manthani division
-
విషజ్వరాలపై కదలిన యంత్రాంగం
కలెక్టర్ ఆదేశాలతో అధికారుల చర్యలు బెగులూర్‌లో పర్యటించిన జిల్లా వైద్యాధికారి, డీపీవోలు గ్రామంలో ఇద్దరికి డెంగీ లక్షణాలు కాళేశ్వరం : మహదేవపూర్ మండలంలో ప్రబలుతున్న విషజ్వరాలపై విష‘జ్వరాలు పంజా’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనానికి కలెక్టర్ నీతూప్రసాద్ స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు బెగులూర్ గ్రామాన్ని, మహదేవపూర్ ఆసుపత్రిని సందర్శించారు. డీసీహెచ్‌వో అశోక్‌కుమార్, జిల్లా వైద్యాధికారి రాజేశం, డీపీవో సూరజ్‌కుమార్, పెద్దపల్లి డీఎల్పీవో శ్రీనివాస్‌రెడ్డి బెగులూర్ గ్రామంలో వేర్వేరుగా పర్యటించారు. విషజ్వరాలతో బాధపడుతున్నవారితో మాట్లాడారు. పారిశుధ్యలోపంతో జ్వరాలు.. పారిశుధ్యలోపంతోనే గ్రామాల్లో విషజ్వరాలు ప్రబలుతున్నట్లు డీసీహెచ్‌వో అశోక్‌కుమార్, డీఎంఅండ్‌హెచ్‌వో రాజేశం తెలిపారు. తాగునీరు కూడా కలుషితమవుతోందని, సరిగా క్లోరినేషన్ చేయడంలేదని పేర్కొన్నారు. జ్వరపీడితుల రక్త నమూనాలు తీసుకున్నట్లు చెప్పారు. ఆదివారం 47 మంది, సోమవారం ముగ్గురి బ్లడ్ షాంపిల్స్ స్వీకరించి ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. పంకెన గ్రామానికి వెళ్లాలంటే పెద్దంపేట వాగు అడ్డుగా ఉందన్నారు. మంగళవారం ఆగ్రామానికి సిబ్బంది వెళ్తారని చెప్పారు. బెగులూర్‌కు చెందిన సుబ్బారాజు,విజయలక్ష్మి దంపతులకు డెంగీ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. వెంటనే వారిని వరంగల్ ఎంజీఎంకు తరలించినట్లు పేర్కొన్నారు. ఆసుపత్రిలో ఐదుగురు వైద్యులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మహిళా వైద్యురాలిని డెప్యుటేన్పై తీసుకువచ్చినట్లు చెప్పారు. మహదేవపూర్ ఆసుపత్రిలో అన్ని రకాల పరికరాలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. పంచాయతీల నిర్లక్ష్యంతో పారిశుధ్య మసస్య.. గ్రామస్థాయిలో సర్పంచులు,అధికారులు సరిగా పనిచేయకనే పారిశుధ్యం లోపిస్తోందని డీపీవో సూరజ్‌కుమార్ అన్నారు. ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి మురికి కాలువలు, చెత్తచెదారం ఉన్నా ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లుతున్నట్లు తెలిపారు. నీటిని క్లోరినేషన్ చేస్తున్నట్లు చెప్పారు. పారిశుధ్యంపై ప్రజలుకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. అనంతరం గ్రామాల్లో పర్యటించి మురికి కాలువులు ఉండకుండా చూసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో సత్యనారాయణ, కార్యదర్శులు ప్రభాకర్‌గౌడ్, మంజూర్ పాల్గొన్నారు. -
మంథని డివిజన్లో భారీ వర్షం : ఒకరి మృతి
మంథని (కరీంనగర్) : కరీంనగర్ జిల్లా మంథని డివిజన్ వ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. డివిజన్లోని కాటారం, మంథని, మహదేవపూర్, మహాముత్తారం మండలాల్లో భారీ వర్షాల ఫలితంగా పెద్దంపేట, పంకెన, పలిమెల వాగులు పొంగి పొర్లటంతో దాదాపు 18 గ్రామాలకు రాకపోకలతో సంబంధాలు తెగిపోయాయి. వర్షం ధాటికి మంథని మండలం ఉప్పట్ల గ్రామంలోని ఓ పెంకుటిల్లు కూలి రాజపోచం(80) అనే వృద్ధురాలు మృతి చెందింది. -
ముక్తీశ్వరా...
కాళేశ్వర ముక్తీశ్వర ఎత్తిపోతల పథకం ఐదేళ్ల నుంచి అడుగులో అడుగు వేస్తోంది. పనులు మొదలెట్టి ఐదేళ్లయినా ఇప్పటికీ భూసేకరణే పూర్తి కాలేదు. 2012లోనే పూర్తి కావాల్సిన పనుల గడువును ఇప్పటికే రెండు సార్లు పెంచగా మరో వారంలో తుదిగడువు కూడా పూర్తి కానుంది. అయినా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. - మంథని మంథని : మంథని డివిజన్లోని మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్, కాటారం మండలాల్లోని 65 గ్రామాలకు మేలు చేకూర్చేలా 45 వేల ఎకరాల బీడు భూములను సాగులోకి తెచ్చేలా కాళేశ్వర, ముక్తీశ్వర ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. 2008 సెప్టెంబర్‌లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మహదేవపూర్ మండలం బీరసాగర్‌లో శంకుస్థాపన చేయగా 2009లో పనులు ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టు పూర్తయ్యేందుకు రూ.499 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. నీటి తరలింపు ఇలా... గోదావరి ఒడ్డు నుంచి మహదేవపూర్ మండ లం కన్నెపల్లిలోని ఇంటేక్‌వెల్‌కు నీటిని తరలిస్తారు. అక్కడినుంచి పైప్‌లైన్ ద్వారా మహదేవపూర్ మండల చెరువు, ఊర చెరువుల్లో నీరు నింపుతారు. ఇది మొదటి దశ(స్టేజ్-1) పను లు. ఇక్కడ నుంచి రోడ్డు మార్గంలో కాటారం మండలం గారెపల్లి కొత్తచెరువులోకి తరలిస్తారు. దీన్ని రిజర్వాయర్‌గా(స్టేజ్-2) మా ర్చుతారు. ఇక్కడినుంచి రెండువైపులా పైప్‌లైన్ ఉంటుంది. కాటారం, ఆదివారంపేట, కొత్తపల్లి, సుందర్రాజ్పల్లి నుంచి మల్హర్ మండలం రుద్రారం వరకు పైప్‌లైన్ ద్వారా నీరు తరలిస్తారు. ఇది ఒకవైపు కాగా, రెండోవైపు గారెపల్లి నుంచి పోలారం, మహాముత్తారం వరకు నీటిని తరలిస్తారు. ఈ చెరువుల ద్వారా రైతుల భూములకు సాగునీరందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఏదీ పురోగతి ప్రాజెక్టు నిర్మాణానికి 3625 ఎకరాల భూమి అవసరం కాగా, ఇందులో 2981 ఎకరాలు రెవెన్యూ భూమి. మిగతా 644 ఎకరాలు భూమి అటవీభూమి. ఇప్పటివరకు 900 ఎకరాల రెవెన్యూ భూమి మాత్రమే సేకరించారు. కానీ, నిర్వాసితులకు రూపాయి కూడా చెల్లించలేదు. భూసేకరణ, అటవీశాఖ అడ్డంకులు, వర్షాకాల సీజన్ సాకులు చూపుతూ కాంట్రాక్టర్ పనులు జాప్యం చేయగా అధికారులు కూడా పట్టించుకోలేదు. దీంతో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోయాయి. 2012 సెప్టెంబర్ వరకు పనులు పూర్తి కావాల్సి ఉండగా 2013కు ఓసారి గడువు పొడిగించారు. కాంట్రాక్టర్ విజ్ఞప్తి మేరకు గడువు 2014 డిసెంబర్ వరకు పొడిగిస్తూ మరోసారి నిర్ణయం తీసుకున్నారు. మరో వారం రోజుల్లో ఈ గడువు కూడా పూర్తి కానుండగా పనుల్లో మాత్రం పురోగతి లేదు. ఇప్పటివరకు పూర్తయిన పనులకు రూ.270 కోట్లు చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. 50 శాతానికిపైగా నిధులు కాంట్రాక్టర్‌కు చెల్లించినప్పటికీ పనులు మాత్రం అత్తెసరుగానే జరిగాయి. మిగతా పనులన్నీ పూర్తి కాకుండానే పంపింగ్ కోసం మోటార్లు తీసుకురావడంతో అవన్నీ వృథాగా ఉంటున్నాయి. చెల్లింపుల్లో అక్రమాలు జరిగినట్లు అధికారుల విచారణలో తేలడంతో పలువురు అధికారులపై గత ఫిబ్రవరిలో సస్పెన్షన్ వేటు వేశారు. ప్రస్తుతం ఇంటేక్వెల్ పనులు కొనసాగుతున్నాయి. పనుల్లో జాప్యంతో అంచనాలు రూ.637 కోట్లకు చేరినట్లు సమాచారం. 644 ఎకరాల అటవీ భూమిలో పైప్‌లైన్ నిర్మాణానికి కేంద్ర అటవీపర్యావరణ అనుమతి ఇటీవలే వచ్చినట్లు సమాచారం. మిగతా భూములు త్వరగా సేకరించి, పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఇంటేక్వెల్ నిర్మాణం త్వరగా పూర్తి చేసి పైప్‌లైన్ వేసి నీరందించాలని పేర్కొంటున్నారు. -
‘హెల్త్’ అలర్ట్!
- వణికిస్తోన్న విషజ్వరాలు పొంచి ఉన్న డయేరియా ముప్పు - పీహెచ్‌సీలకు మందుల సరఫరాపై కలెక్టర్ ఆరా - సిబ్బంది స్థానికంగా ఉండాల్సిందే లేకుంటే హెచ్ఆర్ఏ కోత -మంథని డివిజన్‌పై ప్రత్యేక దృష్టి : డీఎంహెచ్‌వో సాక్షి, కరీంనగర్ : జిల్లాలో విజృంభిస్తోన్న విష జ్వరాలతో యంత్రాంగం అప్రమత్తమైంది. సాధారణంగా... వ ర్షాలు కురిసిన కొన్ని రోజుల తర్వాత విషజ్వరాలు, సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. ఈ సారి వాతావరణంలో వచ్చిన కొద్దిపాటి మార్పులకే విషజ్వరాలు వణికిస్తున్నాయి. ఇప్పటికే వేలాది మంది జ్వరపీడితులు జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నెల వ్యవధిలోనే జిల్లాలో పదకొండు మంది విషజ్వరాలు.. రక్తంలో ప్లేట్లెట్లు తగ్గి చనిపోయారు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడ ఎక్కువ విషజ్వరాలు ప్రబలినా వైద్యశాఖ శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. స్వల్ప కేసులు నమోదైన ప్రాంతాల్లో వైద్యసిబ్బంది పర్యటించి సత్వరమే వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటోంది. గడిచిన నెల రోజుల్లో ఏడు గ్రామాల్లో శిబిరాలు నిర్వహించి.. వందలాది మంది జ్వరపీడితులకు వైద్యం అందించింది. జిల్లాలో తాజాగా కురిసిన వర్షాలతో డయేరియా, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలున్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలు.. ఒకవేళ ప్రబలితే అందించాల్సిన వైద్యంపై జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి కె.బాలు దృష్టి సారించారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతమైన మంథని డివిజన్ పరిధిలో వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశాలుండడంతో అక్కడి వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు జిల్లా వైద్యాధికారి కె.బాలు తెలిపారు. త్వరలోనే మెడికల్ ఆఫీసర్లు, ఎస్పీహెచ్వోలు, హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలతో సమావేశం నిర్వహించనున్నట్లు వివరించారు. గ్రామాల్లో ప్రైవేట్, ఏరియా ఆస్పత్రులు అందుబాటులో లేకపోవడం... జ్వరపీడితులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలనే ఆశ్రయిస్తుండడంతో జిల్లాలోని పీహెచ్సీలలో అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య వైద్యశాఖను ఆదేశించారు. ఈ క్రమంలో.. రెండు నెలల వ్యవధిలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్లు, ఆంటిబయోటిక్స్ మందులు, పారాసిటమాల్ పంపిణీ చేసిన మందుల వివరాలు పీహెచ్‌సీల వారీగా