వారసుడెక్కడ ?
రాజు వెడలె రవితేజములలరగ... అని మైసూరు మాజీ సంస్థానాధీశుల ఇంట పాడుకోవడానికి ఇంకా కొంత సమయం పట్టేట్లుంది. మైసూరు రాజుల చివరి వారసుడు శ్రీకంఠదత్త నరసింహ రాజ ఒడయార్ గత ఏడాది డిసెంబరు 10న పరమపదించగా, ఆయన వారసుని ఎంపికలో రాణి ప్రమోదా దేవి ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఈ దంపతులకు సంతానం లేని సంగతి తెలిసిందే. కనుక వారసుని అన్వేషణ అనివార్యమైంది.
దగ్గర పడుతున్న దసరా
మైసూరు రాజ వంశీకులకు సుమారు ఆరు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. 1399లో యదురాయ పట్టాభిషేకంతో మైసూరు రాజుల శకం ప్రారంభమైంది. సుమారు 400 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలతో మైసూరు పేరు ప్రఖ్యాతులు అన్ని ఖండాలకు వ్యాపించింది. దసరా సందర్భంగా మైసూరు రాజులు అంబా విలాస్ రాజ ప్రాసాదంలో నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ప్రైవేట్ దర్బారు, ఆయుధ పూజ, విజయ దశమి ఊరేగింపులలో అప్పటి మైసూరు రాచరికం కళ్లకు సాక్షాత్కరిస్తుంది. శ్రీకంఠదత్త నరసింహ రాజ ఒడయార్ మరణానంతరం, ఆయన వారసునిపై ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది. సెప్టెంబరు 25న నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
ఈ ఏడాది ఉత్సవాలపై అనుమానాలు
మరో మూడు నెలల్లో వారసుని ప్రకటించాల్సి ఉంది. అయితే రాజప్రాసాదం వర్గాల ప్రకారం ఈ సారి నవరాత్రి ఉత్సవాలు ప్యాలెస్‌లో జరిగే అవకాశాల్లేవు. శ్రీకంఠదత్త సంవత్సరీకం (డిసెంబరు 10) పూర్తయ్యే వరకు రాజ ప్రాసాదంలో పూజలు, పునస్కారాలు ఉండవు. అయితే వారసుని ఎంపికలో జరుగుతున్న జాప్యం పట్ల పర్యాటక రంగంలోని పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. దసరా సందర్భంగా అలనాటి రాజ వైభవాన్ని తిలకించడానికి వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గిపోవచ్చని వారు భయపడుతున్నారు. తద్వారా కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. కనుక రాణి ప్రమోదా దేవి ఈ విషయంలో సత్వరమే నిర్ణయం తీసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు.
రాణి ప్రమోదా దేవికి పెను సవాలు
మైసూరు రాజ వంశీకుల వారసునికి ప్రత్యేక లక్షణాలుండాలి. వారసునికి ఎలాంటి అర్హతలుండాలో శతాబ్దాల కిందటే నిర్ధారించారు. అలాంటి అర్హత కలిగిన వ్యక్తులు అందుబాటులో లేనందు వల్లే వారసుని ఎంపికలో అసాధారణ జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. వారసునికి రాజ వంశీకులతో రక్త సంబంధం ఉండాలి. అతనికి మైసూరు రాచరిక సంప్రదాయాలు తెలిసి ఉండాలి. ఉత్తమ విద్యార్హతలు కలిగి ఉండాలి. స్వచ్ఛమైన జీవన శైలితో పాటు అవివాహితుడుగా ఉండాలి. శ్రీకంఠదత్త నరసింహ రాజ ఒడయార్‌కు అయిదుగురు అక్క చెల్లెళ్లు ఉన్నారు. వారికంతా మగ సంతానమే. వారిలో ఒకరిని వారసునిగా ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఇక్కడే క్లిష్ట సమస్య ఎదురవుతోంది.
ఆ అయిదుగురిలోని ఉపనన్యు, రుద్ర ప్రతాప్ సింగ్‌లు కేవలం పదో తరగతి వరకే చదివారు. వర్చస్ అరస్, ఆదిత్య గురుదేవ్లు డిగ్రీ పూర్తి చేశారు. వర్చస్ అరస్‌కు రాజ ప్రాసాదం సంప్రదాయాలు, శ్లోకాలు తెలిసినప్పటికీ, కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా మరో సామాజిక వర్గానికి చెందిన, విడాకులు పొందిన మహిళను పెళ్లాడారు. ఆదిత్య ఆస్ట్రేలియాలో ఎంబీఏ పూర్తి చేసి, బెంగళూరులో వ్యాపారం చేసుకుంటున్నారు. ఇక మిగిలింది కాంతరాజ్ అరస్. ఇతనిని ఎంపిక చేయడానికి ప్రమోదా దేవి సముఖంగా ఉన్నప్పటికీ, ఒడయార్ బతికి ఉన్నప్పుడే అతనిని వ్యతిరేకించారు. పైగా అతను పీయూసీ వరకే చదువుకున్నాడు. ఒడయార్‌కు శ్రాద్ధ కర్మలు ఇతనే నిర్వర్తించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో వారసుని ఎంపిక రాణి ప్రమోదా దేవికి క్లిష్టతరంగా తయారైంది.