విషజ్వరాలపై కదలిన యంత్రాంగం
-
కలెక్టర్ ఆదేశాలతో అధికారుల చర్యలు
-
బెగులూర్‌లో పర్యటించిన జిల్లా వైద్యాధికారి, డీపీవోలు
-
గ్రామంలో ఇద్దరికి డెంగీ లక్షణాలు
కాళేశ్వరం : మహదేవపూర్ మండలంలో ప్రబలుతున్న విషజ్వరాలపై విష‘జ్వరాలు పంజా’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనానికి కలెక్టర్ నీతూప్రసాద్ స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు బెగులూర్ గ్రామాన్ని, మహదేవపూర్ ఆసుపత్రిని సందర్శించారు. డీసీహెచ్‌వో అశోక్‌కుమార్, జిల్లా వైద్యాధికారి రాజేశం, డీపీవో సూరజ్‌కుమార్, పెద్దపల్లి డీఎల్పీవో శ్రీనివాస్‌రెడ్డి బెగులూర్ గ్రామంలో వేర్వేరుగా పర్యటించారు. విషజ్వరాలతో బాధపడుతున్నవారితో మాట్లాడారు.
పారిశుధ్యలోపంతో జ్వరాలు..
పారిశుధ్యలోపంతోనే గ్రామాల్లో విషజ్వరాలు ప్రబలుతున్నట్లు డీసీహెచ్‌వో అశోక్‌కుమార్, డీఎంఅండ్‌హెచ్‌వో రాజేశం తెలిపారు. తాగునీరు కూడా కలుషితమవుతోందని, సరిగా క్లోరినేషన్ చేయడంలేదని పేర్కొన్నారు. జ్వరపీడితుల రక్త నమూనాలు తీసుకున్నట్లు చెప్పారు. ఆదివారం 47 మంది, సోమవారం ముగ్గురి బ్లడ్ షాంపిల్స్ స్వీకరించి ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. పంకెన గ్రామానికి వెళ్లాలంటే పెద్దంపేట వాగు అడ్డుగా ఉందన్నారు. మంగళవారం ఆగ్రామానికి సిబ్బంది వెళ్తారని చెప్పారు. బెగులూర్‌కు చెందిన సుబ్బారాజు,విజయలక్ష్మి దంపతులకు డెంగీ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. వెంటనే వారిని వరంగల్ ఎంజీఎంకు తరలించినట్లు పేర్కొన్నారు. ఆసుపత్రిలో ఐదుగురు వైద్యులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మహిళా వైద్యురాలిని డెప్యుటేన్‌పై తీసుకువచ్చినట్లు చెప్పారు. మహదేవపూర్ ఆసుపత్రిలో అన్ని రకాల పరికరాలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.
పంచాయతీల నిర్లక్ష్యంతో పారిశుధ్య మసస్య..
గ్రామస్థాయిలో సర్పంచులు,అధికారులు సరిగా పనిచేయకనే పారిశుధ్యం లోపిస్తోందని డీపీవో సూరజ్‌కుమార్ అన్నారు. ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి మురికి కాలువలు, చెత్తచెదారం ఉన్నా ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లుతున్నట్లు తెలిపారు. నీటిని క్లోరినేషన్ చేస్తున్నట్లు చెప్పారు. పారిశుధ్యంపై ప్రజలుకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. అనంతరం గ్రామాల్లో పర్యటించి మురికి కాలువులు ఉండకుండా చూసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో సత్యనారాయణ, కార్యదర్శులు ప్రభాకర్‌గౌడ్, మంజూర్ పాల్గొన్నారు.