ముందస్తుకు ముమ్మర నిఘా
మహబూబ్‌నగర్ క్రైం : ముందస్తు ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు జిల్లా పోలీసులు కసరత్తు ప్రారంభించారు. రౌడీషీటర్లు, నేరప్రవృత్తి కలిగిన వారు దౌర్జన్యాలు, గొడవలు, కుమ్ములాటలకు కారణమవుతుంటారు. ఇటువంటి వారిని జిల్లా పోలీసులు ముందుగానే గుర్తించి పోలీస్ స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే, పార్టీల తరఫున నజరానాలు అందించడం తదితర అనైతిక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించేందుకు నిఘా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా జిల్లా, డివిజన్, మండల స్థాయివరకు మూడంచెల విధానం అమలు చేస్తున్నారు. ఆదర్శ ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయటానికి ఏర్పాట్లు చేశారు.
ప్రత్యేక వాహనాలు
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు 30 ఇన్నావో వాహనాలు, 70ద్విచక్ర వాహనాలను ఇటీవల జిల్లాకు కేటాయించారు. ఇటీవల 30 ఇన్నోవాలు పోలీస్స్టేషన్లకు కేటాయించారు. దీంతో ఆయా వాహనాలు పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనాలు నిరంతరం గస్తీ ప్రారంభించాయి. ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా వెంటనే చేరుకుంటున్న సిబ్బంది.. ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తున్నారు. గతంలో ఇచ్చిన ద్విచక్ర వాహనాలను బ్లూ కోల్డ్ వాహనాలుగా వినియోగిస్తూ గల్లీగల్లీల్లోనూ రాత్రింబవళ్లు గస్తీ కాస్తున్నారు.
రెవెన్యూ, పోలీసుల సమన్వయం
ఎన్నికల విధుల్లో రెవెన్యూ, పోలీసు శాఖలది కీలక పాత్ర. ఈ నేపథ్యంలో రెండు శాఖలను సమన్వయం చేయటంలో ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. క్షేత్రస్థాయిలో జరిగే ప్రతీ చిన్న అంశాన్ని కూడా తమ వరకు చేరేలా సూచనలు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ మేరకు ప్రచారాలు, గోడలపై రాతలు, మీడియాల్లో కథనాలు, సోషల్ మీడియాల్లో పోస్టులు వంటి విషయాలపై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని సూచించారు. శాంతి భద్రతపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటంతో పాటు అనుమతులు లేని పార్టీ కార్యక్రమాలను నిరోధించాలని ఆదేశిస్తున్నారు.
సమస్యాత్మక గ్రామాల గుర్తింపు
జిల్లాలో పోలీసులు దాదాపు 120సమస్యాత్మక గ్రామాలను గుర్తించారు. గతంలోఆయా గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్లలో జరిగిన గొడవలు, ఘర్షణలు, దాడులు, ఓటర్లను మభ్య పెట్టడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ గుర్తింపు చేపట్టారు. జిల్లాలో గుర్తించిన సమస్యాత్మక గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణపై జిల్లా కలెక్టర్, ఎస్పీ స్థాయిలో జరిగిన సమావేశంలో చర్చించారు.
తుపాకులు వెనక్కి..
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో లైసెన్సు ఆయుధాలు కలిగిన వారిపై పోలీసులు దృష్టి సారించారు. ముఖ్యంగా తుపాకులు ఉన్న వారంతా తమ దగ్గర డిపాజిట్ చేయాలంటూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో లైసెన్స్‌దారులంతా ఆయుధాలను సంబంధిత పోలీస్ స్టేషన్లలో అప్పగించారు. జిల్లాలో 400పైగా మంది వ్యాపారులు, రాజకీయ నాయకులు లైసెన్స్ ఆయుధాలు కలిగి ఉన్నారు. వాస్తవానికి గతంతో పోలిస్తే లైసెన్సుల జారీని గతంతో పోలిస్తే చాలా వరకు తగ్గించారు.
తనిఖీలు..
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించటానికి జిల్లా పోలీసులు తగు చర్యలు తీసుకుంటున్నారు. బయటి ప్రాంతాల నుంచి నగదు, మద్యం సరఫరా కాకుండా సరిహద్దు ప్రాంతాలపై గట్టి నిఘా ఏర్పాటు చేశారు. పోలీసు, ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖల ఆధ్వర్యాన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అధికారులతో సమావేశమయ్యారు. జిల్లా పోలీసులు కూడా ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారం కూడా పూర్తి స్థాయిలో తీసుకోవడానికి నిర్ణయించారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు, జిల్లా సరిహద్దుల్లో చెక్కు పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. అలాగే, జిల్లాకు చేరిన ప్రత్యేక పోలీసు బృందాలతో తరచూ కవాతు నిర్వర్తిస్తున్నారు.