సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మహేష్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో జరిగిన రూ.12.93 కోట్ల సైబర్ నేరం కేసులో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కాస్త పురోగతి సాధించారు. హ్యాకింగ్ ఎలా జరిగిందో దర్యాప్తు అధికారులకు స్పష్టత వచ్చింది. గురువారం బంజారాహిల్స్‌లోని సర్వర్ సంస్థ కార్యాలయానికి వెళ్లిన అధికారులు.. మహేష్ బ్యాంకు అధికారులు, సర్వర్ నిర్వాహకులతో పాటు ముంబై నుంచి వచ్చిన ప్రత్యేక బృందంతో కలిసి విశ్లేషించారు.
సైబర్ నేరగాళ్లు ప్రాక్సీ ఐపీ అడ్రస్‌లు వాడి తొలుత సర్వర్‌లోకే ప్రవేశించారని, ఆపై బ్యాంక్ నెట్‌వర్క్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్నారని గుర్తించారు. నగదు బదిలీ అయిన వాటిలో 3 కరెంట్ అకౌంట్లకు సంబంధించిన వారితో సైబర్ నేరగాళ్లకు సంబంధం ఉండకపో వచ్చని భావిస్తున్నారు. లావాదేవీల సమాచారం వీరికి చేరకుండా సైబర్ నేరగాళ్లు వారి ఖాతాలతో లింకై ఉన్న ఫోన్ నంబర్లను మార్చేశారు. బషీర్‌బాగ్ బ్రాంచ్‌లో షానాజ్ బేగం పేరుతో ఓ మహిళ తెరిచిన సేవింగ్ ఖాతాతో లింకైన నంబర్‌ను మాత్రం నేరగాళ్లు మార్చలేదు.
దీంతో ప్రతి లావాదేవీకి సంబంధించిన ఓటీపీ, సమాచారం ఆమె నంబర్‌కు చేరాయి. బ్యాంకు అధికారుల నుంచి ఫోన్ అందుకున్నప్పటి నుంచి ఆమె ఫోన్ స్విచ్చాఫ్ కావడం, ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఆ మహిళ పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి. ఈ 4 ఖాతాల నుంచి డబ్బు ఉత్తరాదితో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని 129 ఖాతాల్లోకి వెళ్లింది. వాటి నుంచి మరికొన్ని ఖాతాల్లోకి వెళ్లినట్లు గుర్తించారు. ఈ ఖాతాదారులను పట్టుకుంటే సూత్రధారుల గురించి తెలుస్తుందని.. ప్రత్యేక బృందాలను ఆ రాష్ట్రాలకు పంపడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment