ఢిల్లీలో భూకంపం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ఉత్తర భారత రాష్ట్రాల్లో సోమవారం రాత్రి 10.30 గంటలకు భూకం పం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో వచ్చిన ఈ భూకంప కేంద్రం ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో భూమికి 33 కిలోమీటర్ల దిగువన నమోదైంది. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లలో దీని ప్రభావం కనిపించింది. హరియాణాలోని గురుగ్రామ్, ఫరీదాబాద్, రోహ్తక్, అంబాలా తదితర చోట్ల, పంజాబ్‌లోని మొహాలీ, పటియాలా, రూపార్, లుధియానా, జలంధర్లలో, ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ప్రకంపనలు వచ్చాయి.
పెద్ద సంఖ్యలో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ‘మంచం, సీలింగ్ ఫ్యాన్ ఊగిపోయాయి’అని నోయిడా వాసులు చెప్పారు. ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్లు వార్తలేవీ రాలేదు. ప్రధాని మోదీ అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. హిమాలయ పర్వతశ్రేణిలోకి వచ్చే ఉత్తరాఖండ్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తుండడం తెలిసిందే.