ఇక ఆ డెబిట్ కార్డులు రద్దు
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మాస్ట్రో డెబిట్ కార్డు హోల్డర్లకు షాక్ ఇవ్వనుంది. మాస్ట్రో డెబిట్ కార్డులను త్వరలో రద్దు చేయనున్నట్టు పేర్కొంది. జూలై 31 నుంచి ఈ కార్డులను నిలిపివేయనున్నట్టు బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు తమ ఖాతాదారులకు బ్యాంకు సమాచారాన్ని కూడా అందిస్తోంది. తాము జారీ చేసిన అన్ని మాస్ట్రో కార్డులను జులై 31 నుంచి బ్లాక్ చేస్తామనీ, భద్రతను మరింత పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని బ్యాంకు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే ఈ కార్డులు కలిగి ఉన్నవారు మరింత భద్రతతో కూడిన ఈఎంవీ చిప్ ఆధారిత కార్డులతో మార్చుకోవాలని వినియోగదారులను కోరింది. అలా మార్చుకోకపోతే ఆ కార్డులను పూర్తిగా బ్లాక్ చేస్తామని ప్రకటించింది. ఇందుకు జూలై 31ను గడువుగా విధించింది.
2015 లో జారీ చేసిన ఆర్బీఐ ఆదేశాల ప్రకారం అన్ని బ్యాంకులు చాలా సురక్షితమైన ఈఎంవీ చిప్ ఆధారిత కార్డులకు మైగ్రేట్ అవుతున్నట్టు బ్యాంక్ అధికారి ఒకరు తెలిపారు. డిసెంబర్ 31, 2018 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు.
మరోవైపు కొత్త కార్డులతో మార్చుకోవడానికి బ్యాంకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయమని బ్యాంక్ స్పష్టం చేసింది. మాస్ట్రో డెబిట్ కార్డు కలిగి ఉన్నవారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏ బ్రాంచి నుంచైనా ఉచితంగా చిప్ ఆధారిత కార్డుతో మార్చుకోవచ్చని వివరించింది. కాగా పాత మాస్ట్రో డెబిట్ కార్డులతో సుమారు లక్ష మంది ఖాతాదారులు ఉన్నట్లు బ్యాంకు గుర్తించింది. అలాగే తమ ఖాతాదారులకు ఎస్ఎంఎస్లను కూడా పంపించిందని బ్యాంకు ఒక అధికారి తెలిపారు.