Madhya Pradesh BJP
-
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అసమ్మతి సెగ
-
మధ్యప్రదేశ్లో కూడా కర్ణాటక ఫార్ములానే నమ్ముకున్న కాంగ్రెస్
భోపాల్: కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచి అక్కడ ఆ పార్టీకి పట్టం కట్టాయి. అందుకే త్వరలో మధ్య ప్రదేశ్లో జరగనున్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీ పార్టీని మట్టి కరిపించేందుకు కర్ణాటక ఎన్నికల ఫార్ములానే అనుసరిస్తోంది. మధ్య ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి వ్యూహాలను రచిస్తోంది. కర్ణాటకలో తాము చేసిన హామీలకు ప్రజలు బ్రహ్మరధం పట్టడంతో అదే తరహాలో మధ్య ప్రదేశ్లో కూడా కొన్ని ఉచిత పథకాలను ప్రకటించింది. ఉచితాలను ప్రధానాస్త్రంగా చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీ ప్రభుత్వ అవినీతిని కూడా లక్ష్యం చేసుకుని ప్రచారానికీ శ్రీకారం చుట్టనుంది. జూన్ 12న జబల్ పూర్ వేదికగా జరిగిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ కర్ణాటకలో మేము ప్రజలకు ఐదు గ్యారెంటీ పథకాలను హామీ ఇచ్చాము. అధికారంలోకి రాగానే మొదట ఆ అయిదింటినీ నెరవేర్చామని తెలిపారు. మధ్య ప్రదేశ్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు నెలకు రూ.1500, గ్యాస్ సిలిండర్ రూ.500కు, 100 యూనిట్ల ఉచిత కరెంటు, 200 యూనిట్ల వరకు సగం ధరకు, పాత పెన్షన్ స్కీమును మళ్ళీ అమలు చేస్తామని.. పేద రైతులకు పూర్తి రుణమాఫీ చేస్తామని ఐదు హామీలను ప్రకటించారు. ఎన్నికల ప్రణాళికలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికలకు ఇంఛార్జిగా వ్యవహరించిన రణదీప్ సూర్జేవాలాను మొదట ఇంఛార్జిగా నియమించింది. కర్ణాటక ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలును కూడా రంగంలోకి దించింది. కర్ణాటకలో అధికార పక్షంపై 40 శాతం కమీషన్ అంటూ విమర్శలు గుప్పించైనా కాంగ్రెస్ పార్టీ మధ్య ప్రదేశ్ విషయానికి వచ్చేసరికి 50 శాతం కమీషన్ అంటూ బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ కుంభ మేళా, సింహస్త మేళా, మహాకాళీ దేవాలయ నిర్మాణంలోనూ యథేచ్ఛగా అవినీతి జరుగుతోందని ఆరోపణలు చేసి ప్రభుత్వ అవినితిని కూడా లక్ష్యం చేశారు. ప్రచారపర్వంలో కాంగ్రెస్ నేతల దూకుడుకి అడ్డుకట్ట వేస్తామని వారు అబద్ద ప్రచారాలతో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఒక నకిలీ లేఖను ప్రజలకు చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తోన్న ప్రియాంక గాంధీకి ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త గట్టిగా బుద్ధి చెబుతారని అన్నారు మధ్యప్రదేశ్ బీజేపీ అధినేత విడి శర్మ. సెంట్రల్ ఎలెక్షన్ కమిటీ సమావేశం పూర్తయి మొదటి విడతలో 39 అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ పార్టీ కూడా ఎన్నికల్లో దూకుడును పెంచింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చోహాన్ మాట్లాడుతూ సరైన సమయంలో మేము వారికి సమాధానమిస్తామని.. మా అభ్యర్ధులు అప్పుడే కదనరంగంలోకి దూకారని వారు మాత్రం అభ్యర్థులను ప్రకటించడానికి కూడా భయపడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మధ్య ప్రదేశ్లో డివిజనల్ స్థాయి సమావేశాలను నిర్వహించనుంది. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, బీహార్ కు చెందిన 230 మంది ఎమ్మెల్యేలు ఏడు రోజులపాటు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. మరోపక్క బీజేపీ తొలివిడత జాబితాను ప్రకటించిన తర్వాత ప్రచారానికి ఊపు తీసుకురావడానికి కేంద్ర మంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగనున్నారు. ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీ విషయంలో ప్రజలు తమ తప్పు తెలుసుకున్నారు.. -
కేంద్ర మంత్రి ఉల్లిపాయల ఐడియా!.. మీరూ ట్రై చేస్తారా..?
గ్వాలియర్: ఎండాకాలం విపరీతంగా ఎండలు పెరిగిపోతున్నాయి. వడగాల్పుల నుంచి తట్టుకోవడానికి రకరకాల వంటింటి చిట్కాలు పాటిస్తుంటారు. కేంద్ర విమానయాన శాఖమంత్రి జ్యోతిరాదిత్య సింథియ కూడా ఉల్లిపాయల చిట్కాను పాటిస్తున్నట్లు చెప్పారు. ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి అధికారులకు కూడా ఆయన ఆ చిట్కాను సూచించారు. వేడికి ఉల్లిపాయల ఐడియా మధ్యప్రదేశ్ గ్వాలియర్లో ఎండలు విపరీతంగా పెరిగాయి. దాదాపు 45డిగ్రీల సెల్సియస్ వరకు చెరుకున్నాయి. దీంతో రోజురోజుకూ వడదెబ్బతో మరణాల సంఖ్య పెరుగుతోంది. గత వారం రోజుల్లోనే 50 మంది ఆసుపత్రిలో చేరారు. దీంతో కేంద్ర మంత్రి సింథియా వేడినుంచి తప్పించుకోవడానికి ఉల్లిపాయలు తెచ్చుకోవాలని సూచనలు చేశారు. అధికారులు కూడా పాటించాలని సూచించారు. తానూ పాటిస్తున్నట్లు చెప్పారు. ఎండాకాలం అయినందున ఇంటి నుంచి బయటకు వెళ్లేప్పుడే తన పాకెట్లో ఉల్లిగడ్డలు వెంట తెచ్చుకుంటున్నారట సింథియా. వాటిని ఉపయోగించి శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చని చెప్పారు. వేసవి ఎండల్లోనూ పార్టీ కార్యక్రమాల్లో నిరాటంకంగా పనిచేయగలుగుతున్నానని తెలిపారు. ఉల్లిపాయలు శరీరంలో వేడిని గణనీయంగా తగ్గిస్తాయని వెల్లడించారు. మధ్యప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. అజయ్ పాల్ కూడా ఎండల వేడి నుంచి తప్పించుకోవడానికి పలు సూచనలు చేశారు. తగిన మోతాదుల్లో నీటిని తాగాలని సూచించారు. ఇదీ చదవండి:'సెంట్రల్ విస్టాపై ప్రతిపక్షాలది తప్పుడు చర్య.' -
భిక్షాటన చేయాలా లేక రాజకీయాల్లోకి ప్రవేశించాలా!
సాక్షి వెబ్ ప్రత్యేకం (భోపాల్): కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలకు చిరునామా అని కాంగ్రెస్ను ఎద్దేవా చేసే కమలనాథులు ఇప్పుడు స్వరం మార్చి తమ వారసుల రాజకీయ భవిష్యత్తు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్నాళ్లూ ప్రత్యర్థి కాంగ్రెస్ను విమర్శించిన వారే ఇప్పుడు తమ పిల్లలకు ఎన్నికల్లో పోటీచేసే అవకాశమివ్వాలని పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇందుకు ఉదాహరణగా మధ్యప్రదేశ్ విపక్ష బీజేపీ నేత గోపాల్ భార్గవ మాటల్ని చెప్పవచ్చు. బీజేపీ సీనియర్ నాయకులు తమ వారసులకు లోక్సభ టిక్కెట్ల కోసం ఆశిస్తున్నారట, నిజమేనా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. ‘‘రైతు కొడుకు మళ్లీ తండ్రిలాగే వ్యవసాయం, అధికారి కుమారుడు తిరిగి తన నాన్నలాగే సేవారంగం, వ్యాపారి తనయుడు వ్యాపారం చేయగా లేనిది.. 20 సంవత్సరాలు ప్రజల్లో ఉన్న రాజకీయ నాయకుల వారసులు భిక్షాటన చేయాలా లేక రాజకీయాల్లోకి ప్రవేశించాలా’’ అని ఘాటుగా సమాధానమిచ్చారు. సోషల్ మీడియాను యాక్టివ్గా ఉపయోగించే గోపాల్ భార్గవ కుమారుడు అభిషేక్ ప్రస్తుత మధ్యప్రదేశ్ బీజేపీ యువజన మోర్చా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. వారసులూ అర్హులే.. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివ్రాజ్ సింగ్ చౌహాన్ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన గౌరీశంకర్ కూడా తన కూతురు మౌసమ్ బీ సేన్కు బాలాఘాట్ నియోజకవర్గ లోక్సభ టిక్కెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. 25 సంవత్సరాలు నిండి, పార్టీ భావజాలానికి అనుగుణంగా పనిచేసే నేతల వారసులు ఎంపీ సీట్లలో పోటీ చేయడానికి పూర్తిగా అర్హులని.. వారికి పార్టీ టిక్కెట్లు ఇవ్వాలని గౌరీ శంకర్ మీడియాతో అన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్వార్గియా మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడి కోసం మొన్నటి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండోర్-3 నియోజకవర్గ సీటును వదులుకున్నానని , నాయకుల తనయులు టిక్కెట్లను ఆశించడంలో తప్పులేదని, కానీ సీట్ల కేటాయింపులో అంతిమ నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికే వదిలేస్తున్నామని తెలిపారు. పెరుగుతున్న ఒత్తిడి.. ఆగని విమర్శల తాకిడి మాజీ మంత్రి గౌరీ శంకర్ షెజ్వార్ తనయుడు ముదిత్ ఈసారి లోక్సభ టిక్కెట్ దక్కించుకున్నారు. లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ కుమారుడు మందర్, నరేంద్ర సింగ్ తోమర్ వారసుడు దేవేంద్రకు బీజేపీ టిక్కెట్లు ఇవ్వడానికి నిరాకరించింది. సీనియర్ నాయకుడు రాఘవాజీ తన కుమార్తె జ్యోతి షాను అసెంబ్లీ ఎన్నికల బరిలో దించాలని ప్రయత్నించినా బీజేపీ హైకమాండ్ తిరస్కరించింది. నిరుత్సాహపడిన రాఘవాజీ తన తనయకు లోక్సభ ఎన్నికల్లోనైనా పార్టీ నుంచి పోటీ చేసే అవకాశమివ్వాల్సిందేనని బీజేపీపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. బీజేపీలో జరుగుతున్న వారసత్వ రగడను చూసి కాంగ్రెస్ సంబరపడుతోంది. ఇన్ని రోజుల నుంచి తమను విమర్శిస్తూ వచ్చిన కాషాయ నేతలపై ఇదే అదనుగా హస్తం నేతలు వాగ్బాణాలను సంధిస్తున్నారు. పార్టీలో నెలకొన్న వారసత్వ కుంపట్లను బీజేపీ అధిష్టానం ఎలా చల్లారుస్తుందో చూడాలి. -
చేయిచేసుకున్న స్వరూపానంద!
వివాదాలు కొనితెచ్చుకోవడంలో రాజకీయ నాయకులతో బాబాలు పోటీ పడుతున్నారు. దురుసు ప్రవర్తనలో నేతాశ్రీలకు తామేమి తీసిపోమని రుజువు చేస్తున్నారు. దీనికి తాజా ఉదాహరణగా నిలిచారు ద్వారక శంకరాచార్య స్వరూపానంద సరస్వతి. తాను సాధువునన్న సంగతి మర్చిపోయి విలేకరిపై చేయి చేసుకున్నారు. పెద్దరికాన్ని పక్కనపెట్టి పాత్రికేయుడిపై ప్రతాపం చూపారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గురించి ఓ విలేకరి ప్రశ్న సంధించడం స్వరూపానందకు ఆగ్రహం తెప్పించింది. రాజకీయాల గురించి అడగొద్దని చెప్పినా వినకుండా విలేకరి ప్రశ్నించడంతో అతడిపై ఆయన చేయి చేసుకున్నారు. మధ్యప్రదేశ్లోని జబర్పూర్లో జరిగిన ఈ ఘటన దృశ్యాలు జాతీయ చానళ్ల ప్రసారం కావడంతో స్వరూపానంద వివరణయిచ్చారు. పాత్రికేయుడిపై కావాలని చేయి చేసుకోలేదని, పొరపాటున తన చేయి అతడికి తగిలిందని తెలిపారు. అయితే ఇదంతా కాషాయ పార్టీ కుట్ర అని స్వరూపానంద ప్రతినిధి ఆరోపించారు. బీజేపీ ఇదంతా చేయించిందని అన్నారు. స్వామిజీని ప్రశ్నించిన విలేకరి మద్యం సేవించి ఉన్నాడని, స్వరూపానందను సమీపించి ఆయనను తోసివేసేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. స్వరూపానందను రెచ్చగొట్టేందుకే అతడు అలా ప్రవర్తించాడని అన్నారు. దీని వెనుక బీజేపీ మాజీ మంత్రి హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. స్వరూపానంద విలేకరిపై చేయిచేసుకోవడం పట్ల మధ్యప్రదేశ్ బీజేపీ మీడియా సెల్ అధ్యక్షుడు హితేష్ వాజపేయి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విలేకరి వెనుక ఎవరో ఉండి ఇదంతా చేయించారని కాంగ్రెస్ ఆరోపించింది. స్వరూపానంద సరస్వతి గతంలోనూ వార్తల్లో నిలిచారు. మోడీని విమర్శించిన బీహార్ సీఎం నితీష్ కుమార్తో కలిసి విరాట్ రామాయణ్ ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొని చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి స్వరూపానంద సరస్వతి తన 'చేతి వాటం'తో మరోసారి పతాక శీర్షికలకు ఎక్కారు.