నోట్ల రద్దుతో రైతుల గోస మల్లు భట్టివిక్రమార్క
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ చేయక పోవడం, పెద్దనోట్లను రద్దుచేయడంతో రాష్ట్రంలో రైతులు తీవ్రగోస పడుతున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క అన్నారు. పార్టీ నేతలు అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్‌తో కలసి గాంధీభవన్‌లో శనివారం ఆయన మాట్లాడారు. రుణమాఫీ కాకపోవడంతో బ్యాంకులు కొత్త రుణాలను ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో 40లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీఎంతో పాటు వ్యవసాయశాఖ మంత్రి పోచారం తక్షణమే స్పందించకుంటే వ్యవసాయ రం గం తీవ్రంగా దెబ్బతింటుందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు ప్రత్యేకంగా కరెన్సీ ఏర్పాట్లు చేయకపోవడం బాధాకరమన్నారు. నోట్ల రద్దు ప్రభావం గ్రామాల మీద, ప్రత్యేకంగా వ్యవసాయం మీద తీవ్రంగా ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీని కడిగేస్తానంటూ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను భట్టి ఖండించారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్ రెచ్చగొట్టేలా మాట్లాడటం బాధ్యతా రాహిత్యమన్నారు. సభను ఎన్ని రోజులైనా నడుపుదామని, అంశాలవారీగా చర్చకు ఎన్ని గంటలైనా సిద్ధమని చెప్పిన సీఎం మాటపై ఎప్పుడూ నిలబడలేదన్నారు. కేసీఆర్ చెప్పేదొకటి, చేసేదొకటి అని వ్యాఖ్యానించారు. ఫాంహౌస్‌లో కేసీఆర్ విలాసాల్లో ఉంటే, ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీల్లో రూ. లక్షల ఫీజులు వసూలు చేసుకుంటే తెలంగాణ రాలేదని భట్టి అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిం చాలని తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చారని చెప్పారు.