madhira constituency
-
వచ్చే ఎన్నికల్లో పోటీ.. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు: పొంగులేటి
సాక్షి, మధిర: తెలంగాణలో ముందుగా వచ్చే ఏ ఎన్నికలోనైనా తప్పనిసరిగా పోటీ చేస్తానని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో సోమవారం పర్యటించిన ఆయన పలువురి కుటుంబాలను పరామర్శించారు. ఆ తర్వాత మధిరలో టీఆర్ఎస్ నాయకుడు కోట రాంబాబు నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతానికి తాను అధికార పార్టీలోనే ఉన్నానని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచే పోటీ చేస్తానని చెప్పారు. అయితే, అనివార్య పరిస్థితుల్లో రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మొదట ఎన్నికల్లో పోటీచేస్తే జిల్లా ప్రజలు దీవించారని పొంగులేటి గుర్తు చేశారు. ఆ తర్వాత తాను పార్టీ మారతానని అనుకోలేదని, ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో మారాల్సి వచ్చిందన్నారు. అలాగే రాజకీయాల్లో ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చని పొంగులేటి వ్యాఖ్యానించారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు పిడమర్తి రవి, బొమ్మెర రామ్మూర్తి, వెంకటేశ్వరరెడ్డి ఉన్నారు. (క్లిక్: ఎన్టీఆర్ డైలాగ్‌తో అదరగొట్టిన కేటీఆర్.. అసెంబ్లీలో మెరుపులే!) -
ప్రజల పక్షాన ఎవరూ లేరనే పార్టీ స్థాపించాం: షర్మిల
మధిర: ప్రస్తుతం పాలకపక్షంతో పాటు ప్రతిపక్షం ఎవరూ కూడా ప్రజల పక్షాన నిలబడక పోవడంతో తాము పార్టీని స్థాపించాల్సి వచ్చిందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఒక దొంగ, బ్లాక్‌మెయిలర్ చేతిలో ఉన్నాయని ఆరో పించారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం ఖమ్మం జిల్లా మధిరకు చేరుకోగా స్థానికంగా వైఎస్సార్, అంబేడ్కర్ విగ్రహాలకు ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం షర్మిల బహిరంగ సభలో మాట్లాడారు. భట్టి విక్రమార్కకు వైఎస్సార్ రాజకీయ భవిష్యత్ కల్పించి వేలు పట్టి నడిపించారని, ఈక్రమంలో ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరకపోవడం మంచిదేనని అభిప్రాయపడ్డారు. కానీ, వైఎస్సార్ ఫొటో పెట్టుకుని గెలిచిన ఆయన.. మహానేత పేరును కాంగ్రెస్ పార్టీ ఎఫ్ఐఆర్లో చేరిస్తే ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ‘వైఎస్సార్ బిడ్డగా చెబుతున్నా.. తమను ప్రజలు ఆశీర్వదిస్తే మళ్లీ రాజన్న సంక్షేమ పాలనను తీసుకువస్తా’ అని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీలంటే వైఎస్సార్‌కు ఎంతో అభిమానమని, ప్రస్తుత సీఎం కేసీఆర్ మాత్రం దళిత మహిళ మరియమ్మను జైలులో చంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. యాత్రలో వైఎస్సార్ టీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
రెండుసార్లు పోటీ.. ఒకసారి గెలుపు
