మీ గొంతుకనవుతా.. | Mallu Bhatti vikramarka visit the lachha gudem village | Sakshi
Sakshi News home page

మీ గొంతుకనవుతా..

Published Mon, Dec 8 2014 2:32 AM | Last Updated on Mon, Oct 8 2018 9:21 PM

మీ గొంతుకనవుతా.. - Sakshi

మీ గొంతుకనవుతా..

మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం లచ్చగూడెం గ్రామంలో అడుగడుగునా సమస్యలు. సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదని రైతులు.. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక చదువులు ఆగిపోతున్నాయని విద్యార్థులు..పెన్షన్‌లు వస్తాయో..రావో తెలియట్లేదని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు..ఇలా ఊళ్లో ఏ ఇంటి తలుపు తట్టినా కష్టాలూ..కన్నీళ్లే. ఆ గ్రామాన్ని ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క ఆదివారం సందర్శించారు. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా గ్రామస్తులను పలుకరించారు. వారి బాధలకు చలించిపోయారు. ‘మీ గళాన్నవుతా.. అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలను ఏకరువు పెడతానంటూ’ వారికి భరోసా ఇచ్చారు.
 
మల్లు భట్టి విక్రమార్క : అమ్మా నమస్తే..నేను మీ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కను.. గుర్తుపట్టారా?
సైదమ్మ : అయ్యా గుర్తుపట్టాను. పింఛన్ రావట్లేదయ్యా. పోయినసారి మీరు గెలిచినప్పుడు పింఛన్ వచ్చేదయ్యా. మళ్లీ మీరే ఇప్పించి ఆదుకోవాల నాయనా.
భట్టి : అవ్వా బాగున్నావా ? నేను మీ ఎమ్మెల్యేను. మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి. పెన్షన్ వస్తుందా? సర్వే అప్పుడు పేర్లు రాయించారా?
దేవరగట్ల నర్సమ్మ : నాయనా నిన్ను మర్చిపోలేదు. మూడు నెలలుగా పింఛన్ రావట్లేదు. అప్పుడు రాసుకొని పోయిండ్రు..ఇదిగో అదిగో అంటుండ్రు. మీరైనా అధికారులకు చెప్పి ఇప్పించడయ్యా.
భట్టి : ఏం తమ్ముడు ఎలా ఉన్నావ్..?
రాంబాబు (వికలాంగుడు) : సార్ నమస్తే. గతంలో పెన్షన్ వచ్చింది. వికలాంగుల పింఛన్ పెంచినమని ప్రభుత్వం చెప్పింది. ఇంతవరకు ఇవ్వట్లేదు.
భట్టి : తమ్ముళ్లు ఏం పనిచేస్తున్నారు.. మీకేమైనా సమస్యలు ఉన్నాయా?
కొర్లపాటి గురవయ్య : సార్.. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డాం. డిగ్రీలు, పీజీలు చదువుకుని నిరుద్యోగులుగా మిగిలిపోయాం. ఆర్థిక ఇబ్బందులతో కూలిపనులకు వెళుతున్నాం. అర్హత ఉన్నవారికి ఉద్యోగాలు ఇప్పించండి.
భట్టి : తమ్ముడూ ఏం చేస్తున్నావ్? ఇంట్లో అందరూ బాగున్నారా?
అప్పారావు : సార్ ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాం. బీఎడ్ చేసిన.. ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.
భట్టి : పైపులు ఎక్కడికి.. పొలానికి వెళ్తున్నారా? సాగర్‌నీరు వస్తుందా? పంటలు మంచిగా ఉన్నాయా?
లక్ష్మయ్య : ఏం బాగుసార్.. మొక్కజొన్న పంట వేశా. నీరందక ఇబ్బందులు పడుతున్నం. కనీసం గొడ్లు తాగడానికి కూడా నీళ్లు లేవు. కాలువనీరు రావట్లేదు. అర్ధరాత్రి ఇచ్చే కరెంటుతో తడిసిన పొలమే తడుస్తున్నది.
భట్టి : అమ్మా ..మీకు ఇందిరమ్మ  బిల్లు మంజూరైందా?
నాగమణి : ఇల్లు కట్టుకుని 8 నెలలకు పైన అయింది. ఎన్నికలొచ్చినయని బిల్లు ఆపారు. అప్పుచేసి ఇల్లు కట్టుకున్నాం. మీరైనా ఇప్పించండి.
భట్టి : ఏం పాప..ఏం చదువుతున్నావ్? మీ ఊరి సమస్యలు చెప్పమ్మా?
ప్రత్యూష : సార్ మా ఊళ్లో రోడ్లు సరిగాలేవు. గత ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్ వచ్చింది. ఇప్పుడు రాలేదు. కాలేజి యాజమాన్యం ఫీజు కట్టమంటోంది.
భట్టి : అయ్యగారు బాగున్నారా..? ఎన్నికలప్పుడు మీ గుడికి వచ్చా.. సమస్యలు ఏమైనా ఉన్నాయా?
విద్యాసాగర్‌శర్మ : అప్పట్లో ధూపదీప నైవేద్యాలకు ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేవి. ఇప్పుడు రావట్లేదు. పూజారులు ఇబ్బందుల్లో ఉన్నరు. మీరైనా న్యాయం చేయండి.  
భట్టి : అవ్వా పింఛన్ వస్తుందా?
రాజ్యం : ఎక్కడి పింఛనయ్యా..నోటికాడిది తీసేసుకుండు..నువ్వయినా వచ్చేటట్టు చూడయ్యా.
భట్టి : మీ ఇంటి బిల్లు వచ్చిందామ్మా?
కళావతి : అయ్యా ఇంటి బిల్లు రాలేదు..పింఛన్ ఇయ్యట్లేదు..మీరే వచ్చేలా చూడండయ్యా.
భట్టి : బాగున్నారా..? ఒకచోట కూర్చున్నరు.. పనుల్లేవా?
వెంకటేశ్వర్లు : అవునుసారు..రైతులందరం రచ్చబండపైన కూసొని బాధలు చెప్పుకుంటున్నం. మొక్కజొన్న వేస్తే ఎకరానికి పది బస్తలు పండింది. మార్కెట్‌కు తోలుకుపోతే గిట్టుబాటు ధర రాలే. 20 రోజులైనా చెక్కులియ్యలే.
భట్టి : గ్రామంలో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా?
సత్యనారాయణ : ఇంతవరకు రుణమాఫీ కాలేదు. బ్యాంకులు కొత్తరుణాలు ఇయ్యట్లేదు. మార్కెట్‌లో పత్తి అమ్ముదామని ఖమ్మం సీసీఐకి వెళ్తే గేట్లు వేస్తున్నారు. ఒకరోజుకొంటే నాలుగు రోజులు కొనట్లేదు. కాంటాల కోసం, చెక్కుల కోసం ఎదురుచూస్తున్నం.
భట్టి : ఏంటమ్మా.. పత్తి అమ్మలేదు?
కృష్ణవేణి : మద్దతు ధరలేక అమ్మలేదు సారు. మూడెకరాలు వేసినం..క్వింటా రూ.2,700కు అడుగుతున్నరు. ఈ రేటుకు అమ్మితే కనీసం కూలీలకు చెల్లించే డబ్బులూ రావు. నా పుస్తెలతాడు బ్యాంకులబెట్టి గోల్డ్‌లోన్ తీసుకున్నం. కానీ రుణమాఫీ చేయడం లేదు.
భట్టి : అమ్మా డ్వాక్రా రుణాలు ఇస్తున్నారా?
రజిని : అప్పట్లో పావలావడ్డీ రుణాలు ఇచ్చిండ్రు..ఇప్పుడివ్వట్లేదు. వెలుగు ఆఫీస్ చుట్టూ తిరిగినా పట్టించుకోవట్లేదు. మా ఊళ్లో కాపుసారా బందు పెట్టండి..ఇబ్బందులు పడుతున్నం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement