కన్నీటి ‘మధన’ం!
సందిగ్ధంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
రోజుకో ఆలోచనతో
సమస్య జఠిలం
డివిజన్ కేంద్రమంటూ కొత్త పల్లవి
నేరుగా సీఎం వద్ద ప్రస్తావన
దక్కని ఫలితం.. దిక్కులు చూస్తున్న ప్రజాప్రతినిధి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డిజిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నర్సాపూర్ మండలం ఎటువైపు అనే అంశంపై ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తప్పటడుగులు వేస్తున్నారు. ఒకటి వెనుక ఒకటి అన్నట్టుగా తొందరపాటు నిర్ణయాలతో తలనొప్పి తెచ్చుకుంటున్నారు. సమస్య పరిష్కారం కాకపోగా మరింత జఠిలమయ్యేలా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రోజుకోరకమైన ఆలోచనల కారణంగా నర్సాపూర్ నియోజకవర్గ భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేస్తున్నారనే అపవాదును మూటగట్టుకుంటున్నారు.నర్సాపూర్ నియోజక వర్గాన్ని డివిజన్‌కేంద్రంగా చేసి మెదక్ జిల్లాలో కలుపుతూ అధికారులు ప్రభుత్వానికి తొలి ప్రతిపాదనలు పంపారు. పరిస్థితి అనుకూలిస్తే కొత్తగా ఏర్పడిన గుమ్మడిదల మండలాన్ని కూడా నర్సాపూర్‌లోనే కలిపి భవిష్యత్తులో నియోజక వర్గాల పునర్విభజన చేసినా ఎలాం టి సమస్య ఉత్పన్నం కాకుండా అధికారులు ముందస్తు ప్రణాళికతోనే ప్రతిపాదనలు రూ పొందించారు. జిల్లా భౌగోళిక స్వరూపం, భవిష్యత్తు ప్రయోజనాలు, ప్రజాభిప్రాయాల దృష్ట్యా అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
యూ టర్న్ ఫలితం..
నర్సాపూర్‌ను సంగారెడ్డి జిల్లాలో కలపాలనే డిమాండ్‌తో ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో రిలే దీక్షలు ఊపందుకున్నాయి. నర్సాపూర్‌లో వరుసగా 65 రోజుల దీక్ష జరిగింది. ఈ దీక్షకు కాంగ్రెస్ నుంచి డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి ప్రత్యక్షంగా, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్ పరోక్షంగా మద్దతు పలికారు. దీంతో రాజకీయ మైలేజీలో వెనుకబడి పోతానని భావించిన ఎమ్మెల్యే సీహెచ్ మదన్‌రెడ్డి కూడా నర్సాపూర్‌ను సంగారెడ్డి జిల్లాలోనే ఉంచాలనే డిమాండ్‌కు వంతపాడారు.
ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీకి లేఖ ఇచ్చారు. ఈ లేఖతో ప్రభుత్వం నర్సాపూర్, హత్నూర మండలాలను సంగారెడ్డి జిల్లాలో, శివ్వంపేట, వెల్దుర్తి, కౌడిపల్లి మండలాలను మెదక్ జిల్లాలో కలుపుతూ ముసాయిదాను జారీ చేసింది.
ఇప్పుడు ఇంకోమాట...
అనంతర కాలంలో మళ్లీ మనుసు మార్చుకొన్న మదన్‌రెడ్డి తాజాగా నర్సాపూర్‌ను డివిజన్ కేంద్రం చేసి మెదక్ జిల్లాలో కలపాలనే డిమాండ్ చేస్తున్నారు. సంక్లిష్టంగా మారిన సమస్యను పరిష్కరించడానికి ఆయనకు ముందున్న ఏకైక మార్గం మంత్రి హరీశ్‌రావు. ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు ఉన్న మంత్రి హరీశ్‌రావుతో చర్చించి తన నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను, తన వ్యక్తిగత అభిప్రాయాన్నిఆయన ముందు ఉంచితే ఆయనకు ఉపశమనం లభించే అవకాశం ఉందని మేధావులు సూచిస్తున్నారు. హరీశ్‌రావు మాత్రమే ఈ విషయాన్ని అర్థం చేసుకుని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఒప్పించే ప్రయత్నం చేయగలరని వారంటున్నారు.
ఇక్కడా మరో తప్పటడుగు...
కానీ నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి వెనుకాముందు ఆలోచించకుండా నేరుగా సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి నర్సాపూర్‌ను డివిజన్ కేంద్రం గా చేసి మెదక్ జిల్లాలో ఉంచాలని కోరారు. ఇక్కడ మదన్‌రెడ్డి కేవలం తన కోరికను మా త్రమే కేసీఆర్ ముందు పెట్టగలిగారు. కానీ ఎందుకు నర్సాపూర్ డివిజన్ కేంద్రంగా చే యాలి?,
నర్సాపూర్‌ను డివిజన్ చేస్తే అంతకు ముందే ప్రకటించిన తూప్రాన్ పరిస్థితి ఏమి టి? అనే శాస్త్రీయ అంశాలను ఆయన సీఎంకు విడమరిచి చెప్పలేకపోయారని తెలిసింది. దీంతో నర్సాపూర్ ఎమ్మెల్యే చేసిన డిమాండ్ ప్రాముఖ్యత లేని అంశంగా మిగిలిపోయింది. మరో వైపు మంత్రి హరీశ్‌రావు ఈ అంశాన్ని తన భుజం మీద వేసుకుని సీఎం వద్దకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది.
డిమాండ్‌ను గట్టిగా విన్పిస్తున్నా...
నర్సాపూర్‌ను మెదక్ జిల్లాలో ఉంచాలనే డిమాండ్ ఇప్పటికీ సజీవంగానే ఉంది. అయితే డివిజన్ చేయటం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే ఇది సాక్షాత్తు సీఎం సొంత నియోజకవర్గంతో ముడిపడి ఉన్న అంశం. దీన్ని డివిజచేయాలంటే ఇప్పటికే ప్రకటించిన తూప్రాన్ డివిజను ఏమి చేయాలనేది మొదటగా ఉత్పన్నమయే ప్రశ్న. ఒక వేళ తూప్రాన్ డివిజను అలాగే ఉంచి కొత్తగా నర్సాపూర్ డివిజన్‌ను ప్రకటించినా... తూప్రాన్‌లోని కొన్ని మండలాలను కలుపుకోవాల్సిన అవసరం ఉంది.
అదే జరిగితే తూప్రాన్ డివిజహోదా కోల్పోయే ప్రమాదం ఉంది. ముఖ్యమంత్రికి నేరుగా నష్టం కలిగించే ఈ వ్యవహారంలో వేలు పెట్టడానికి ఏ అధికారి, ప్రజాప్రతినిధి కూడా సాహసించకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.