Madhanapalli
-
మెసేజ్ పంపారు.. సాయం మరిచారు..
అతడు చదువుల్లోనే కాదు..ఆటల్లోనూ ఫస్టే. అయితే రోడ్డు ప్రమాదం అతడి జీవితాన్ని కకావికలం చేసింది. ఇంజినీర్ కావాలన్న అతడి కలలను చిదిమేసింది. తల్లిదండ్రులు అతడి చికిత్స కోసం శక్తికి మించి ఖర్చు చేశారు. మరికొన్ని ఆపరేషన్ల కోసం సాయం చేసే దాతల కోసం ఎదురుచూస్తున్నారు. చిత్తూరు, మదనపల్లె : పెద్దమండ్యం మండలం గురివిరెడ్డిగారిపల్లెకు చెందిన కృష్ణారెడ్డికి తన కుమారుడు భరత్‌సింహారెడ్డి చదువుకోసం ఉన్న ఊరిని వదిలి మదనపల్లెకు చేరుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట చిన్న దుకాణం పెట్టుకుని కుటుంబా న్ని పోషిస్తున్నారు. పదోతరగతిలో 9.0 పాయింట్లతో ఉత్తీర్ణుడైన భరత్‌సింహారెడ్డి ఇంటర్మీడియెట్ ఏపీఆర్జేసీ గ్యారంపల్లెలో సీటు పొందా డు. 2016లో జిల్లాస్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొని విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలకు హాజరై రంజీ ట్రోఫీకి సెలెక్ట్ అయ్యాడు. ఇంటర్ పూర్తిచేశాక పొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా గూడూరులో ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో చేరాడు. 2017నవంబర్ 5న స్నేహితుడు ఇంటికి వెళ్లి పుస్తకాలు తీసుకువస్తున్న భరత్నసింహారెడ్డిని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ప్రమాదంలో స్నేహితుడు అక్కడికక్కడే మరణించగా, భరత్‌సింహారెడ్డికి ఎడమకాలు నుజ్జు నుజ్జైంది, చేయి, భుజం పూర్తిగా దెబ్బతినడంతోపాటు మతిస్థిమితం కోల్పోయాడు. గ్రామంలోని నాలుగెకరాల వ్యవసాయభూమిని విక్రయించి ఆ సొమ్ముతో భరత్‌సింహారెడ్డికి అతడి తల్లిదండ్రులు చికిత్స చేయించారు. మరికొన్ని ఆపరేషన్లు చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పడంతో చేసేదిలేక అప్పట్లో సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం త్వరలోనే చెక్కును పంపనున్నట్లు కృష్ణారెడ్డి సెల్‌ఫోన్‌కు మెసేజ్ పంపింది. అయితే ఆ సాయం అందలేదు. చివరకు స్నేహితులు, దాతలు, బంధువులు చేసిన సాయం మూలాన చేయించిన చికిత్సతో భరత్ కొంతవరకు కోలుకున్నాడు. అతడికి నరాలకు సంబంధించిన ఆపరేషన్లు చేస్తే నడిచే అవకాశం ఉందని, రూ.3.5 లక్షల నుంచి 5లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో కుమిలిపోతున్నారు. దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఆపన్నహస్తం అందించదలిస్తే 9676520586, 9493871077 నంబర్లలో సంప్రదించాలని కోరుతున్నారు. ఎస్బీఐ, ఎన్టీఆర్ సర్కిల్ అకౌంట్ నంబర్ 30757452216, ఐఎఫ్ఎస్సీ కోడ్..ఎస్బీఐఎన్0012727కు సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
మదనపల్లె సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడి
మదనపల్లె టౌన్ : మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై శుక్రవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు దాడిచేశారు. సబ్ రిజిస్ట్రార్ వెంకటేశులురెడ్డి, కింది స్థాయి సిబ్బంది ఏర్పాటు చేసుకున్న బినామీ వ్యక్తులు, డాక్యుమెంట్ రైటర్ల వద్ద నుంచి రూ.86,810 స్వాధీనం చేసుకున్నారు.ఎటువంటి రసీదులు లేకుండా డబ్బు కలిగి ఉన్న 15 మందిపై కేసు నమోదు చేశారు. ఏసీబీ డీఎస్పీ అల్లాబ„Š విలేకరుల సమావేశంలో వెల్లడించిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సబ్ రిజిస్ట్రార్ వెంకటేశులురెడ్డి, సిబ్బంది సుమారు 15 మందికిపైగా అనధికారికంగా వ్యక్తులను నియమించుకున్నారు. వారి ద్వారా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో సమాచారం అందడంతో ఏసీబీ తిరుపతి అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు ఆదేశాల మేరకు అధికారుల బృందం దాడి చేసింది. ట్రాన్స్‌కో డెప్యూటీ డీఈ మాధవరావు సమక్షంలో రికార్డులు పరిశీలించారు. కార్యాలయ ఆవరణం, గేటు బయట ఉన్న డాక్యుమెంట్ రైటర్లు, బినామీ ఉద్యోగులు, కింది స్థాయి సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద అనధికారికంగా ఉన్న నగదు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ సహా 15 మందిపై కేసు నమోదు చేశారు. ఏసీబీ సీఐలు ప్రసాద్‌రెడ్డి, గిరిధర్, ఎస్ఐ నాగేంద్ర, మరో 10 మంది సిబ్బంది పాల్గొన్నారు. -
భారీ మెజార్టీతో వైఎస్సార్సీపీ గెలుస్తుంది
-
108 నిర్లక్ష్యంతో మహిళ మృతి
మదనపల్లె టౌన్: 108కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఓ పేద మహిళ నిండు ప్రాణాన్ని కోల్పోయింది. మదనపల్లెలోని బెంగళూరు రోడ్డులో నివాసం ఉంటున్న బి.రేణుక(35) కుటుంబ కలహాల కారణంగా భర్త ప్రసాద్ నుంచి విడిపోయింది. కొత్తిమీర విక్రయించుకుంటూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటోంది. శుక్రవారం రాత్రి ఉన్నట్టుండి ఆమెకు ఛాతీలో నొప్పి వచ్చింది. చుట్టుపక్కల వారు వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. 108కు ఫోన్ చేశారు. అయితే అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. రేణుక వద్ద ఆటోలో వెళ్లేందుకు డబ్బు లేకపోవడంతో స్థానికులు కొత్తిమీర అమ్ముకునేందుకు వినియోగించే తోపుడు బండిపైనే జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్టు ధ్రువీకరించారు. దీంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. -
మదనపల్లెలో కొనసాగుతున్న బంద్
సాక్షి, అమరావతి/చిత్తూరు : ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యకు పాల్పడిన చేనేత కార్మికుడి మృతికి సంతాపంగా ఆదివారం మదనపల్లెలో చేపట్టిన బంద్ కొనసాగుతోంది. ప్రత్యేక హోదా మన హక్కు అని శనివారం సుధాకర్ అనే చేనేత కార్మికుడు ఆత్మహత్యకు చేసుకున్న విషయం తెలిసిందే. మృతుడికి సంతాపంగా ఆదివారం మదనపల్లె బంద్‌కు ప్రతిపక్షాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్‌లో వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి పాల్గొన్నారు. బంద్‌కు మద్దతుగా దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేసి వ్యాపారులు బంద్ పాటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో మిథున్‌రెడ్డి, దేశాయి తిప్పారెడ్డి, వామపక్ష నేతలు పాల్గొన్నారు. సుధాకర్ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు. -
విద్యుత్ షాక్‌తో నేత కార్మికుడి దుర్మరణం
మదనపల్లె క్రైం : కొబ్బరి మట్టలు కొడుతుండగా 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి నేత కార్మికుడు మృతిచెందాడు. ఈ సంఘటన గురువారం మదనపల్లె పట్టణంలో జరిగింది. టూటౌన్ పోలీసులు, మృతుని కుటుంబ సభ్యుల కథనం మేరకు.. కురబలకోట మండలం మట్లివారిపల్లె పంచాయతీ రామిగానిపల్లెకు చెందిన రామిగాని నాగిరెడ్డి, శకుంతలమ్మ దంపతులు 20 ఏళ్ల క్రితం మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లె సమీపంలోని భవాని నగర్‌కు బతుకుదెరువు కోసం వచ్చారు. వారి ఒక్కగానొక్క కుమారుడు వినోద్‌కుమార్‌రెడ్డి(23) చేనేత మగ్గం నేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయోధ్యనగర్‌కు చెందిన శంకర్‌రెడ్డి గృహ ప్రవేశం చేస్తుండగా ఇంటికి కట్టేందుకు కొబ్బరి మట్టలు కావాలని వినోద్‌కుమార్‌రెడ్డిని అడిగాడు. దీంతో అతను అయోధ్యనగర్‌లో ఉన్న సాంబశివయ్య ఇంటి వద్ద ఉన్న కొబ్బరి చెట్టు ఎక్కాడు. కొబ్బరి మట్టలు కొడుతుండగా మట్టవిరిగి 11 కేవీ విద్యుత్ తీగలపై పడింది. దీంతో వినోద్‌కుమార్‌రెడ్డికి షాక్ కొట్టి చెట్టుపైనే మృతిచెందాడు. స్థానికులు గమనించి కేకలు వేయడంతో ప్రజలు గుమికూడారు. 108 సిబ్బంది అక్కడికి వచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. మృతదేహాన్ని చెట్టుపై నుంచి అతికష్టంమీద కిందకు దింపి టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని విచారణ అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఒక్కగానొక్క కొడుకు మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్వంతమయ్యారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూకాలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సురేష్‌కుమార్ తెలిపారు. -
ప్రియురాలితో జల్సా కోసం చిటికెలో చోరీలు!
మదనపల్లె టౌన్: ఆ యువకుడు ఒక యువతిని ప్రేమించాడు. ఆమెతో కలిసి జల్సాలు చేయాలనుకున్నాడు. కానీ చేతిలో డబ్బు లేదు. దీంతో దొంగగా మారాడు. కడప, చిత్తూరు జిల్లాల్లో 22 ద్విచక్ర వాహనాలను చోరీ చేశాడు. చోరీ చేసిన వాహనంలో వెళుతుండగా పోలీసులు చేసిన తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయి కటకటాల పాలయ్యాడు. మదనపల్లె డీఎస్పీ రాజేంద్రప్రసాద్ బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వైఎస్సార్ జిల్లా దేవపట్లకు చెందిన రాళ్లపల్లె వెంకటేశ్వర్లు కుమారుడు మల్లికార్జున(19) పదో తరగతి చదువుతుండగా తల్లిదండ్రులు విడిపోయారు. తల్లి తన పుట్టినిల్లు అయిన చిత్తూరు జిల్లాలోని సోమల మండలం సామిరెడ్డిగారిపల్లెలో తల్లి వద్ద ఉంటోంది. మల్లికార్జున కూడా ఆమె వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఏడాదిగా అదే గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమించాడు. ఆమెను సంతోష పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఏం చేయాలో తోచక దొంగగా మారాడు. చిటికెలో ద్విచక్ర వాహనాలను చోరీ చేయడం నేర్చుకున్నాడు. ఈ క్రమంలో కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన పలు పట్టణాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేసి రూ.3 వేలు, రూ.5 వేలకు విక్రయించేవాడు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు. బాధితుల ఫిర్యాదుతో కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఎస్పీ శ్రీనివాస్, డీఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆదేశాల మేరకు టూటౌన్ ఎస్ఐలు గంగిరెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి వైఎస్సార్ కాలనీ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. మల్లికార్జున చోరీ చేసిన ద్విచక్ర వాహనంపై వెళ్లూ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతన్ని వెంటాడిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పలుచోట్ల ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్టు అంగీకరించాడు. అతని సమాచారం మేరకు తూర్పు ఎర్రకొండ వద్ద ఓ పాత ఇంటిలో దాచిపెట్టిన వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. రాయచోటి, కడప, తిరుపతి, మదనపల్లె, కలికిరి, భాకరాపేట, పుంగనూరు ప్రాంతాల్లో నిందితుడు చోరీ చేశానని అంగీకరించిన 22 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. నిందితున్ని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన ఎస్ఐ గంగిరెడ్డి, ఏఎస్ఐ విజయ్‌కుమార్‌రెడ్డి, కానిస్టేబుల్ రాజేష్‌కు నగదు రివార్డులను అందజేసినట్లు డీఎస్పీ తెలిపారు.