ఫ్లై ఓవర్లకు మరమ్మతులు
సాక్షి, ముంబై: దక్షిణ ముంబైలోని మూడు ప్రధాన ఫ్లైఓవర్లకు మరమ్మతులు చేపట్టాలని మహానగర పాలక సంస్థ (బీఎంసీ) నిర్ణయించింది. ట్రాఫిక్ శాఖ నుంచి అనుమతి లభించగానే పనులు ప్రారంభించనున్నట్లు బీఎంసీ అధికారులు పేర్కొన్నారు. మొన్న వర్షా కాలం, అది పూర్తికాగానే ఎన్నికలు, ఆ తర్వాత ఫలితాలు, అవి పూర్తికాగానే దీపావళి ఇలా ఒకదాని త ర్వాత మరొకటి అడ్డంకులు ఎదురుకావడంతో మరమ్మతులు చేపట్టేందుకు అవకాశం దొరకలేదు.
ఇప్పుడు ఆ అడ్డంకులన్నీ తొలగిపోవడంతో కెంప్స్ కార్నర్, ప్రిన్సెస్ స్ట్రీట్, మహాలక్ష్మి వంతెనలకు మరమ్మతులు ఈ నెలాఖరులోగా ప్రారంభించాలని సంకల్పించారు. ఈ ఏడాది మే రెండో తేదీ నుంచి వారం రోజుల పాటు బైకలా ప్రాంతంలో ఉన్న గ్లోరియా చర్చ్ ఫ్లై ఓవర్‌ను మరమ్మతుల కోసం మూసివేయాల్సి వచ్చింది.
కాని ట్రాఫిక్ శాఖ ముందస్తు సూచనలు జారీ చేయకపోవడం, వాహనాలను దారి మళ్లించేందుకు ప్రత్యామ్నాయ రోడ్డు లేకపోవడంతో ట్రాఫిక్ జాం సమస్య ఎదురైంది. ఈసారి అలాంటి పరిస్థితి తలెత్తకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో మహాలక్ష్మి, కెంప్స్ కార్నర్ ఫ్లై ఓవర్లు వెడల్పుగా ఉన్నాయి. దీంతో వీటిని పూర్తిగా మూసి వేయకుండా కొంత భాగాన్ని వాహనాల రాకపోకలకు వినియోగించవచ్చని చీఫ్ ఇంజినీర్ ఎస్.ఓ.కోరి అభిప్రాయపడ్డారు.
ఇలా చేయడంవల్ల ట్రాఫిక్ జాం ను కొంతవరకు నివారించవచ్చని ఆయన అన్నారు. కాగా మరమ్మతులకు అనుమతివ్వాలని ట్రాఫిక్ శాఖకు దరఖాస్తు చేశామని, అనుమతి లభించగానే పనులు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మూడు ఫ్లైఓర్ల పనులు ఒకేసారి చేపట్టకూడదని బీఎంసీ అధికారులు నిర్ణయించారు.
‘ఈ ఫ్లైఓవర్ల మరమ్మతులకు కచ్చితంగా ఎన్ని రోజుల సమయం పడుతుందో మాకు తెలియడం లేదు. వంతెనపై జాయింట్ల వద్ద మరమ్మతులు చేపట్టాలంటే చాలా ప్రమాదంతో కూడుకున్న వ్యవహారం... అక్కడ మరమ్మతులు చేపట్టడానికి ఎన్ని రోజులు పడుతుందో అధ్యయనం చేయాల్సి ఉంది.. ఆ తర్వాతే పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమం కానుంది.. అంతకు ముందు ట్రాఫిక్ శాఖ నుంచి అనుమతి లభించాల్సి ఉంద’ని కోరి తెలిపారు.