రోడ్డుపైన ప్రసవించిన మహిళ, బాధితురాలి బంధువు చేతుల్లో శిశువు
మహదేవపూర్ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఓ గిరిజన మహిళ పీహెచ్‌సీ ఎదుట రోడ్డుపైన ప్రసవించింది. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్‌పల్లి పీహెచ్‌సీ ఎదుట మంగళవారం జరిగింది. ప్రస్తుతం మహదేవపూర్ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రిలో తల్లీపాప చికిత్స పొందుతున్నారు. బాధితురాలు సమ్మక్క భర్త ఎర్రయ్య కథనం ప్రకారం... జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కిష్టరావుపేట గ్రామానికి చెందిన గిరిజన మహిళ సమ్మక్క ఏడు నెలల గర్భిణి.
రోజు మాదిరిగానే కూలీ పనికి వెళ్లింది. పని చేసే చోటనే సమ్మక్కకు పురిటి నొప్పులు వచ్చాయి. దాంతో తోటి కూలీలు, భర్త సమ్మక్కను సమీపంలోని అంబట్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. పీహెచ్‌సీలో ఉండాల్సిన ఇద్దరు డాక్టర్లు లేరు. దీంతో సిబ్బంది కూడా విధులకు ఎగనామం పెట్టారు. స్టాఫ్ నర్స్‌స్రవంతి సెలవులో ఉన్నారు.
దీంతో పురిటి నొప్పులతో వచ్చిన సమ్మక్కకు వైద్య సేవలు అందలేదు. దీంతో అక్కడి నుంచి మహదేవపూర్ ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు సమ్మక్కను పీహెచ్‌సీ ముందుకు తీసుకురాగా రోడ్డుపైనే ప్రసవించింది. చికిత్స కోసం మహదేవపూర్ ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా విధులకు డుమ్మా కొట్టిన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment