ఈ ఏడాది 4 కొత్త టూవీలర్లు
న్యూఢిల్లీ: మహీంద్రా గ్రూప్‌కు చెందిన మహీంద్రా టూ వీలర్స్ కంపెనీ ఈ ఏడాది 4 కొత్త టూవీలర్లను మార్కెట్లోకి తెస్తోంది. వీటిల్లో ఒక కొత్త స్కూటర్ మోడల్, ప్రారంభస్థాయి మోటార్ సైకిల్, ప్రస్తుతమున్న మోడళ్లలో రెండు వేరియంట్లు ఉంటాయనిమహీంద్రా టూ వీలర్స్ చీఫ్(కార్యకలాపాల విభాగం) వీరేన్ పొప్లి చెప్పారు. ఇక ఎగుమతులు మూడింతలు పెంచుకోవడం లక్ష్యంగా మరో నాలుగు కొత్త దేశాలకు తన వాహనాలను ఎగుమతి చేయనున్నామని పేర్కొన్నారు.
కొలంబియా, నైజీరియా, ఇంకా మరో 2 దేశాలకు టూవీలర్లను ఎగుమతి చేస్తామని చెప్పారు. ఈ ఏడాదే 300 సీసీ మోజో బైక్‌ను అందుబాటులోకి తెస్తామని, 100-110 సిసీ సెగ్మెంట్లో కొత్త మోటార్ సైకిల్‌ను అందించనున్నామని వివరించారు. తమ ప్రధాన మోటార్ బైక్, సెంచురో మంచి అమ్మకాలు సాధిస్తోందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంట్రీ లెవల్ బైక్, పంటెరోను ఆపేస్తామన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.
పంటెరో ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన యారో బైక్ ఎగుమతులను కొనసాగిస్తామని వివరించారు. డీలర్ల నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నామని, దీంతో దేశీయంగా అమ్మకాలు పుంజుకోగలవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. గత ఏడాది జూన్‌లో 7,849గా ఉన్న టూవీలర్ల విక్రయాలు ఈ ఏడాది జూన్‌లో 83 శాతం వృద్ధితో 14,389 కు పెరిగాయని పేర్కొన్నారు.