పూలే ఓవర్సీస్ విద్యానిధికి 110 మంది ఎంపిక
అర్హుల వివరాలు వెల్లడించిన జోగురామన్న
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిభా పూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి 110 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ పథకం కింద గత నెలలో దరఖాస్తులు స్వీకరించిన బీసీ సంక్షేమ శాఖ.. వాటి పరిశీలన అనంతరం అర్హులను ఎంపిక చేసింది. మంగళవారం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న, ఆ శాఖ కమిషనర్ జీడీ అరుణతో కలసి నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు వెల్లడించారు. మొత్తం 231 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 153 మంది ఇంటర్వూ్యకు హాజరయ్యారు.
వీరిలో 142 మంది తుది ఎంపిక కార్యక్రమంలో పాల్గొనగా 110 మంది మాత్రమే ఎంపికయ్యారు. జీఆర్ఈ, జీమ్యాట్ తదితర వాటిల్లో స్కోర్ తక్కువగా ఉండడంతోనే కొందరు విద్యార్థులు అర్హత సాధించలేకపోయారని తెలిపారు.