మధిర: ప్రస్తుతం పాలకపక్షంతో పాటు ప్రతిపక్షం ఎవరూ కూడా ప్రజల పక్షాన నిలబడక పోవడంతో తాము పార్టీని స్థాపించాల్సి వచ్చిందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఒక దొంగ, బ్లాక్‌మెయిలర్ చేతిలో ఉన్నాయని ఆరో పించారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం ఖమ్మం జిల్లా మధిరకు చేరుకోగా స్థానికంగా వైఎస్సార్, అంబేడ్కర్ విగ్రహాలకు ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం షర్మిల బహిరంగ సభలో మాట్లాడారు. భట్టి విక్రమార్కకు వైఎస్సార్ రాజకీయ భవిష్యత్ కల్పించి వేలు పట్టి నడిపించారని, ఈక్రమంలో ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా ఆయన టీఆర్‌ఎస్ పార్టీలో చేరకపోవడం మంచిదేనని అభిప్రాయపడ్డారు.
కానీ, వైఎస్సార్ ఫొటో పెట్టుకుని గెలిచిన ఆయన.. మహానేత పేరును కాంగ్రెస్ పార్టీ ఎఫ్‌ఐఆర్‌లో చేరిస్తే ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ‘వైఎస్సార్ బిడ్డగా చెబుతున్నా.. తమను ప్రజలు ఆశీర్వదిస్తే మళ్లీ రాజన్న సంక్షేమ పాలనను తీసుకువస్తా’ అని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీలంటే వైఎస్సార్‌కు ఎంతో అభిమానమని, ప్రస్తుత సీఎం కేసీఆర్ మాత్రం దళిత మహిళ మరియమ్మను జైలులో చంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. యాత్రలో వైఎస్సార్ టీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment