ధోని.. సనాఫ్ అనుపమ్ ఖేర్
ప్రస్తుతం బాలీవుడ్లో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. సినీనటుల జీవితగాథలతో పాటు, అంతర్జాతీయ స్థాయిలో భారత కీర్తి పతాకాన్ని ఎగరవేసిన క్రీడాకారుల జీవితాలను కూడా వెండితెర మీద ఆవిష్కరిస్తున్నారు మన దర్శక నిర్మాతలు. అదే బాటలో ఇండియన్ క్రికెట్‌ను విజయపథంలో నడిపించిన భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవితకథను సినిమాగా తెరకెక్కిస్తున్నారు.
వెడ్నెస్ డే, స్పెషల్ 26, బేబీ లాంటి సస్పెన్స్ థ్రిల్లర్లను తెరకెక్కించిన బాలీవుడ్ దర్శకుడు నీరజ్ పాండే తొలిసారిగా బయోపిక్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ధోని తండ్రి పాన్ సింగ్‌గా బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ నటిస్తున్నాడు. గతంలో నీరజ్ దర్శకత్వంలో తెరకెక్కిన అన్ని సినిమాల్లో ప్రధానపాత్రల్లో నటించిన అనుపమ్ ఈ సినిమాలో కూడా కీరోల్ ప్లే చేస్తున్నాడు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ధోనిగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. పగ్లీ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కైరా అద్వానీ ధోని భార్య సాక్షి సింగ్ ధోని పాత్రలో కనిపించనుంది. 'ఎమ్ఎస్ ధోని : ద అన్ టోల్డ్ స్టోరీ' పేరుతో ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.