Hyderabad: సిటీకేమీ ప్రమాదం లేదు..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం భూమి కంపించడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఎవరిని కదిపినా భూకంపం గురించే చర్చించుకున్నారు. అయితే.. హైదరాబాద్ ఉన్న లొకేషన్‌ను బట్టి ఈ ప్రాంతంలో అసలు భూకంపం వచ్చే పరిస్థితి ఉండదని కొందరు అంటున్నారు. కాగా.. మరి బుధవారం భూకంపం కొద్దిసేపు ఎందుకు వచి్చందని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. మన దగ్గర చాలా అరుదుగా మాత్రమే సంభవించే భూకంపం వెనుక కారణాలేమిటి? అనే అన్వేషణలో పడ్డారు జియోలజిస్టులు.మనం రక్షణ వలయంలోనే ఉన్నామా? భూకంపాల ఫ్రీక్వెన్సీని బట్టి దేశంలో జోన్ 2 నుంచి 5 వరకు నాలుగు సెస్మిక్ జోన్లుగా విభజించారు. చాలా తక్కువ భూకంపాలు వచ్చే ప్రాంతాలను జోన్–2గా పేర్కొంటారు. ప్రమాదకరమైన ప్రాంతాలను జోన్–5 కింద చేర్చారు. తెలంగాణ మొత్తం జోన్– 2 కిందకు వస్తుంది. అంటే మన దగ్గర భూకంపాలు వచ్చే తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. పైగా ప్రభావం కూడా చాలా తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హైదరాబాద్ సముద్ర మట్టానికి దాదాపు 542 మీటర్ల ఎత్తులో ఉంది. దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఉండటంతో భూకంపాలు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుందని పేర్కొంటున్నారు.ఆ ప్రాంతాలపై ప్రభావం.. మేడారం సమీపంలో వచ్చిన భూకంపం ఎపిసెంటర్ 40 కిలోమీటర్ల లోతు వద్ద ఏర్పడటంతో.. దాని ప్రభావం కాస్త హైదరాబాద్ చుట్టుపక్కల పడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే.. బంజారాహిల్స్ వంటి ప్రదేశాలు 640 మీటర్ల ఎత్తులో ఉండగా, సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉన్న ఉప్పల్, మేడ్చల్, దిల్సుఖ్నగర్, ఓల్డ్ సిటీ (456 మీటర్లు), మూసీ పరీవాహక ప్రాంతాల్లో భూకంపం వచి్చనట్టు విశ్లేషిస్తున్నారు. అది కూడా చాలా తక్కువ తీవ్రతతో కంపించడంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు.శిలల సిరి.. భాగ్య నగరి.. భాగ్యనగరానికి గొప్ప అది్వతీయమైన లక్షణం ఉంది. అదేమిటంటే నగరం మొత్తం శిలలలో నిర్మితమైంది. దాదాపు 2,500 మిలియన్ సంవత్సరాల కింద ఏర్పడిన ఈ రాళ్లు ప్రపంచంలోకెల్లా అతి పురాతనమైన, అతి బలమైనవిగా పేరుగాంచాయి. సెస్మిక్ జోన్–2 కింద ఉండటంతో భూకంపాల విషయానికొస్తే అత్యంత సురక్షితమైన ప్రాంతంగా చెబుతుంటారు. దీంతో తాజాగా వచ్చిన భూకంపంతో భయపడాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మేడ్చల్‌లో 2 సెకన్ల పాటు.. మేడ్చల్: మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో బుధవారం స్వల్పంగా భూమి కంపించింది. ఉదయం 7.25 నిమిషాలకు వివిధ కాలనీల్లో 2 సెకన్ల పాటు భూమి కంపించింది. పలు కాలనీల్లో భూ కంపం తీవ్రత సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. అధికారులు మాత్రం అధికారికంగా భూకంపంపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు.తార్నాకలోనూ.. లాలాపేట: తార్నాక సండే మార్కెట్, గోకుల్‌నగర్ తదితర కాలనీలో కొందరి ఇళ్లలో వస్తువులు కొన్ని సెకన్ల కదిలాయి. భూకంపం సంభవించినట్లు గ్రహించి కొంత ఆందోళన చెందామని ప్రజలు తెలిపారు. రాజేంద్రనగర్‌లో.. రాజేంద్రనగర్: స్వల్ప భూకంపంతో రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలు ఉలిక్కి పడ్డారు. బుధవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో 2 సెకన్ల పాటు కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది. ఈ భూకంపాన్ని కిస్మత్పూర్, కాటేదాన్, రాజేంద్రనగర్‌లోని పలు ప్రాంతాల ప్రజలు ప్రత్యక్షంగా చూసి అయోమయానికి గురయ్యారు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నడూ లేకపోవడంతో భయాందోళన చెందారు.ఉలిక్కిపడి.. పరుగులు తీసి.. ఎల్బీనగర్: నియోజకవర్గం పరిధిలో పలు ప్రాంతాలలో బుధవారం ఉదయం భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు ఉలిక్కి పడ్డారు. పలు కాలనీల్లో ప్రజలు భయపడి ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు. హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని సూర్యోదయ కాలనీ, బంజారా కాలనీల్లో భూమి సుమారు 5 సెకన్ల పాటు కంపించిందని స్థానికులు చెప్పారు. హయత్‌నగర్‌తో పాటు హస్తినాపురం జెడ్పీ రోడ్డులో, కర్మన్‌ఘాట్ ప్రాంతాల్లో భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. కుర్చీ ఊగింది.. హయత్‌నగర్ సూర్యోదయ కాలనీకి చెందిన వీరస్వామి బుధవారం తన క్లినిక్‌లో కురీ్చలో కూర్చుని ఉండగా ఉదయం 7.28 గంటల సమయంలో 5 సెకన్ల పాటు భూమి కంపించిందని ఆయన పేర్కొన్నారు. వెంటనే క్లినిక్ నుంచి బయటికి వచ్చానని వీరస్వామి పేర్కొన్నారు. వంటింట్లో కదలిన వస్తువులు.. బుధవారం ఉదయం 7.27 గంటల సమయంలో మంచం ఊగింది. వంటింట్లో వస్తువులు కదులుతున్నాయని మా ఆవిడ తెలపడంతో వెంటనే బయటికి వచ్చేశా. సీసీ కెమెరాలను పరిశీలించగా భూకంపం అని తెలిసింది. – బాలు నాయక్, బంజారా కాలనీ, హయత్‌నగర్