భోపాల్: కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచి అక్కడ ఆ పార్టీకి పట్టం కట్టాయి. అందుకే త్వరలో మధ్య ప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీ పార్టీని మట్టి కరిపించేందుకు కర్ణాటక ఎన్నికల ఫార్ములానే అనుసరిస్తోంది.
మధ్య ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి వ్యూహాలను రచిస్తోంది. కర్ణాటకలో తాము చేసిన హామీలకు ప్రజలు బ్రహ్మరధం పట్టడంతో అదే తరహాలో మధ్య ప్రదేశ్‌లో కూడా కొన్ని ఉచిత పథకాలను ప్రకటించింది. ఉచితాలను ప్రధానాస్త్రంగా చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీ ప్రభుత్వ అవినీతిని కూడా లక్ష్యం చేసుకుని ప్రచారానికీ శ్రీకారం చుట్టనుంది.
జూన్ 12న జబల్ పూర్ వేదికగా జరిగిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ కర్ణాటకలో మేము ప్రజలకు ఐదు గ్యారెంటీ పథకాలను హామీ ఇచ్చాము. అధికారంలోకి రాగానే మొదట ఆ అయిదింటినీ నెరవేర్చామని తెలిపారు. మధ్య ప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు నెలకు రూ.1500, గ్యాస్ సిలిండర్ రూ.500కు, 100 యూనిట్ల ఉచిత కరెంటు, 200 యూనిట్ల వరకు సగం ధరకు, పాత పెన్షన్ స్కీమును మళ్ళీ అమలు చేస్తామని.. పేద రైతులకు పూర్తి రుణమాఫీ చేస్తామని ఐదు హామీలను ప్రకటించారు.
ఎన్నికల ప్రణాళికలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికలకు ఇంఛార్జిగా వ్యవహరించిన రణదీప్ సూర్జేవాలాను మొదట ఇంఛార్జిగా నియమించింది. కర్ణాటక ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలును కూడా రంగంలోకి దించింది. కర్ణాటకలో అధికార పక్షంపై 40 శాతం కమీషన్ అంటూ విమర్శలు గుప్పించైనా కాంగ్రెస్ పార్టీ మధ్య ప్రదేశ్ విషయానికి వచ్చేసరికి 50 శాతం కమీషన్ అంటూ బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది.
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ కుంభ మేళా, సింహస్త మేళా, మహాకాళీ దేవాలయ నిర్మాణంలోనూ యథేచ్ఛగా అవినీతి జరుగుతోందని ఆరోపణలు చేసి ప్రభుత్వ అవినితిని కూడా లక్ష్యం చేశారు.
ప్రచారపర్వంలో కాంగ్రెస్ నేతల దూకుడుకి అడ్డుకట్ట వేస్తామని వారు అబద్ద ప్రచారాలతో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఒక నకిలీ లేఖను ప్రజలకు చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తోన్న ప్రియాంక గాంధీకి ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త గట్టిగా బుద్ధి చెబుతారని అన్నారు మధ్యప్రదేశ్ బీజేపీ అధినేత విడి శర్మ.
సెంట్రల్ ఎలెక్షన్ కమిటీ సమావేశం పూర్తయి మొదటి విడతలో 39 అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ పార్టీ కూడా ఎన్నికల్లో దూకుడును పెంచింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చోహాన్ మాట్లాడుతూ సరైన సమయంలో మేము వారికి సమాధానమిస్తామని.. మా అభ్యర్ధులు అప్పుడే కదనరంగంలోకి దూకారని వారు మాత్రం అభ్యర్థులను ప్రకటించడానికి కూడా భయపడుతున్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ మధ్య ప్రదేశ్‌లో డివిజనల్ స్థాయి సమావేశాలను నిర్వహించనుంది. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, బీహార్ కు చెందిన 230 మంది ఎమ్మెల్యేలు ఏడు రోజులపాటు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. మరోపక్క బీజేపీ తొలివిడత జాబితాను ప్రకటించిన తర్వాత ప్రచారానికి ఊపు తీసుకురావడానికి కేంద్ర మంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగనున్నారు.
ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీ విషయంలో ప్రజలు తమ తప్పు తెలుసుకున్నారు..
Comments
Please login to add a commentAdd a comment