సాక్షి, జయశంకర్‌భూపాలపల్లి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించారు. అయితే ప్రాజెక్టు వద్ద భారీగా మోహరించిన పోలీసులు ముందుగా ఆయన్ని అంగీకరించలేదు. చివరకు కాంగ్రెస్ శ్రేణుల రిక్వెస్ట్‌తో ఏరియల్ సర్వేకు పోలీసులు అనుమతి ఇచ్చారు. దీంతో ఆయన హెలికాఫ్టర్‌లోనే మేడిగడ్డను పరిశీలించారు.
మేడిగడ్డ సందర్శనకు ముందు రాహుల్ గాంధీ అంబట్ పల్లి కాంగ్రెస్ మహిళా సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరిట కరెప్షన్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం కట్టామని గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, డొల్లతనం మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటుతో బట్టబయలైంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయించిన డబ్బులు ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసమే పూర్తిగా ఖర్చు పెట్టి ఉంటే.. ఇలాంటి కుంగుబాటు వచ్చి ఉండేది కాదు.
..ప్రాజెక్టు కు కేటాయించిన లక్ష కోట్లల్లో సగం డబ్బులను దోపిడీ చేసి నాసిరకంగా నిర్మాణం చేయడం వల్లే బ్యారేజ్ పిల్లర్లు కుంగాయి. ఆధునిక టెక్నాలజీ లేని రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసిన శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల నెట్టెంపాడు బీమా తదితర ప్రాజెక్టు నేటికీ పటిష్టంగా ఉన్నాయి. కాళేశ్వరం నిర్మాణం చేసి పట్టుమని రోజులు తిరగకముందే ఇలా బ్యారేజ్ కుంగివడం బాధాకరం.
..చిన్నపాటి వర్షాలకే మేడిగడ్డ బ్యారేజీ కుంగితే భారీ వరదలు వస్తే తట్టుకొని నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఏటీఎం గా మారిందని చెప్తున్న ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా లు ఎందుకని చర్యలు తీసుకోకపోవడం లేదు. చిన్నపాటి ఇంటికే ఇంజనీర్తో డిజైన్ చేయిస్తాం. లక్ష కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ ఎలా డిజైన్ చేస్తారు. ఇంజనీర్ల పనిని ఇంజనీర్లను చేయిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. సీఎం కేసీఆర్ డిజైన్ చేస్తే భవిష్యత్తులో ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంటుందని కాంగ్రెస్ పార్టీగా ముందే చెప్పాము. ఇప్పుడు అదే జరిగింది అని రాహుల్ గాంధీ విమర్శలు, ఆరోపణలు గుప్పించారు.
అంబట్‌పల్లి, మేడిగడ్డ పర్యటనలో రాహుల్ గాంధీతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యరావ్ ఠాక్రే, కాంగ్రెస్ మేనిఫెస్టో చైర్మన్ దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు ఉన్నారు.
ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత
రాహుల్ గాంధీ సందర్శన నేపథ్యంలో మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. 144 సెక్షన్ అమలు ఉందని, సందర్శనకు అమలు లేదని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణ ఏర్పడింది. చివరకు రాహుల్‌కు ఏరియల్ సర్వే అనుమతి లభించడంతో కాంగ్రెస్ శ్రేణులు శాంతించాయి.
Comments
Please login to add a commentAdd a comment