ఫీజు బకాయిల చెల్లింపుపై చిత్తశుద్ధి లేదు
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంటుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, అడిగితే సమాదానం కూడా సరిగా చెప్పడంలేదని సీఎల్పీ ఉపనాయకుడు మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. గురువారం ఫీజు బకాయిల చెల్లింపు అంశంపై శాసనసభలో వివరణలు పూర్తయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది. అనం తరం భట్టి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలసి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడానికి విద్యార్థుల బలిదానాలే కారణమని, అలాంటి విద్యార్థులకు ఫీజు బకాయిలను చెల్లిస్తారని ఆశించామన్నారు. దీనిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే సరైన సమాధానం ఇవ్వలేదని భట్టి విమర్శించారు. కాలేజీలను బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రభుత్వం ఈ నివేదికను ఉపయోగించుకుంటున్నదని ఆరోపించారు.
జీఓ 123పై మొట్టికాయ
అడ్డగోలు భూసేకరణకోసం తెచ్చిన జీఓ 123ని హైకోర్టు కొట్టివేయడం ప్రభుత్వానికి మొట్టికాయ పడినట్టేనని మల్లు భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. జీఓ 123 వద్దని, భూసేకరణచట్టం–2013 ప్రకారమే భూసేకరణ జరపాలని డిమాండ్ చేశారు.