mahadevapur mandal
-
కేసీఆర్ డిజైన్ చేస్తే ఇలాగే ఉంటుంది: రాహుల్ గాంధీ
సాక్షి, జయశంకర్భూపాలపల్లి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించారు. అయితే ప్రాజెక్టు వద్ద భారీగా మోహరించిన పోలీసులు ముందుగా ఆయన్ని అంగీకరించలేదు. చివరకు కాంగ్రెస్ శ్రేణుల రిక్వెస్ట్‌తో ఏరియల్ సర్వేకు పోలీసులు అనుమతి ఇచ్చారు. దీంతో ఆయన హెలికాఫ్టర్‌లోనే మేడిగడ్డను పరిశీలించారు. మేడిగడ్డ సందర్శనకు ముందు రాహుల్ గాంధీ అంబట్ పల్లి కాంగ్రెస్ మహిళా సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరిట కరెప్షన్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం కట్టామని గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, డొల్లతనం మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటుతో బట్టబయలైంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయించిన డబ్బులు ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసమే పూర్తిగా ఖర్చు పెట్టి ఉంటే.. ఇలాంటి కుంగుబాటు వచ్చి ఉండేది కాదు. ..ప్రాజెక్టు కు కేటాయించిన లక్ష కోట్లల్లో సగం డబ్బులను దోపిడీ చేసి నాసిరకంగా నిర్మాణం చేయడం వల్లే బ్యారేజ్ పిల్లర్లు కుంగాయి. ఆధునిక టెక్నాలజీ లేని రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసిన శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల నెట్టెంపాడు బీమా తదితర ప్రాజెక్టు నేటికీ పటిష్టంగా ఉన్నాయి. కాళేశ్వరం నిర్మాణం చేసి పట్టుమని రోజులు తిరగకముందే ఇలా బ్యారేజ్ కుంగివడం బాధాకరం. ..చిన్నపాటి వర్షాలకే మేడిగడ్డ బ్యారేజీ కుంగితే భారీ వరదలు వస్తే తట్టుకొని నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఏటీఎం గా మారిందని చెప్తున్న ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా లు ఎందుకని చర్యలు తీసుకోకపోవడం లేదు. చిన్నపాటి ఇంటికే ఇంజనీర్‌తో డిజైన్ చేయిస్తాం. లక్ష కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ ఎలా డిజైన్ చేస్తారు. ఇంజనీర్ల పనిని ఇంజనీర్లను చేయిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. సీఎం కేసీఆర్ డిజైన్ చేస్తే భవిష్యత్తులో ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంటుందని కాంగ్రెస్ పార్టీగా ముందే చెప్పాము. ఇప్పుడు అదే జరిగింది అని రాహుల్ గాంధీ విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. అంబట్పల్లి, మేడిగడ్డ పర్యటనలో రాహుల్ గాంధీతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యరావ్ ఠాక్రే, కాంగ్రెస్ మేనిఫెస్టో చైర్మన్ దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు ఉన్నారు. ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత రాహుల్ గాంధీ సందర్శన నేపథ్యంలో మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. 144 సెక్షన్ అమలు ఉందని, సందర్శనకు అమలు లేదని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణ ఏర్పడింది. చివరకు రాహుల్‌కు ఏరియల్ సర్వే అనుమతి లభించడంతో కాంగ్రెస్ శ్రేణులు శాంతించాయి. -
పీహెచ్సీ ఎదుట మహిళ ప్రసవం
మహదేవపూర్ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఓ గిరిజన మహిళ పీహెచ్సీ ఎదుట రోడ్డుపైన ప్రసవించింది. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి పీహెచ్సీ ఎదుట మంగళవారం జరిగింది. ప్రస్తుతం మహదేవపూర్ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రిలో తల్లీపాప చికిత్స పొందుతున్నారు. బాధితురాలు సమ్మక్క భర్త ఎర్రయ్య కథనం ప్రకారం... జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కిష్టరావుపేట గ్రామానికి చెందిన గిరిజన మహిళ సమ్మక్క ఏడు నెలల గర్భిణి. రోజు మాదిరిగానే కూలీ పనికి వెళ్లింది. పని చేసే చోటనే సమ్మక్కకు పురిటి నొప్పులు వచ్చాయి. దాంతో తోటి కూలీలు, భర్త సమ్మక్కను సమీపంలోని అంబట్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. పీహెచ్సీలో ఉండాల్సిన ఇద్దరు డాక్టర్లు లేరు. దీంతో సిబ్బంది కూడా విధులకు ఎగనామం పెట్టారు. స్టాఫ్ నర్స్‌స్రవంతి సెలవులో ఉన్నారు. దీంతో పురిటి నొప్పులతో వచ్చిన సమ్మక్కకు వైద్య సేవలు అందలేదు. దీంతో అక్కడి నుంచి మహదేవపూర్ ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు సమ్మక్కను పీహెచ్సీ ముందుకు తీసుకురాగా రోడ్డుపైనే ప్రసవించింది. చికిత్స కోసం మహదేవపూర్ ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా విధులకు డుమ్మా కొట్టిన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. -
విషజ్వరాలపై కదలిన యంత్రాంగం
కలెక్టర్ ఆదేశాలతో అధికారుల చర్యలు బెగులూర్‌లో పర్యటించిన జిల్లా వైద్యాధికారి, డీపీవోలు గ్రామంలో ఇద్దరికి డెంగీ లక్షణాలు కాళేశ్వరం : మహదేవపూర్ మండలంలో ప్రబలుతున్న విషజ్వరాలపై విష‘జ్వరాలు పంజా’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనానికి కలెక్టర్ నీతూప్రసాద్ స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు బెగులూర్ గ్రామాన్ని, మహదేవపూర్ ఆసుపత్రిని సందర్శించారు. డీసీహెచ్‌వో అశోక్‌కుమార్, జిల్లా వైద్యాధికారి రాజేశం, డీపీవో సూరజ్‌కుమార్, పెద్దపల్లి డీఎల్పీవో శ్రీనివాస్‌రెడ్డి బెగులూర్ గ్రామంలో వేర్వేరుగా పర్యటించారు. విషజ్వరాలతో బాధపడుతున్నవారితో మాట్లాడారు. పారిశుధ్యలోపంతో జ్వరాలు.. పారిశుధ్యలోపంతోనే గ్రామాల్లో విషజ్వరాలు ప్రబలుతున్నట్లు డీసీహెచ్‌వో అశోక్‌కుమార్, డీఎంఅండ్‌హెచ్‌వో రాజేశం తెలిపారు. తాగునీరు కూడా కలుషితమవుతోందని, సరిగా క్లోరినేషన్ చేయడంలేదని పేర్కొన్నారు. జ్వరపీడితుల రక్త నమూనాలు తీసుకున్నట్లు చెప్పారు. ఆదివారం 47 మంది, సోమవారం ముగ్గురి బ్లడ్ షాంపిల్స్ స్వీకరించి ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. పంకెన గ్రామానికి వెళ్లాలంటే పెద్దంపేట వాగు అడ్డుగా ఉందన్నారు. మంగళవారం ఆగ్రామానికి సిబ్బంది వెళ్తారని చెప్పారు. బెగులూర్‌కు చెందిన సుబ్బారాజు,విజయలక్ష్మి దంపతులకు డెంగీ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. వెంటనే వారిని వరంగల్ ఎంజీఎంకు తరలించినట్లు పేర్కొన్నారు. ఆసుపత్రిలో ఐదుగురు వైద్యులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మహిళా వైద్యురాలిని డెప్యుటేన్పై తీసుకువచ్చినట్లు చెప్పారు. మహదేవపూర్ ఆసుపత్రిలో అన్ని రకాల పరికరాలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. పంచాయతీల నిర్లక్ష్యంతో పారిశుధ్య మసస్య.. గ్రామస్థాయిలో సర్పంచులు,అధికారులు సరిగా పనిచేయకనే పారిశుధ్యం లోపిస్తోందని డీపీవో సూరజ్‌కుమార్ అన్నారు. ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి మురికి కాలువలు, చెత్తచెదారం ఉన్నా ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లుతున్నట్లు తెలిపారు. నీటిని క్లోరినేషన్ చేస్తున్నట్లు చెప్పారు. పారిశుధ్యంపై ప్రజలుకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. అనంతరం గ్రామాల్లో పర్యటించి మురికి కాలువులు ఉండకుండా చూసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో సత్యనారాయణ, కార్యదర్శులు ప్రభాకర్‌గౌడ్, మంజూర్ పాల్గొన్నారు.