అందజేయాలని ఆదేశించారు. సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్‌లో ఏ మేరకు మందులు ఉన్నాయో కూడా వివరాలివ్వాలన్నారు. దీంతో అధికారులు ఇప్పటికే పీహెచ్‌సీల వారీగా పంపిణీ చేసిన మందుల వివరాల నివేదిక తయారీలో నిమగ్నమయ్యారు. స్థానికంగా ఉండని సిబ్బందిపై ఆరా! వైద్యవిధాన పరిషత్, వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతోన్న ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రా ల్లో విధులు నిర్వర్తించే వైద్య సిబ్బంది స్థానికంగా ఉండాలనే నిబంధన ఉంది. అయినా చాలా మంది స్థానికంగా ఉండడం లేదు. ఈ విషయంపై దృష్టిసారించిన వైద్యశాఖ అందుబాటులో ఉండని సిబ్బంది వివరాలు సేకరిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే సిబ్బంది అనుమతి లేనిదే.. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వదిలిపెట్టి వెళ్లొద్దని డీఎంహెచ్‌వో కొమురం బాలు ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా అందుబాటులో ఉండకుండా.. వైద్యం అందించే విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా వారి హెచ్ఆర్ఏ కోత విధించడంతోపాటు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఓటుకు వేళాయె..
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలి విడత ఎన్నికలు ఆదివారం జగిత్యాల, పెద్దపల్లి, మంథని డివిజన్లలో జరగనున్నాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తుండగా, మంథని డివిజన్లో మాత్రం గంట ముందే ముగించనున్నారు. 30 జెడ్పీటీసీ స్థానాలకు 183 మంది, 403 ఎంపీటీసీ స్థానాలకు 1,790 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 409 ఎంపీటీసీ స్థానాలకు ఆరు స్థానాలు ఏకగ్రీవం కావడంతో, 403 స్థానాల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఏకగ్రీవమైన స్థానాల్లో జెడ్పీటీసీ బ్యాలెట్ పత్రం మాత్రమే ఉంటుంది. తొలివిడతలో 1,294 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 502 సమస్యాత్మక, 170 అతి సమస్యాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. 10,16,165 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. తొలి విడత పోలింగ్‌కు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం రాత్రికే పోలింగ్ సిబ్బంది ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. ఎన్నికలు జరిగే మండలాలివే.. మంథని డివిజన్లోని ఏడు మండలాలు... మంథని, ముత్తారం, మల్హర్, మహాదేవపూర్, మహాముత్తారం, కాటారం, కమాన్‌పూర్, పెద్దపల్లి డివిజన్ పరిధిలో తొమ్మిది మండలాలు....పెద్దపల్లి, ధర్మారం, వెల్గటూరు, రామగుండం, జూలపల్లి, ఓదెల, ఎలిగేడు, కాల్వశ్రీరాంపూర్, సుల్తానాబాద్ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. జగిత్యాల డివిజన్లోని 14 మండలాల్లో... జగిత్యాల, కోరుట్ల, గొల్లపల్లి, ధర్మపురి, పెగడపల్లి, మేడిపల్లి, మల్యాల, రాయికల్, సారంగాపూర్, మల్లాపూర్, మెట్పల్లి, కథలాపూర్, ఇబ్రహీంపట్నం, కొడిమ్యాల మండలాల్లో ఆదివారం పోలింగ్ జరగనుంది. మంథని డివిజన్లో 4 గంటలకే ముగింపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ మంథని డివిజన్లో సాయంత్రం నాలుగు గంటలకే ముగియనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో, మంథని డివిజన్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ను సాయంత్రం 4 గంటలకే ముగించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఈ కుదింపును ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్‌కు కూడా వర్తింపచేశారు. సాయంత్రం 5 తరువాత బ్యాలెట్ బాక్స్‌లు తీసుకురావడం ఇబ్బందికరంగా మారుతుందనే ఆందోళనతోనే గంట సమయాన్ని కుదించారని అధికారులు వెల్లడించారు. జగిత్యాల, పెద్దపల్లి డివిజన్లలో పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు ఉండగా, మంథని డివిజన్లో మాత్రం ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకే జరుగనుంది. పోల్ చిట్టీల పంపిణీ విఫలం ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో పోల్ చిట్టీల పంపిణీలో దారుణంగా విఫలమైన అధికారులు, ప్రాదేశిక పోరులోనే అదే తీరును కొనసాగించారు. నాలుగు రోజులు ముందు నుంచి పోల్ చిట్టీలు పంచాలని, పోల్ చిట్టీలు అందలేదనే ఫిర్యాదు రావద్దని కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య సమావేశం పెట్టి హెచ్చరించినా, ఆచరణకు నోచుకోలేదు. పైగా కొన్ని గ్రామాల్లో శనివారం సాయంత్రం గానీ కొత్త ఓటర్ల జాబితా చేరలేదు. ఇటీవల జిల్లావ్యాప్తంగా చాలాచోట్ల ఓట్లు తొలగించడం, అర్హులు మరోసారి దరఖాస్తు చేసుకోవడంతో అసలు తమ ఓటు ఉందా లేదా తెలియని గందరగోళ పరిస్థితి పల్లెల్లో నెలకొంది. కనీసం ఓటర్ల జాబితాలో చూద్దామన్నా అందుబాటులో లేదు. మీసేవలో ఆన్లైన్లో చూద్దామంటే కరెంట్ లేదు. దీంతో పోల్ చిట్టీల మాట దేవుడెరుగు, కనీసం ఓటర్ల జాబితాను కూడా పంపించలేని అధికారుల తీరుపై ఓటర్లు మండిపడుతున్నారు. ఫిర్యాదులుంటే చెప్పండి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ఏవైనా అభ్యంతరాలు, ఫిర్యాదులుంటే నేరుగా తనకు 8179024803 నెంబర్‌కు ఫోన్ చేయాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు సి.పార్థసారథి తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియామవళి ఉల్లంఘించినా, ఇతర అభ్యంతరకర అంశాలుంటే తమకు తెలియచేయాలని, వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామన్నారు. -
మంథని డివిజన్లో పొంగిపోర్లుతున్న వాగులు
కరీంనగర్ జిల్లా మంధని డివిజన్లో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెద్దంపేట, సర్వాయిపేట, పంచెన వాగులు శుక్రవారం పొంగిపొర్లుతున్నాయి. దీంతో మహదేవపూర్ మండలంలోని 17 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మహాముత్తారంలోని దౌత్పల్లి వాగులో ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. దాంతో ఆ మండలంలోని 5 గ్రామాలలో రాకపోకలు బంద్ అయినాయి. అయితే అధికారులు గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే ఖమ్మం జిల్లాలోని చోక్కాలలో కురిసిన భారీ వర్షానికి మూడు ఇళ్లు నేలమట్టం అయినాయి. ఆ ప్రమాదంలో ముత్తమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది.