ప్రియురాలితో జల్సా కోసం చిటికెలో చోరీలు!
మదనపల్లె టౌన్: ఆ యువకుడు ఒక యువతిని ప్రేమించాడు. ఆమెతో కలిసి జల్సాలు చేయాలనుకున్నాడు. కానీ చేతిలో డబ్బు లేదు. దీంతో దొంగగా మారాడు. కడప, చిత్తూరు జిల్లాల్లో 22 ద్విచక్ర వాహనాలను చోరీ చేశాడు. చోరీ చేసిన వాహనంలో వెళుతుండగా పోలీసులు చేసిన తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయి కటకటాల పాలయ్యాడు. మదనపల్లె డీఎస్పీ రాజేంద్రప్రసాద్ బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
వైఎస్సార్ జిల్లా దేవపట్లకు చెందిన రాళ్లపల్లె వెంకటేశ్వర్లు కుమారుడు మల్లికార్జున(19) పదో తరగతి చదువుతుండగా తల్లిదండ్రులు విడిపోయారు. తల్లి తన పుట్టినిల్లు అయిన చిత్తూరు జిల్లాలోని సోమల మండలం సామిరెడ్డిగారిపల్లెలో తల్లి వద్ద ఉంటోంది. మల్లికార్జున కూడా ఆమె వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఏడాదిగా అదే గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమించాడు. ఆమెను సంతోష పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఏం చేయాలో తోచక దొంగగా మారాడు. చిటికెలో ద్విచక్ర వాహనాలను చోరీ చేయడం నేర్చుకున్నాడు. ఈ క్రమంలో కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన పలు పట్టణాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేసి రూ.3 వేలు, రూ.5 వేలకు విక్రయించేవాడు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు. బాధితుల ఫిర్యాదుతో కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఎస్పీ శ్రీనివాస్, డీఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆదేశాల మేరకు టూటౌన్ ఎస్‌ఐలు గంగిరెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి వైఎస్సార్ కాలనీ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు.
మల్లికార్జున చోరీ చేసిన ద్విచక్ర వాహనంపై వెళ్లూ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతన్ని వెంటాడిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పలుచోట్ల ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్టు అంగీకరించాడు. అతని సమాచారం మేరకు తూర్పు ఎర్రకొండ వద్ద ఓ పాత ఇంటిలో దాచిపెట్టిన వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. రాయచోటి, కడప, తిరుపతి, మదనపల్లె, కలికిరి, భాకరాపేట, పుంగనూరు ప్రాంతాల్లో నిందితుడు చోరీ చేశానని అంగీకరించిన 22 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. నిందితున్ని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన ఎస్‌ఐ గంగిరెడ్డి, ఏఎస్‌ఐ విజయ్‌కుమార్‌రెడ్డి, కానిస్టేబుల్ రాజేష్‌కు నగదు రివార్డులను అందజేసినట్లు డీఎస్పీ తెలిపారు.