Mahindra bikes
-
ఆ గోల్డెన్ బైక్స్ మళ్లీ వస్తున్నాయ్!
సాక్షి, ముంబై: భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లోకి మరో గోల్డెన్ బైక్స్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో పలు సంకేతాలు సందడి చేస్తున్నాయి. 2020 ఆటో ఎక్స్పో నాటికి ఈ బైక్స్ పరిచేయాలని కంపెనీ యోచిస్తోందట. ఈ కంపెనీ పేరే యెజ్డీ మోటార్ సైకిల్స్. మహీంద్ర అండ్ మహీంద్ర సొంతమైన ఈ క్లాసిక్ కంపెనీ తన ఐకానిక్ యెజ్డీ బైక్‌లను తిరిగి లాంచ్ చేస్తోంది. ప్రధానంగా ఇటీవల భారత మార్కెట్లో రీఎంట్రీ ఇచ్చిన జావా బైక్‌లు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో కంపెనీ తాజా నిర్ణయం తీసుకుంది. లాంచింగ్‌పై కచ్చితమైన తేదీని ప్రకటించకపోయినప్పటికీ, భారత బైక్ మార్కెట్‌ను ఏలిన యెజ్డీ మోటార్ సైకిల్స్ బైక్స్ అధికారిక పేజీ ప్రస్తుతం యాక్టివ్‌గా ఉంది. ఈ పేజీలో కొన్ని వివరాలను కూడా పొందుపర్చింది. అలాగే ఆఫీషియల్ ట్విటర్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు యెజ్డీ బైక్‌ల లాంచింగ్‌పై స్పష్టమైన సంకేతాలని నిస్తున్నాయి. -
మహీంద్ర బైక్‌పై రూ.75 వేల భారీ తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ : మహీంద్రా కంపెనీ తన మోజో బైక్‌లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. మహీంద్ర మోజో యూటీ 300 బైక్ కొనుగోలు చేసే వినియోగదారులు ఏకంగా రూ.75 వేల తగ్గింపును పొందవచ్చు. ముఖ్యంగా మహీంద్రా కంపెనీలో పని చేసే ఉద్యోగులకైతే రూ.75వేల ఫ్లాట్ డిస్కౌంట్ అందుతుంది. మార్చి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. బైక్ కొనుగోలు చేయాలనుకునేవారు ఈ ఆఫర్‌ని వినియోగించుకోవాలని కంపెనీ కోరుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న మహీంద్ర డీలర్ ద్వారా అయితే రూ.40 వేల డిస్కౌంట్ అందుతుంది. అలాగే పాత బైక్ ఎక్స్చేంజ్ ద్వారా రూ.60వేలడిస్కౌంట్ పొందవచ్చు. మరోవైపు టూవీలర్ సెగ్మెంట్లో జావా బైక్స్ ఎంట్రీ మోజో బైక్ విక్రయాలను దెబ్బతీసింది. అటు మోజో బైక్ ధర భారీగా ఉండడటంతో కస్టమర్లను ఆకర్షించలేకపోతోంది. దీంతో ఈ బైక్ తయారీని నిలిపివేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే భారీ స్థాయిలో డిస్కౌంట్ని అందిస్తోందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం మోజో బైక్ ప్రధానంగా రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. యూటీ 300, ఎక్స్‌టీ 300పేర్లతోఅందుబాటులో ఉన్న ఈ రెండింటిలో యూటీ 300 ధర తక్కువ. యూటీ 300 ధర రూ.149 లక్షలు కాగా, ఎక్స్‌టీ 300 ధర రూ.1.79 లక్షలుగా ఉంది. -
ఈ ఏడాది 4 కొత్త టూవీలర్లు
న్యూఢిల్లీ: మహీంద్రా గ్రూప్‌కు చెందిన మహీంద్రా టూ వీలర్స్ కంపెనీ ఈ ఏడాది 4 కొత్త టూవీలర్లను మార్కెట్లోకి తెస్తోంది. వీటిల్లో ఒక కొత్త స్కూటర్ మోడల్, ప్రారంభస్థాయి మోటార్ సైకిల్, ప్రస్తుతమున్న మోడళ్లలో రెండు వేరియంట్లు ఉంటాయనిమహీంద్రా టూ వీలర్స్ చీఫ్(కార్యకలాపాల విభాగం) వీరేన్ పొప్లి చెప్పారు. ఇక ఎగుమతులు మూడింతలు పెంచుకోవడం లక్ష్యంగా మరో నాలుగు కొత్త దేశాలకు తన వాహనాలను ఎగుమతి చేయనున్నామని పేర్కొన్నారు. కొలంబియా, నైజీరియా, ఇంకా మరో 2 దేశాలకు టూవీలర్లను ఎగుమతి చేస్తామని చెప్పారు. ఈ ఏడాదే 300 సీసీ మోజో బైక్‌ను అందుబాటులోకి తెస్తామని, 100-110 సిసీ సెగ్మెంట్లో కొత్త మోటార్ సైకిల్‌ను అందించనున్నామని వివరించారు. తమ ప్రధాన మోటార్ బైక్, సెంచురో మంచి అమ్మకాలు సాధిస్తోందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంట్రీ లెవల్ బైక్, పంటెరోను ఆపేస్తామన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. పంటెరో ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన యారో బైక్ ఎగుమతులను కొనసాగిస్తామని వివరించారు. డీలర్ల నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నామని, దీంతో దేశీయంగా అమ్మకాలు పుంజుకోగలవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. గత ఏడాది జూన్‌లో 7,849గా ఉన్న టూవీలర్ల విక్రయాలు ఈ ఏడాది జూన్‌లో 83 శాతం వృద్ధితో 14,389 కు పెరిగాయని పేర్కొన్నారు.