వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడి
పీసీ పల్లి : కేవలం రేషన్ షాపునకు డీడీ కట్టినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడి చేశారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన పీసీ పల్లి మండలంలోని పెదఅలవలపాడు గ్రామంలో గురువారం జరిగింది. ఆ వివరాల ప్రకారం... పెదఅలవలపాడులోని రేషన్ షాపును వైఎస్ఆర్ సీపీ మద్దతుదారుడు మాధవరపు నర్శింహులు నిర్వహిస్తున్నాడు. అయితే, ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం వచ్చినందున రేషన్ షాపునకు సరుకులకు సంబంధించి ఈ నెల డీడీ తీయవద్దని, డీలర్‌షిప్‌ను తాము తీసుకుంటామని టీడీపీ నాయకులు కొల్లా వెంకట్రావు, డి.కృష్ణ, నాగార్జున మరికొందరు కలిసి గురువారం డీలర్ నర్శింహులును బెదిరించారు.
దీంతో రెండువర్గాల మధ్య వివాదం జరిగింది. దీనిపై పరస్పరం ఫిర్యాదు చేసుకునేందుకు పీసీ పల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అయితే, అక్కడ ఎస్సై లేకపోవడంతో ఫిర్యాదు పత్రాలను సిబ్బందికి అందజేసి తిరిగి గ్రామానికి చేరుకున్నారు. కాగా, వివాదంలో తాము లేకపోయినప్పటికీ ఫిర్యాదులో తమ పేర్లు ఎందుకు పేర్కొన్నారంటూ వైఎస్ఆర్ సీపీకి చెందిన గోగడ శింగయ్య, గోగడ సురేష్, కంచర్ల తిరుపతమ్మలు టీడీపీ నాయకులను ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ నాయకులు చెన్నుపాటి వెంకటేశ్వర్లు, పువ్వాడి మల్లికార్జున, గొనుగుంట్ల వెంకట్రావు, దారపనేని కృష్ణ మరికొందరు కలిసి కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా వారిపై దాడిచేశారు.
ఈ దాడిలో శింగయ్య, తిరుపతమ్మ తలలు పగలగా సురేష్‌కు కూడా తీవ్రగాయాలయ్యాయి. వారిని ముందుగా కనిగిరి వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తీసుకెళ్లారు. వారిలో శింగయ్య, తిరుపతమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పీసీ పల్లి పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు.