మల్లు భట్టి విక్రమార్కకు ఇంటిపోరు
మధిర : ‘నాపేరు మల్లు శివరాం... నేను మల్లు అనంతరాములు గారి కుమారుడిని.. మధిర అసెంబ్లీకి టీడీపీ అభ్యర్థిగా టిక్కెట్టు ఆశిస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించండి..’ అంటూ ఇటీవలి కాలంలో మధిర నియోజకవర్గ ప్రజల సెల్‌ఫోన్లకు వస్తున్న వాయిస్ మెసేజ్‌లు రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. స్వయానా డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క అన్న కుమారుడైన ఆయన టీడీపీ నుంచి బరిలో ఉంటానని ప్రకటిస్తుండడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.
మధిర అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి ఇప్పటివరకు టీడీపీ ఇన్‌చార్జ్‌ను నియమించలేదు. ఈ క్రమంలో తిరువూరు ఎమ్మెల్యేగా పనిచేసిన స్వామిదాసు, వర్ల రామయ్య, మోత్కుపల్లి నర్సింహులు పేర్లు వినిపించా యి. అయితే ఖమ్మం జిల్లాలో నామా, తుమ్మల వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరడం, నియోజకవర్గంలో టీడీపీకి పెద్దగా పట్టులేకపోవడం వంటి కారణాలతో ఆయా నాయకులు మధిరలో పోటీ చేసేందుకు ముందుకు రావడం లేదు.
భట్టి విక్రమార్క, మల్లు శివరాం కుటుంబాల మధ్య బేదాభిప్రాయాలు ఉన్నట్లు చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఇటీవల మల్లు శివరాం మధిరలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో భట్టి వద్దకు వెళ్లేందుకు సామాన్య కార్యకర్తలు ఇబ్బందిపడుతున్నారని ఆయన ఆరోపించినట్లు తెలిసింది. భట్టికి సమీప బంధువైన మల్లు శివరాంకు చంద్రబాబు టిక్కెట్టు ఇచ్చినట్లయితే బాబాయి, అబ్బాయిల మధ్య పోరు తప్పనట్లుగా ఉంది.
ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో వర్గవిభేదాలు, రెబల్స్ బెడదతో పాటు వైఎస్‌ఆర్‌సీపీ, సీపీఎం పొత్తులతో కలిసి ముం దుకు దూసుకుపోతున్న క్రమంలో భట్టికి ఇంటిపోరు తప్పేట్టు లేదనే చర్చ జరుగుతోంది. కాగా, భట్టి ఒక సామాజిక వర్గాన్నే దగ్గరకు తీసుకుంటూ మధిర, ఎర్రు పాలెం మండలాల్లో ఉన్న రెండు సామాజిక వర్గాలను దూరం చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.