రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టిన మున్సిపల్ కమిషనర్ నియామకం
ధర్మవరం పట్టణంలో ఉద్రిక్తత
ధర్మవరం: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున నియామకం కూటమి పార్టీల మధ్య చిచ్చు రగిల్చింది. మంత్రి సత్యకుమార్ మద్దతుతో మల్లికార్జున ధర్మవరం మున్సిపాలిటీ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ తీవ్రంగా వ్యతిరేకించారు. మల్లికార్జున మున్సిపల్ ఆఫీసుకు వస్తే చొక్కా పట్టుకుని బయటకు గెంటేస్తానని శ్రీరామ్ హెచ్చరించారు.
ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ధర్మవరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సత్యకుమార్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు కమిషనర్‌ను అడ్డుకునేందుకు అక్కడికి భారీగా తరలివచ్చారు. దీంతో మంత్రి సత్యకుమార్ మున్సిపల్ అధికారులను, కమిషనర్‌ను మార్కెట్ యార్డు వద్ద ఉన్న ఎన్డీఏ కార్యాలయంలోని క్యాంప్ ఆఫీసుకి రప్పించుకుని అక్కడే సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రి క్యాంప్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ధర్మవరం–అనంతపురం ప్రధాన రహదారిపై బైఠాయించారు. మంత్రి సత్యకుమార్, కమిషనర్ మల్లికార్జునకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. డీఎస్పీ శ్రీనివాసులు వారిని శాంతింపజేసే ప్రయత్నం చేసినా ఫలించక పోవడంతో ఎన్డీఏ ఆఫీస్‌లోకి ఎవ్వరూ వెళ్లకుండా తాళం వేశారు.
కమిషనర్ మల్లికార్జున నియామకం సరైనదే
అంతకు ముందు మంత్రి సత్యకుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. కమిషనర్ మల్లికార్జున నియామకం సరైనదేనని, ఆయన సమర్ధుడైన మంచి అధికారి అంటూ కితాబిచ్చారు. మల్లికార్జున అయితే ధర్మవరం అభివృద్ధి చెందుతుందని భావించే మున్సిపల్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించిందన్నారు.
గత ప్రభుత్వంలో పని చేశారన్న కారణంతో ఆయన్ని కొన్ని పార్టీల నాయకులు అడ్డుకుంటున్నారని, అది మంచి పద్ధతి కాదని చెప్పారు. అధికారులకు రాజకీయాలను ఆపాదించకూడదని అన్నారు. కమిషనర్‌గా మల్లికార్జున కొనసాగుతారని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు.
సత్యకుమార్‌ను ఘెరావ్ చేసిన టీడీపీ కార్యకర్తలు
మంత్రి క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు కమిషనర్ మల్లికార్జునను కార్యాలయం వెనుక గేట్ నుంచి బందోబస్తుతో పంపించేశారు. అనంతరం మంత్రి సత్యకుమార్ సమావేశాన్ని అర్ధంతరంగా ముగించుకుని బయటకు వచ్చారు. వెంటనే టీడీపీ నేతలు ఆయనపై విరుచుకుపడ్డారు. ‘మేం కష్టపడి గెలిపిస్తే మంత్రివి అయ్యావు. నీవు, నీ అనుచరులు మాపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మీ సంగతి చూస్తాం’ అంటూ దుర్భాషలాడారు.
మంత్రి సత్యకుమార్ ముందుకు కదలకుండా ఆయన వాహనాన్ని చుట్టుముట్టి ఘొరావ్ చేశారు. పరిస్థితి చేయిదాటుతుండటంతో పోలీసులు టీడీపీ కార్యకర్తలను నెట్టివేసి మంత్రిని పంపించేశారు. బీజేపీ, టీడీపీ విభేదాల కారణంగా ధర్మవరం పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రహదారిపై రెండు గంటల పాటు ధర్నా వల్ల వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పాఠశాలల విద్యార్థులు, వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment