజించే సాహసం చేసిందీ అంటే.. దానికి కారణం ఈ చంద్రబాబు విభజనకు మద్దతు పలకడం కాదా అని అడుగుతున్నాం. చేసిందంతా చంద్రబాబు చేసి.. రాజశేఖరరెడ్డే ఈ విభజనకు కారణం అంటున్నారంటే ఈ మనిషిని ఏమనుకోవాలో కూడా అర్థం కావడంలేదు. ఒకవైపేమో ప్రధాని సహా దేశంలోని ప్రతి ఒక్కరూ.. వైఎస్ బతికి ఉండుంటే ఆంధ్రప్రదేశ్‌కు ఈ గతి పట్టి ఉండేదే కాదని అంటున్నారు.
 
 కానీ.. తెలంగాణకు అనుకూలంగా లేఖ రాసిచ్చిన చంద్రబాబు మాత్రం వైఎస్సే విభజనకు కారణమని అంటున్నారంటే.. ఈయనకు మనస్సాక్షి లేదనుకోవాలా? లేక ఈయన ఒంట్లో ప్రవహించేది మానవ రక్తం కాదనుకోవాలా? తెలుగుదేశం పార్టీతో సహా ఐదు పార్టీలు రాష్ట్ర విభజనకు ఒప్పుకుంటే, మూడు పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, ఎంఐఎం పార్టీలు ఎప్పుడూ ఈ విభజనకు ఒప్పుకోలేదు. చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, సీమాంధ్రుల పట్ల ఏమాత్రం ప్రేమాభిమానాలు ఉన్నా.. వెంటనే ఈ మూడు పార్టీల పక్షాన చేరి తెలంగాణ విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకొని సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని ప్రకటించాలి.
 
 ఏ మొహం పెట్టుకుని యాత్ర చేస్తున్నారు?
 ఈ రోజు ఒక పెద్ద వజ్రంలాంటి మన రాష్ట్రాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ ముక్కలు చేయడానికి సాహసించింది అంటే.. దానికి కారణం.. విభజనకు మీరు ఇచ్చిన మద్దతు కాదా చంద్రబాబూ? పట్టపగలు ఇలా సీమాంధ్రుల గొంతుకోసి మళ్లీ ఏ మొహం పెట్టుకుని యాత్ర చేస్తున్నారు? ఇంత అన్యాయం జరుగుతుంటే.. అబద్ధాలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారుగాని.. మీరుగాని, మీ ఎంపీలు, ఎమ్మెల్యేలుగాని రాజీనామా చేయలేదే అని ప్రజలు అడిగితే ఏం సమాధానం చెప్తారు? తెలంగాణకు అనుకూలంగా అసలు మీరు లేఖ ఎందుకిచ్చారు? ఎవర్నడిగి ఇచ్చారు? ఆరు కోట్ల మంది ప్రజలు ఇక్కడ ఉంటే... రాష్ట్రమేదో మీ సొత్తు అన్నట్లు మీరెలా లేఖ రాసిచ్చేశారు అని ప్రజలు నిలదీస్తే ఏమని సమాధానం చెప్తారు?’’
 
 నాలుగో రోజు యాత్ర సాగిందిలా..
 ‘సమైక్య శంఖారావం’ యాత్ర నాలుగో రోజు గురువారం అనంతపురం జిల్లా కేంద్రం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి కర్నూలు జిల్లా డోన్ సభలో పాల్గొనేందుకు షర్మిల బయలుదేరారు. మార్గం మధ్యలో పామిడి గ్రామస్తులు భారీ ఎత్తున ఆమెకు స్వాగతం పలికేందుకు వచ్చారు. వారు పట్టుబట్టడంతో కొద్దిసేపు ప్రసంగించారు. ఇక్కడ లారీ దూసుకుపోయిన ఘటనలో 200 గొర్రెలు చనిపోయాయి. ఇది తెలిసి అక్కడ ఆగిన షర్మిల.. బాధిత గొర్రెల కాపరులతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వారికి ఇన్సూరెన్స్ ఇప్పించాలని స్థానిక పార్టీ నాయకులకు సూచించారు.
 
 తర్వాత డోన్ సభలో, ఆ తర్వాత కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్లో పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. షర్మిల వెంట పాల్గొన్న నేతల్లో ఎమ్మెల్యేలు భూమా శోభా నాగిరెడ్డి,  చెన్నకేశవరెడ్డి, కాటసాని రాంరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, గుర్నాథరెడ్డి, జిల్లా పార్టీ కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి, మాజీ మంత్రి మారెప్ప, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, సాయి ప్రసాద్‌రెడ్డి, కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి, కడప మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి, పార్టీ నేతలు వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురాం, స్థానిక నాయకులు బుగ్గన రాజారెడ్డి, కోట్ల హరిచక్రపాణిరెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి, ఉమ్మనూరి జయరాం, మహబూబ్‌నగర్ జిల్లా నేత కృష్ణమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 కర్నూలు జిల్లా ప్యాపిలి మండల పరిధిలోని పోదొడ్డి గ్రామ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 201 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల యజమానుైలైన నారాయణస్వామి, క్రిష్ణయ్య, నాగభూషణం, పెద్దన్నలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల పరామర్శించారు. వారి ఆవేదనను చూసి చలించిపోయారు. బాధితులకు రావాల్సిన పరిహారం విషయమై జిల్లా అధికారులతో మాట్లాడుతానని ఆమె హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement