చేయిచేసుకున్న స్వరూపానంద!
వివాదాలు కొనితెచ్చుకోవడంలో రాజకీయ నాయకులతో బాబాలు పోటీ పడుతున్నారు. దురుసు ప్రవర్తనలో నేతాశ్రీలకు తామేమి తీసిపోమని రుజువు చేస్తున్నారు. దీనికి తాజా ఉదాహరణగా నిలిచారు ద్వారక శంకరాచార్య స్వరూపానంద సరస్వతి. తాను సాధువునన్న సంగతి మర్చిపోయి విలేకరిపై చేయి చేసుకున్నారు. పెద్దరికాన్ని పక్కనపెట్టి పాత్రికేయుడిపై ప్రతాపం చూపారు.
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గురించి ఓ విలేకరి ప్రశ్న సంధించడం స్వరూపానందకు ఆగ్రహం తెప్పించింది. రాజకీయాల గురించి అడగొద్దని చెప్పినా వినకుండా విలేకరి ప్రశ్నించడంతో అతడిపై ఆయన చేయి చేసుకున్నారు. మధ్యప్రదేశ్లోని జబర్పూర్లో జరిగిన ఈ ఘటన దృశ్యాలు జాతీయ చానళ్ల ప్రసారం కావడంతో స్వరూపానంద వివరణయిచ్చారు. పాత్రికేయుడిపై కావాలని చేయి చేసుకోలేదని, పొరపాటున తన చేయి అతడికి తగిలిందని తెలిపారు.
అయితే ఇదంతా కాషాయ పార్టీ కుట్ర అని స్వరూపానంద ప్రతినిధి ఆరోపించారు. బీజేపీ ఇదంతా చేయించిందని అన్నారు. స్వామిజీని ప్రశ్నించిన విలేకరి మద్యం సేవించి ఉన్నాడని, స్వరూపానందను సమీపించి ఆయనను తోసివేసేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. స్వరూపానందను రెచ్చగొట్టేందుకే అతడు అలా ప్రవర్తించాడని అన్నారు. దీని వెనుక బీజేపీ మాజీ మంత్రి హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
స్వరూపానంద విలేకరిపై చేయిచేసుకోవడం పట్ల మధ్యప్రదేశ్ బీజేపీ మీడియా సెల్ అధ్యక్షుడు హితేష్ వాజపేయి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విలేకరి వెనుక ఎవరో ఉండి ఇదంతా చేయించారని కాంగ్రెస్ ఆరోపించింది. స్వరూపానంద సరస్వతి గతంలోనూ వార్తల్లో నిలిచారు. మోడీని విమర్శించిన బీహార్ సీఎం నితీష్ కుమార్తో కలిసి విరాట్ రామాయణ్ ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొని చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి స్వరూపానంద సరస్వతి తన 'చేతి వాటం'తో మరోసారి పతాక శీర్షికలకు ఎక్కారు.