మోత్కుపల్లి.. ఇదేం లొల్లి | bjp not attend to telugu desam 's campaign | Sakshi
Sakshi News home page

మోత్కుపల్లి.. ఇదేం లొల్లి

Published Thu, Apr 24 2014 2:11 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

bjp not attend to telugu desam 's campaign

మధిర, న్యూస్‌లైన్: మధిర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మిత్రభేదానికి తెరతీసింది. సార్వత్రిక ఎన్నికల్లో జట్టుకట్టిన బీజేపీ, టీడీపీలు ఎడ్డెం అంటే తెడ్డెం అంటున్నాయి. స్వయాన బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి సొంత నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉంటే జిల్లావ్యాప్తంగా ఆ పార్టీల పొత్తు ఏవిధంగా ఉందో చెప్పక్కర్లేదు అంటున్నారు ప్రతిపక్ష నేతలు. నియోజకవర్గంలో టీడీపీ నేతల వైఖరిపై కమలనాథులు మండిపడుతున్నారు. మధిర అసెంబ్లీ అభ్యర్థిగా చివరినిమిషంలో ఖరారైన వలసనేత మోత్కుపల్లి నర్సింహులు ఇరుపార్టీలను సమన్వయ పరచడంలో విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి.

 టీడీపీ స్థానిక నేతలు ఎవరో కూడా తెలియని ఆయనకు బీజేపీ నేతలు ఎలా తెలుస్తారులే..! అనే విమర్శలు వస్తున్నాయి. నర్సింహులకు స్థానిక నేతల బలాబలాల గురించి తెలియపోవడంతో అసమర్థులకు పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నల్లగొండ జిల్లా నేతను ఇక్కడకు డంప్ చేయడం, జిల్లాలోని ఖమ్మం పార్లమెంట్, అసెంబ్లీ జనరల్ స్థానాలు మూడింటిలోనూ ఒకే సామాజిక వర్గానికి టిక్కెట్లు ఇవ్వడంతో స్థానిక నేతలు చంద్రబాబుపైనా ఆగ్రహంతో ఉన్నారు. బీసీ నేత బాలసాని లక్ష్మీనారాయణకు కొత్తగూడెం టిక్కెట్ ఇచ్చినట్టే ఇచ్చి చివరి నిమిషంలో రద్దుచేయడంపై ఆ పార్టీ నియోజకవర్గ బీసీ నాయకులు మండిపడుతున్నారు.

 వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుతో  దూసుకుపోతున్న కమల్‌రాజ్..
 వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుతో సీపీఎం అభ్యర్థి లింగాల కమల్‌రాజ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. స్థానికంగా సుపరిచితుడు కావడంతో ఆయనకు కార్యకర్తలపై అవగాహన ఉంది. ఏ గ్రామానికి వెళ్లిన కనీసం ఓ పదిమందినైనా పేరుపెట్టి పిలుస్తారు. ఆయనకు స్థానికంగా ఉన్న పరిచయాలు ప్లస్ పాయింట్ అవుతాయని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు తుమ్మల, నామా వర్గపోరు ప్రభావం నియోజకవర్గంలోనూ ఉంది. డిప్యూటీ స్పీకర్ భట్టి కూడా బలమైన ప్రత్యర్థికావడంతో నియోజకవర్గంలో తెలుగుదేశానిది మూడోస్థానమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 ప్రచారంలో భాగంగా మోత్కుపల్లి మాట్లాడే తీరు కూడా స్థానిక నేతలు, కార్యకర్తలకు నచ్చడం లేదని ఆ పార్టీ వారే చెబుతున్నారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను మాటవరసకైనా ప్రస్తావించకుండా ఆయన ప్రసంగం కొనసాగుతోందనే విమర్శలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో నామమాత్రంగా ఉన్న టీఆర్‌ఎస్‌ను, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించడం వల్ల వచ్చే ప్రయోజనమేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చంద్రబాబుతో సత్సంబంధాలు ఉన్న మోత్కుపల్లి మధిరకు వస్తే బావుంటుందని అనుకున్న ఆపార్టీ నేతలు ప్రస్తుతం అయోమయానికి గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement