'అణగారిన వర్గాల కోసం పాటుపడిన వ్యక్తి పూలే'
సాక్షి, విజయవాడ : మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి పురస్కరించుకొని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే విగ్రహానికి వైఎస్ జగన్ పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు.ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అణగారిన వర్గాలకు సమాన హక్కు ఉండాలంటూ జ్యోతిరావు పూలే చేసిన పోరాటం గుర్తుచేశారు. బలహీన వర్గాల్లో మహిళలు చదువుకోవాలని ఆరాటపడిన వ్యక్తి పూలే అని కొనియాడారు. దళిత వర్గం నుంచి వచ్చిన అంబేడ్కర్, పూలేలు అమలు పరిచిన విధానాలను ఇప్పటికి ఆచరిస్తున్నామని పేర్కొన్నారు.
దేశంలోని పౌరుల్లో ఎక్కువ, తక్కువ అనే బేధాభిప్రాయాలు రాకుండా ఉండేందుకు పూలే పాటు పడ్డారని తెలిపారు. బలహీన వర్గాల కుటుంబాల నుంచి ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు రావాలని ఆలోచన చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి అని పేర్కొన్నారు. పేద విద్యార్థుల చదువుకు ఎంత ఖర్చైనా భరిస్తామని మహానేత వైఎస్సార్ భరోసా ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. బీసీల అభ్యున్నతి కోసం బీసీ డిక్లరేషన్ చేశామని, అందుకోసం బడ్జెట్లో వారి సంక్షేమం కొరకు రూ. 15వేల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.
మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేస్తున్నాం. మా ప్రభుత్వంలో బలహీనవర్గాలకు చెందిన 60శాతం మందికి మంత్రివర్గంలో చోటు కల్పించామన్నారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురు బలహీన వర్గాలకు చెందిన వారేనని తెలిపారు. జిల్లాలోని 19 మార్కెట్ యార్డుల్లో చైర్మన్ పదవులకు సంబంధించి 10 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవకాశం ఇచ్చామని వెల్లడించారు.
కార్యక్రమంలో వైఎస్ జగన్ ప్రస్తావించిన కొన్ని ముఖ్య విషయాలు :
బలహీన వర్గాల అభ్యున్నతికి అన్ని రకాలుగా ముందడుగు వేస్తున్నామన్నారు. వీటికి సంబంధించి చట్టాలను ఏర్పాటు చేసి బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడుతున్నట్లు తెలిపారు.
ఐదు నెలల్లోనే నాలుగున్నర లక్షల ఉద్యోగాలు కల్పించామని, 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే లభించేలా చట్టం చేసినట్లు గుర్తు చేశారు.
వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద రాష్ట్రంలోని 46 లక్షల రైతులకు పెట్టుబడి సాయం అందించామని తెలిపారు. దీంతో పాటు కౌలు రైతులకు కూడా ఈ సాయం అందేలా ప్రణాళిక చేశామని పేర్కొన్నారు.
నాడు-నేడు ద్వారా పాఠశాలలను ఆధునీకరిస్తున్నాం. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టబోతున్నట్లు స్ఫష్టం చేశారు.
అమ్మ ఒడి కింద జనవరి 9నుంచి ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 15 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే ఉన్నత చదువుల కోసం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని ప్రకటించారు. వసతి దీవెన ద్వారా ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 20 వేలు అందజేస్తున్నట్లు వెల్లడించారు.
ఉగాది రోజున 24 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని, పల్లెలో, పట్టణాల్లో సెంట్ భూమి ఇవ్వనున్నట్లు తెలిపారు.
బడుగుబలహీన వర్గాలు, అణగారిన ప్రజల హక్కుల సాధన కోసం జ్యోతిరావు పూలే చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. మహిళల విద్యావికాసానికి, సామాజిక అసమానతలను రూపుమాపేందుకు ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. సమసమాజ స్థాపనకు బాటలు వేసిన పూలే గారి ఆశయాలే స్ఫూర్తిగా ముందుకు సాగుదాం.#jyotibaphule
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 28, 2019