సాక్షి, మధిర: మధిర శాసనసభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. నాడు మధిర నియోజకవర్గంలో మధిర, బోనకల్, ఎర్రుపాలెం, వైరా, తల్లాడ మండలాలు ఉండేవి. మొదటినుంచి మధిర నియోజకవర్గంలో పురుషుల ఓట్లకంటే మహిళల ఓట్లు అధికంగా ఉన్నాయి. ఈ క్రమంలో మధిర అసెంబ్లీ స్థానం నుంచి మొట్టమొదటిసారిగా 1972వ సంవత్సరంలో దుగ్గినేని వెంకట్రావమ్మ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేశారు. ఆమె మధిర మండలం ఇల్లూరు గ్రామానికిచెందినవారు. ఈ ఎన్నికల్లో సీపీఎం తరపున పోటీచేసిన బోడేపూడి వెంకటేశ్వరరావుపై విజయం సాధించారు. ఆమెకు 40,799ఓట్లు రాగా బోడేపూడికి 23,457 ఓట్లు వచ్చాయి. దీంతో 17,342 ఓట్ల మెజార్టీతో ఆమె గెలిచారు. దీంతో మొట్టమొదటిసారిగా మధిరనుంచి ఎమ్మెల్యేగా ఒక మహిళ ప్రాతినిధ్యం వహించినట్లయింది. వెంకట్రావమ్మ విజయవాణి 2009 ఎన్నికల్లో నూతనంగా ఏర్పడిన ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎర్రుపాలెం మండలం పెగళ్లపా డు గ్రామానికి చెందిన సగ్గుర్తి విజయవాణి పోటీచేశారు. ఆమె పెద్దపల్లి డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓగా పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ ఎన్నికల్లో పోటీచేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1,59,985 ఓట్లు పోలవ్వగా అందులో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీచేసిన విజయవాణికి 14,615 ఓట్లు వచ్చాయి. ఓటమి చెందిన తరువాత తిరిగి ఉద్యోగంలో చేరలేదు. ప్రస్తుతం వారు రాజకీయాల కు దూరంగా ఉంటూ మం చిర్యాలలో స్థిరపడ్డారు. -
టీఆర్ఎస్ సమావేశం రసాభాస
సాక్షి, మధిర(ఖమ్మం జిల్లా): అధికార పార్టీ మధిర నియోజకవర్గ స్థాయి సమావేశంలో కార్యకర్తలు కుర్చీలతో కొట్టుకున్నారు. మధిర రెడ్డిగార్డెన్ ఫంక్షన్ హాల్లో బుధవారం టీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు జరగాలంటే కార్యకర్తలు సమర్థవంతంగా పనిచేయాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరావు అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు బేగ్ మాట్లాడుతూ.. వేరే పార్టీల నుంచి వచ్చిన కొందరు అభివృద్ధి జరగటంలేదని అనటం సరికాదని, ఇష్టం లేనివారు బయటకు వెళ్లవచ్చని అనడంతో సమావేశంలో కలకలం రేగింది. కొందరు వాగ్వాదానికి దిగారు. కుర్చీలు విసురుకున్నారు. తాము లేకుండానే నాయకులు అయ్యారా అంటూ ఆరోపణలకు దిగారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బేగ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై ఎంపీ పొంగులేటి జోక్యం చేసుకుని వారికి సర్దిచెప్పి సముదాయించారు. అనంతరం సమావేశం కొనసాగింది. -
మీ గొంతుకనవుతా..
మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం లచ్చగూడెం గ్రామంలో అడుగడుగునా సమస్యలు. సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదని రైతులు.. ఫీజు రీయింబర్స్మెంట్ రాక చదువులు ఆగిపోతున్నాయని విద్యార్థులు..పెన్షన్లు వస్తాయో..రావో తెలియట్లేదని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు..ఇలా ఊళ్లో ఏ ఇంటి తలుపు తట్టినా కష్టాలూ..కన్నీళ్లే. ఆ గ్రామాన్ని ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క ఆదివారం సందర్శించారు. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా గ్రామస్తులను పలుకరించారు. వారి బాధలకు చలించిపోయారు. ‘మీ గళాన్నవుతా.. అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలను ఏకరువు పెడతానంటూ’ వారికి భరోసా ఇచ్చారు. మల్లు భట్టి విక్రమార్క : అమ్మా నమస్తే..నేను మీ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కను.. గుర్తుపట్టారా? సైదమ్మ : అయ్యా గుర్తుపట్టాను. పింఛన్ రావట్లేదయ్యా. పోయినసారి మీరు గెలిచినప్పుడు పింఛన్ వచ్చేదయ్యా. మళ్లీ మీరే ఇప్పించి ఆదుకోవాల నాయనా. భట్టి : అవ్వా బాగున్నావా ? నేను మీ ఎమ్మెల్యేను. మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి. పెన్షన్ వస్తుందా? సర్వే అప్పుడు పేర్లు రాయించారా? దేవరగట్ల నర్సమ్మ : నాయనా నిన్ను మర్చిపోలేదు. మూడు నెలలుగా పింఛన్ రావట్లేదు. అప్పుడు రాసుకొని పోయిండ్రు..ఇదిగో అదిగో అంటుండ్రు. మీరైనా అధికారులకు చెప్పి ఇప్పించడయ్యా. భట్టి : ఏం తమ్ముడు ఎలా ఉన్నావ్..? రాంబాబు (వికలాంగుడు) : సార్ నమస్తే. గతంలో పెన్షన్ వచ్చింది. వికలాంగుల పింఛన్ పెంచినమని ప్రభుత్వం చెప్పింది. ఇంతవరకు ఇవ్వట్లేదు. భట్టి : తమ్ముళ్లు ఏం పనిచేస్తున్నారు.. మీకేమైనా సమస్యలు ఉన్నాయా? కొర్లపాటి గురవయ్య : సార్.. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డాం. డిగ్రీలు, పీజీలు చదువుకుని నిరుద్యోగులుగా మిగిలిపోయాం. ఆర్థిక ఇబ్బందులతో కూలిపనులకు వెళుతున్నాం. అర్హత ఉన్నవారికి ఉద్యోగాలు ఇప్పించండి. భట్టి : తమ్ముడూ ఏం చేస్తున్నావ్? ఇంట్లో అందరూ బాగున్నారా? అప్పారావు : సార్ ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాం. బీఎడ్ చేసిన.. ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. భట్టి : పైపులు ఎక్కడికి.. పొలానికి వెళ్తున్నారా? సాగర్‌నీరు వస్తుందా? పంటలు మంచిగా ఉన్నాయా? లక్ష్మయ్య : ఏం బాగుసార్.. మొక్కజొన్న పంట వేశా. నీరందక ఇబ్బందులు పడుతున్నం. కనీసం గొడ్లు తాగడానికి కూడా నీళ్లు లేవు. కాలువనీరు రావట్లేదు. అర్ధరాత్రి ఇచ్చే కరెంటుతో తడిసిన పొలమే తడుస్తున్నది. భట్టి : అమ్మా ..మీకు ఇందిరమ్మ బిల్లు మంజూరైందా? నాగమణి : ఇల్లు కట్టుకుని 8 నెలలకు పైన అయింది. ఎన్నికలొచ్చినయని బిల్లు ఆపారు. అప్పుచేసి ఇల్లు కట్టుకున్నాం. మీరైనా ఇప్పించండి. భట్టి : ఏం పాప..ఏం చదువుతున్నావ్? మీ ఊరి సమస్యలు చెప్పమ్మా? ప్రత్యూష : సార్ మా ఊళ్లో రోడ్లు సరిగాలేవు. గత ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది. ఇప్పుడు రాలేదు. కాలేజి యాజమాన్యం ఫీజు కట్టమంటోంది. భట్టి : అయ్యగారు బాగున్నారా..? ఎన్నికలప్పుడు మీ గుడికి వచ్చా.. సమస్యలు ఏమైనా ఉన్నాయా? విద్యాసాగర్శర్మ : అప్పట్లో ధూపదీప నైవేద్యాలకు ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేవి. ఇప్పుడు రావట్లేదు. పూజారులు ఇబ్బందుల్లో ఉన్నరు. మీరైనా న్యాయం చేయండి. భట్టి : అవ్వా పింఛన్ వస్తుందా? రాజ్యం : ఎక్కడి పింఛనయ్యా..నోటికాడిది తీసేసుకుండు..నువ్వయినా వచ్చేటట్టు చూడయ్యా. భట్టి : మీ ఇంటి బిల్లు వచ్చిందామ్మా? కళావతి : అయ్యా ఇంటి బిల్లు రాలేదు..పింఛన్ ఇయ్యట్లేదు..మీరే వచ్చేలా చూడండయ్యా. భట్టి : బాగున్నారా..? ఒకచోట కూర్చున్నరు.. పనుల్లేవా? వెంకటేశ్వర్లు : అవునుసారు..రైతులందరం రచ్చబండపైన కూసొని బాధలు చెప్పుకుంటున్నం. మొక్కజొన్న వేస్తే ఎకరానికి పది బస్తలు పండింది. మార్కెట్‌కు తోలుకుపోతే గిట్టుబాటు ధర రాలే. 20 రోజులైనా చెక్కులియ్యలే. భట్టి : గ్రామంలో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? సత్యనారాయణ : ఇంతవరకు రుణమాఫీ కాలేదు. బ్యాంకులు కొత్తరుణాలు ఇయ్యట్లేదు. మార్కెట్లో పత్తి అమ్ముదామని ఖమ్మం సీసీఐకి వెళ్తే గేట్లు వేస్తున్నారు. ఒకరోజుకొంటే నాలుగు రోజులు కొనట్లేదు. కాంటాల కోసం, చెక్కుల కోసం ఎదురుచూస్తున్నం. భట్టి : ఏంటమ్మా.. పత్తి అమ్మలేదు? కృష్ణవేణి : మద్దతు ధరలేక అమ్మలేదు సారు. మూడెకరాలు వేసినం..క్వింటా రూ.2,700కు అడుగుతున్నరు. ఈ రేటుకు అమ్మితే కనీసం కూలీలకు చెల్లించే డబ్బులూ రావు. నా పుస్తెలతాడు బ్యాంకులబెట్టి గోల్డ్‌లోన్ తీసుకున్నం. కానీ రుణమాఫీ చేయడం లేదు. భట్టి : అమ్మా డ్వాక్రా రుణాలు ఇస్తున్నారా? రజిని : అప్పట్లో పావలావడ్డీ రుణాలు ఇచ్చిండ్రు..ఇప్పుడివ్వట్లేదు. వెలుగు ఆఫీస్ చుట్టూ తిరిగినా పట్టించుకోవట్లేదు. మా ఊళ్లో కాపుసారా బందు పెట్టండి..ఇబ్బందులు పడుతున్నం. -
కాంగ్రెస్ ప్రభుత్వం ఖాయం: భట్టి
ఎర్రుపాలెం, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పా టు చేయడం ఖాయమని మాజీ డిప్యూటి స్పీకర్, మధిర నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఖమ్మం జిల్లా ఎ ర్రుపాలెంలో విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే ఓటర్లు పట్టం కట్టారని, సార్వత్రిక ఎన్నికల్లో నూ ఇలాంటి తీర్పే వస్తుందని అన్నారు.ప్రగతి శీల భావాలతో కూడిన ఆధునిక తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుం దని చెప్పారు. మధిరలో తన విజయం ఖాయమన్నారు. -
మోత్కుపల్లి.. ఇదేం లొల్లి
మధిర, న్యూస్‌లైన్: మధిర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మిత్రభేదానికి తెరతీసింది. సార్వత్రిక ఎన్నికల్లో జట్టుకట్టిన బీజేపీ, టీడీపీలు ఎడ్డెం అంటే తెడ్డెం అంటున్నాయి. స్వయాన బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి సొంత నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉంటే జిల్లావ్యాప్తంగా ఆ పార్టీల పొత్తు ఏవిధంగా ఉందో చెప్పక్కర్లేదు అంటున్నారు ప్రతిపక్ష నేతలు. నియోజకవర్గంలో టీడీపీ నేతల వైఖరిపై కమలనాథులు మండిపడుతున్నారు. మధిర అసెంబ్లీ అభ్యర్థిగా చివరినిమిషంలో ఖరారైన వలసనేత మోత్కుపల్లి నర్సింహులు ఇరుపార్టీలను సమన్వయ పరచడంలో విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. టీడీపీ స్థానిక నేతలు ఎవరో కూడా తెలియని ఆయనకు బీజేపీ నేతలు ఎలా తెలుస్తారులే..! అనే విమర్శలు వస్తున్నాయి. నర్సింహులకు స్థానిక నేతల బలాబలాల గురించి తెలియపోవడంతో అసమర్థులకు పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నల్లగొండ జిల్లా నేతను ఇక్కడకు డంప్ చేయడం, జిల్లాలోని ఖమ్మం పార్లమెంట్, అసెంబ్లీ జనరల్ స్థానాలు మూడింటిలోనూ ఒకే సామాజిక వర్గానికి టిక్కెట్లు ఇవ్వడంతో స్థానిక నేతలు చంద్రబాబుపైనా ఆగ్రహంతో ఉన్నారు. బీసీ నేత బాలసాని లక్ష్మీనారాయణకు కొత్తగూడెం టిక్కెట్ ఇచ్చినట్టే ఇచ్చి చివరి నిమిషంలో రద్దుచేయడంపై ఆ పార్టీ నియోజకవర్గ బీసీ నాయకులు మండిపడుతున్నారు. వైఎస్ఆర్సీపీ మద్దతుతో దూసుకుపోతున్న కమల్‌రాజ్.. వైఎస్ఆర్సీపీ మద్దతుతో సీపీఎం అభ్యర్థి లింగాల కమల్‌రాజ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. స్థానికంగా సుపరిచితుడు కావడంతో ఆయనకు కార్యకర్తలపై అవగాహన ఉంది. ఏ గ్రామానికి వెళ్లిన కనీసం ఓ పదిమందినైనా పేరుపెట్టి పిలుస్తారు. ఆయనకు స్థానికంగా ఉన్న పరిచయాలు ప్లస్ పాయింట్ అవుతాయని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు తుమ్మల, నామా వర్గపోరు ప్రభావం నియోజకవర్గంలోనూ ఉంది. డిప్యూటీ స్పీకర్ భట్టి కూడా బలమైన ప్రత్యర్థికావడంతో నియోజకవర్గంలో తెలుగుదేశానిది మూడోస్థానమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రచారంలో భాగంగా మోత్కుపల్లి మాట్లాడే తీరు కూడా స్థానిక నేతలు, కార్యకర్తలకు నచ్చడం లేదని ఆ పార్టీ వారే చెబుతున్నారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను మాటవరసకైనా ప్రస్తావించకుండా ఆయన ప్రసంగం కొనసాగుతోందనే విమర్శలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో నామమాత్రంగా ఉన్న టీఆర్ఎస్ను, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించడం వల్ల వచ్చే ప్రయోజనమేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చంద్రబాబుతో సత్సంబంధాలు ఉన్న మోత్కుపల్లి మధిరకు వస్తే బావుంటుందని అనుకున్న ఆపార్టీ నేతలు ప్రస్తుతం అయోమయానికి గురవుతున్నారు. -
మల్లు భట్టి విక్రమార్కకు ఇంటిపోరు
మధిర : ‘నాపేరు మల్లు శివరాం... నేను మల్లు అనంతరాములు గారి కుమారుడిని.. మధిర అసెంబ్లీకి టీడీపీ అభ్యర్థిగా టిక్కెట్టు ఆశిస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించండి..’ అంటూ ఇటీవలి కాలంలో మధిర నియోజకవర్గ ప్రజల సెల్ఫోన్లకు వస్తున్న వాయిస్ మెసేజ్‌లు రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. స్వయానా డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క అన్న కుమారుడైన ఆయన టీడీపీ నుంచి బరిలో ఉంటానని ప్రకటిస్తుండడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. మధిర అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి ఇప్పటివరకు టీడీపీ ఇన్‌చార్జ్‌ను నియమించలేదు. ఈ క్రమంలో తిరువూరు ఎమ్మెల్యేగా పనిచేసిన స్వామిదాసు, వర్ల రామయ్య, మోత్కుపల్లి నర్సింహులు పేర్లు వినిపించా యి. అయితే ఖమ్మం జిల్లాలో నామా, తుమ్మల వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరడం, నియోజకవర్గంలో టీడీపీకి పెద్దగా పట్టులేకపోవడం వంటి కారణాలతో ఆయా నాయకులు మధిరలో పోటీ చేసేందుకు ముందుకు రావడం లేదు. భట్టి విక్రమార్క, మల్లు శివరాం కుటుంబాల మధ్య బేదాభిప్రాయాలు ఉన్నట్లు చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఇటీవల మల్లు శివరాం మధిరలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో భట్టి వద్దకు వెళ్లేందుకు సామాన్య కార్యకర్తలు ఇబ్బందిపడుతున్నారని ఆయన ఆరోపించినట్లు తెలిసింది. భట్టికి సమీప బంధువైన మల్లు శివరాంకు చంద్రబాబు టిక్కెట్టు ఇచ్చినట్లయితే బాబాయి, అబ్బాయిల మధ్య పోరు తప్పనట్లుగా ఉంది. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో వర్గవిభేదాలు, రెబల్స్ బెడదతో పాటు వైఎస్ఆర్సీపీ, సీపీఎం పొత్తులతో కలిసి ముం దుకు దూసుకుపోతున్న క్రమంలో భట్టికి ఇంటిపోరు తప్పేట్టు లేదనే చర్చ జరుగుతోంది. కాగా, భట్టి ఒక సామాజిక వర్గాన్నే దగ్గరకు తీసుకుంటూ మధిర, ఎర్రు పాలెం మండలాల్లో ఉన్న రెండు సామాజిక వర్గాలను దూరం చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.