Mahesh co-operative bank
-
నిర్లక్ష్యం చూపారు.. నిలువెల్లా దోచారు
సాక్షి, హైదరాబాద్: ఏపీ మహేష్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చెస్ట్ ఖాతా నుంచి డబ్బు కొట్టేయడానికి సైబర్ నేరగాళ్లు ర్యాట్, కీలాగర్స్ వంటి మాల్వేర్స్ వాడారని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. వీటి ద్వారానే హ్యాకర్లు బ్యాంక్ నెట్‌వర్క్‌లోకి ప్రవేశించి రూ.12.48 కోట్లు కొట్టేశారన్నారు. బుధవారం నైజీరియన్ ఇక్పా స్టీఫెన్ ఓర్జీని అరెస్టు చేశామని, దీంతో ఇప్పటివరకు అరెస్టు అయిన వారి సంఖ్య 23కు చేరిందని చెప్పారు. బ్యాంక్‌ను కొల్లగొట్టిన హ్యాకర్లు నైజీరియా లేదా లండన్‌లో ఉన్నట్లు సాంకేతిక ఆధారాలను బట్టి పోలీసులు అనుమానిస్తున్నారు. గత నవంబర్ నుంచి సన్నాహాలు ప్రారంభించిన వీళ్లు మూడు మెయిల్ ఐడీల నుంచి బ్యాంక్ అధికారిక ఈ–మెయిల్ ఐడీకి ఆ నెల 4,10,16 తేదీల్లో 200 ఫిషింగ్ మెయిల్స్ పంపారు. ఆర్టీజీఎస్ అప్‌గ్రేడ్ తదితరాలకు సంబంధించిన మెయిల్స్‌గా ఉద్యోగులు భ్రమించేలా వీటిని రూపొందించారు. నవంబర్ 6న ఇద్దరు బ్యాంక్ ఉద్యోగులు వీటిని క్లిక్ చేశారు. ఫలితంగా దీనికి అటాచ్ చేసిన ఉన్న రిమోట్ యాక్సెస్ ట్రోజన్ (ర్యాట్) ఆ రెండు కంప్యూటర్లలోకి చొరబడింది. దీని ద్వారా బ్యాంక్ నెట్‌వర్క్‌లోకి ప్రవేశించి వాటిలోకి కీలాగర్స్ మాల్వేర్ను ప్రవేశపెట్టారు. దీంతో ఈ రెండు కంప్యూటర్లను వాడిన ఉద్యోగులకు సంబంధించిన యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్స్‌తోపాటు అన్ని కార్యకలాపాలు హ్యాకర్‌కు చేరిపోయాయి. అత్యంత బలహీనంగా సైబర్ సెక్యూరిటీ రూ.వందలు, వేల కోట్ల ప్రజాధనంతో లావాదేవీలు జరిగే బ్యాంకులు తమ సైబర్ సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తాయి. దీని కోసం భారీగా ఖర్చు చేస్తుంటాయి. ఈ విషయంలో మహేష్ బ్యాంక్ కక్కుర్తి, నిర్లక్ష్యంతో వ్యవహరించి సరైన ఫైర్ వాల్స్‌ను ఏర్పాటు చేసుకోలేదు. దీనివల్లనే హ్యాకర్లు బ్యాంకు నెట్‌వర్క్‌ను తమ అ«ధీనంలో పెట్టుకుని ఎంపికచేసిన నాలుగు ఖాతాల నుంచి రూ.12.48 కోట్లను వివిధ ఖాతాల్లోకి మళ్లించారు. దీనికి సహకరించిన వారికి 5–10 శాతం కమీషన్లు ఇచ్చారు. విదేశాల్లో ఉన్నట్లు అనుమానిస్తున్న çప్రధాన హ్యాకర్లను కనిపెట్టడానికి ఇంటర్‌పోల్ సాయం తీసుకోవాలని నిర్ణయించినట్లు సీవీ ఆనంద్ తెలిపారు. నాణ్యతలేని సాఫ్ట్వేర్ అందించిన ఇంట్రాసాఫ్ట్ సంస్థతోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన బ్యాంక్ నిర్వాహకులను ఈ కేసులో సహ నిందితులుగా చేర్చామన్నారు. -
ముందు సర్వర్లోకి.. తర్వాత నెట్‌వర్క్‌లోకి..
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మహేష్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో జరిగిన రూ.12.93 కోట్ల సైబర్ నేరం కేసులో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కాస్త పురోగతి సాధించారు. హ్యాకింగ్ ఎలా జరిగిందో దర్యాప్తు అధికారులకు స్పష్టత వచ్చింది. గురువారం బంజారాహిల్స్‌లోని సర్వర్ సంస్థ కార్యాలయానికి వెళ్లిన అధికారులు.. మహేష్ బ్యాంకు అధికారులు, సర్వర్ నిర్వాహకులతో పాటు ముంబై నుంచి వచ్చిన ప్రత్యేక బృందంతో కలిసి విశ్లేషించారు. సైబర్ నేరగాళ్లు ప్రాక్సీ ఐపీ అడ్రస్‌లు వాడి తొలుత సర్వర్‌లోకే ప్రవేశించారని, ఆపై బ్యాంక్ నెట్‌వర్క్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్నారని గుర్తించారు. నగదు బదిలీ అయిన వాటిలో 3 కరెంట్ అకౌంట్లకు సంబంధించిన వారితో సైబర్ నేరగాళ్లకు సంబంధం ఉండకపో వచ్చని భావిస్తున్నారు. లావాదేవీల సమాచారం వీరికి చేరకుండా సైబర్ నేరగాళ్లు వారి ఖాతాలతో లింకై ఉన్న ఫోన్ నంబర్లను మార్చేశారు. బషీర్‌బాగ్ బ్రాంచ్‌లో షానాజ్ బేగం పేరుతో ఓ మహిళ తెరిచిన సేవింగ్ ఖాతాతో లింకైన నంబర్‌ను మాత్రం నేరగాళ్లు మార్చలేదు. దీంతో ప్రతి లావాదేవీకి సంబంధించిన ఓటీపీ, సమాచారం ఆమె నంబర్‌కు చేరాయి. బ్యాంకు అధికారుల నుంచి ఫోన్ అందుకున్నప్పటి నుంచి ఆమె ఫోన్ స్విచ్చాఫ్ కావడం, ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఆ మహిళ పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి. ఈ 4 ఖాతాల నుంచి డబ్బు ఉత్తరాదితో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని 129 ఖాతాల్లోకి వెళ్లింది. వాటి నుంచి మరికొన్ని ఖాతాల్లోకి వెళ్లినట్లు గుర్తించారు. ఈ ఖాతాదారులను పట్టుకుంటే సూత్రధారుల గురించి తెలుస్తుందని.. ప్రత్యేక బృందాలను ఆ రాష్ట్రాలకు పంపడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
మహేష్ బ్యాంక్ సర్వర్ హ్యాక్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే మహేష్ కో–ఆపరేటివ్ బ్యాంక్ సర్వర్‌పై సైబర్ నేరగాళ్లు దాడి చేశారు. బ్యాంకు అధికారుల ప్రమేయం లేకుండానే ఇటీవల తెరిచిన మూడు కరెంట్ ఖాతాల్లోకి బ్యాంకు చెస్ట్ ఖాతా నుంచి రూ.12.4 కోట్లు మళ్లించారు. ఈ విషయం గుర్తించిన బ్యాంకు అధికారులు సోమవారం సిటీ సైబర్ క్రై మ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శని, ఆదివారాల్లో పని కానిచ్చేశారు బషీర్‌బాగ్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న మహేష్ బ్యాంకుకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక శాఖలు ఉన్నాయి. వీటి ఖాతాల నిర్వహణకు సంబంధించిన ప్రధాన సర్వర్ బంజారాహిల్స్‌లోని ఓ ప్రై వేట్ కార్యాలయం కేంద్రంగా పని చేస్తుంటుంది. అయితే గుర్తు తెలియని సైబర్ నేరగాళ్లు దీన్ని హ్యాక్ చేశారు. దీని ద్వారా బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన సూపర్ అడ్మిన్‌యూజర్ ఐడీ, పాస్వర్డ్ సంగ్రహించారు. దీనికి ముందే కొందరు స్థానికుల సహకారంతో నగరంలోని సిద్ధిఅంబర్‌బజార్, అత్తాపూర్‌ల్లో ఉన్న మహేష్ బ్యాంకుల్లో ఇటీవల మూడు కరెంట్ ఖాతాలు తెరిచారు. శని, ఆదివారాల్లో బ్యాంకు పని చేయని నేపథ్యంలో అదును చూసుకున్న సైబర్ నేరగాళ్లు సూపర్ అడ్మిన్‌యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఆధారంగా లాగిన్అయి, బ్యాంకు చెస్ట్ ఖాతాలోని నగదు రూ.12.4 కోట్లను ఆ మూడు ఖాతాల్లోకి మళ్లించారు. ఆ మూడు ఖాతాల్లోకి వచ్చిన డబ్బును ఉత్తరాదితో పాటు త్రిపుర, అసోం, సిక్కింల్లోని వివిధ బ్యాంకుల్లో తెరిచిన 127 ఖాతాల్లోకి మళ్లించుకుని చాలా వరకు డ్రా చేసేశారు. ఇతర పనుల నిమిత్తం ఆదివారం సాయంత్రం బ్యాంక్‌కు వచ్చిన అధికారులు విషయం తెలుసుకుని సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ హ్యాకింగ్‌లో నైజీరియన్ల పాత్ర ఉన్నట్టు భావించి ఆరా తీస్తున్నారు. స్థానికంగా ఖాతాలు తెరిచిన వ్యక్తులను సైబర్ క్రై మ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారిస్తూ సూత్రధారులను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నగదు చేరిన ఖాతాల్లో కొన్నింటిని ఫ్రీజ్ చేయించారు. వాటిలో రూ.2 కోట్ల వరకు ఉన్నట్లు తెలిసింది. -
'బంగారు ఆభరణాలు మాత్రమే దోచుకెళ్లారు'
హైదరాబాద్ : ఏఎస్ రావు నగర్లో చోరీకి పాల్పడిన మహేష్ కో ఆపరేటివ్ బ్యాంకులో దుండగులు కేవలం బంగారు ఆభరణాలు మాత్రమే దోచుకు వెళ్లినట్లు అల్వాల్ డీజీపీ నవదీప్ సింగ్ తెలిపారు. నగదు చోరీ కాలేదని ఆయన చెప్పారు. సీసీ కెమెరా పుటేజీని పరిశీలిస్తున్నట్లు డీజీపీ వెల్లడించారు. గ్రిల్స్ తొలగించి దుండగులు బ్యాంకులోకి చొరబడినట్లు ఆయన తెలిపారు. మహేష్ కో ఆపరేటివ్ బ్యాంకులో ఈరోజు తెల్లవారుజామున భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఉదయం బ్యాంకు తెరిచేందుకు వచ్చిన సిబ్బంది షట్టర్ తాళాలు పగులగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బ్యాంకు సిబ్బందిని విచారిస్తున్నారు. సీసీ కెమెరాల్లోని నమోదు అయిన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. మల్కాజ్గిరి డీసీపీ గ్రేవాల్ సింగ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
ఏఎస్ రావు నగర్‌లోని మహేష్ బ్యాంకులో చోరీ
-
ఏఎస్ రావు నగర్‌లోని మహేష్ బ్యాంకులో చోరీ
హైదరాబాద్ : హైదరాబాద్ ఏఎస్ రావు నగర్‌లోని మహేష్ కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. గ్రిల్స్ తొలగించి బ్యాంక్‌లోకి చొరబడిన దుండగులు బంగారు ఆభరణాలు, నగదు అపహరించుకు వెళ్లారు. ఉదయం బ్యాంకు తెరిచేందుకు వచ్చిన సిబ్బంది షట్టర్ తాళాలు పగులగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బ్యాంకు సిబ్బందిని విచారిస్తున్నారు. సీసీ కెమెరాల్లోని నమోదు అయిన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఇక మల్కాజ్గిరి డీసీపీ గ్రేవాల్ సింగ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే ఎంత మొత్తంలో నగదు, ఆభరణాలు చోరీకి గురైన వాటిపై విచారణ జరుపుతున్నారు.