'న్యాయం చేసే సత్తా లేనప్పుడు.. విభజించే హక్కు మీకెక్కడిది'
'న్యాయం చేసే సత్తా లేనప్పుడు.. విభజించే హక్కు మీకెక్కడిది'
Published Fri, Sep 13 2013 7:40 PM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
ఓట్ల కోసం, సీట్లకోసం కోట్లాదిమందికి కాంగ్రెస్ అన్యాయం చేసింది అని తూర్పు గోదావరి జిల్లా అమలాపురం బహిరంగసభలో షర్మిల మండిపడ్డారు. అమలాపురంలో ఏర్పాటు చేసిన సమైక్య శంఖారావం బహిరంగ సభలో మాట్లాడుతూ... సీమాంధ్ర ప్రజల తరఫున ఎంతమంది టీడీపీ, కాంగ్రెస్ నాయకులు నిలబడ్డారు షర్మిల అని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలు రాజీ నామాలు చేసిన రోజునే... మిగతా పార్టీల ఎమ్మెల్యేలూ చేసుంటే విభజన ప్రక్రియ ఆగి ఉండేది అని అన్నారు.
న్యాయం చేసే సత్తా మీకు లేనప్పుడు.. విభజించే హక్కు మీకెక్కడిది అని షర్మిల నిప్పుల చెరిగారు. రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచాలని వైఎస్‌ఆర్ సీపీ డిమాండ్ చేస్తోంది అని అన్నారు. నిర్బంధంలో ఉండికూడా తన కష్టాన్ని పక్కనపెట్టి... ప్రజలకోసం వారంరోజులు జగనన్న నిరాహారదీక్ష చేశారని షర్మిల తెలిపారు. జైల్లో ఉన్నా... జనంలో ఉన్నా జగనన్న జననేతేనని, కోట్లాదిమందికి అన్యాయం జరిగితే జగనన్న చేతులు కట్టుకుని చూస్తూ ఊరుకోరు అని అన్నారు. జగనన్నను ఆపడం ఈ టీడీపీ, కాంగ్రెస్ నాయకుల తరం కాదు సవాల్ విసిరారు.
విద్యార్థులకోసం ఓ తండ్రిలా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ఆలోచన చేశారు.. ప్రభుత్వమే చదివిస్తుందని వారికి భరోసా కల్పించారు...లక్షలాది మంది లక్షణంగా చదువుకున్న ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు అని అమలాపురం బహిరంగసభలో షర్మిల అన్నారు.
ఏ పథకాలనైనా వైఎస్‌ఆర్ అద్భుతంగా నడిపి చూపించారని, చంద్రబాబు గారు 16లక్షల మందికి పింఛన్లు ఇస్తే...వైఎస్‌ఆర్ 71 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారని తెలిపారు.
ఇంటింటికీ పథకాలనందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ అని.. ఆయన హయంలో ఏ ఒక్క ఛార్జీ పెంచని సీఎంగా వైఎస్‌ఆర్ తనదైన పాలనను అందించారని ఆమె వివరించారు. ప్రజలపై భారం మోపడం ఇష్టం లేకనే వైఎస్ ఏ ఛార్జీ పెంచలేదని, వైఎస్ హయాంలో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి గ్యాస్ ఛార్జీ పెరిగిందా అని ప్రశ్నించారు.
శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు మంచినీరు ఎక్కడుందని, హైదరాబాద్‌ను తీసేసుకున్నామంటున్నారు, సీమాంధ్రులకు భాగం లేదని హైదరాబాద్ నుంచి వెళ్లిపోమంటున్నారని, హైదరాబాద్ అభివృద్ధి 60ఏళ్లు పట్టిందని.. కొత్త రాజధాని అభివృద్ధికి పదేళ్లు ఎలా సరిపోతాయని కాంగ్రెస్ ను నిలదీశారు.
చేసిందంతా చేసి ఇప్పుడు సీఎం కిరణ్ ప్రజలకే ప్రశ్నలు సంధిస్తున్నారని, ఇంత జరుగుతున్నా చంద్రబాబులో ఏ చలనమూ లేదని.. అసలు విభజనకు కారణమే చంద్రబాబు అని విమర్శించారు. తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు లేఖ రాసిచ్చారని, హత్యచేసి శవం మీద పడి వెక్కివెక్కి ఏడ్చినట్టుంది చంద్రబాబు తీరు అని ఎద్దేవా చేశారు. బాబులో నిజాయతీ ఉంటే చేసిన తప్పుకు క్షమాపణ కోరాలని, తను, తమ ఎంపీ, ఎమ్మెల్యేలు రాజీ నామాలు చేశాకే సీమాంధ్రలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. విభజనకు వైఎస్ఆర్ కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం ఏనాడూ అంగీకరించలేదని అమలాపురం బహిరంగసభలో షర్మిల తెలిపారు.
Advertisement
Advertisement