MAHINDRA ECOLE CENTRALE
-
ఏఐపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020 సంవత్సరాన్ని కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్)గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 2 గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మహీంద్రా ఎకోల్ సెంట్రాల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్(ఎంఈసీ) మధ్య ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌పై అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఐటీ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేశ్ రంజన్, ఎంఈసీ అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా మహీంద్రా ఎకోల్ సెంట్రాల్ డైరక్టర్ మేడూరీ యాజులు మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం ద్వారా యువ పారిశ్రామికవేత్తలు మరింత ఎదగడానికి మేం చేస్తున్న కృషికి తోడు ఇప్పుడు ప్రభుత్వం కూడా భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌పై మరింత నైపుణ్యం పెంపొందించేలా సూపర్ కంప్యూటర్ ల్యాబ్ పరికరాలతో పాటు, కొత్తగా ఏర్పాటు ఏఐ స్టార్టప్‌లకు మరింత ఊతమిచ్చే విధంగా రూపొందించనున్నామని స్పష్టం చేశారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో భవిష్యత్తులో కృత్రిమ మేధస్సుపై స్టార్టప్ ఎకోసిస్టమ్ నిర్మాణానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కాగా, మహీంద్రా ఎకోల్ సెంట్రాల్ తన సూపర్ కంప్యూటర్ ల్యాబ్‌ను ఆగస్టు 2019 లో ప్రారంభించింది. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్ వంటి పలు ప్రాజెక్టులపై పనిచేస్తోంది. వేగవంతమైన కంప్యూటింగ్ పనితీరు , డీప్ లెర్నింగ్ అండ్ అనలిటిక్స్, మల్టీ-డిసిప్లినరీ ఇంజనీరింగ్ సిమ్యులేషన్స్ కోసం ఒక బలమైన వేదికను అందించడానికి ఎంఈసీ సంస్థ సూపర్ కంప్యూటర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. -
‘ఆ బృందం క్రేజీ ఆఫర్ దక్కించుకుంది’
సాక్షి, హైదరాబాద్ : ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రతిభకు పట్టం కట్టేందుకు ‘నేషనల్ అండర్గ్రాడ్యుయేట్ రీసెర్చ్ సింపోజియం’ పేరిట తాము నిర్వహించిన కార్యక్రమం విజయవంతమైందని మహీంద్ర ఎకోలే సెంట్రల్(ఎంఈసీ) ఇంజనీరింగ్ విద్యా సంస్థ తెలిపింది. ఈ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి 300కు పైగా విద్యార్థులు హాజరయ్యారని పేర్కొంది. ఇందులో భాగంగా పరిశోధనా విభాగానికి సంబంధించి 12 మౌఖిక, 30 పోస్టర్లను విద్యార్థులు సమర్పించారని తెలిపింది. వివిధ విభాగాల్లో గెలుపొందిన విద్యార్థులకు 65 వేల రూపాయల విలువైన బహుమతులు అందజేసినట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమానికి ప్రఖ్యాత ప్రొఫెసర్ అజయ్ ఘటక్, సైబర్ భద్రతా విభాగం సీఈఓ డాక్టర్ శ్రీరామ్ బిరుదవోలు ముఖ్య అతిథులుగా హాజరై... స్టార్టప్‌లు, ఎంటర్ప్రెన్యూర్ నాయకత్వాల గురించి విద్యార్థులకు వివరించినట్లు పేర్కొంది. నేషనల్ అండర్గ్రాడ్యుయేట్ రీసెర్చ్ సింపోజియం’ లో భాగంగా టెక్ మహీంద్ర మెషీన్ లెర్నింగ్‌తో కలిసి ఎంఈసీ క్లబ్ ఎనిగ్మా12 గంటల కోడింగ్ ఛాలెంజ్‌ను నిర్వహించినట్లు ఎంఈసీ తెలిపింది. అదే విధంగా స్టార్టప్ ఐడియా కాంటెస్ట్ కూడా నిర్వహించామని..ఈ పోటీకి పారిశ్రామికవేత్తలు డాక్టర్ ఎ.శ్రీనివాస్(ఏఐపీఈఆర్ వ్యవస్థాపక డైరెక్టర్), రాఘవేంద్ర ప్రసాద్(ఫారిగేట్ అడ్వైజరీ సొల్యూషన్స్ సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్), శ్రీచరణ్ లక్కరాజు(స్టమాజ్ సీఈఓ) న్యాయ నిర్ణేతలుగావ్యవహరించారని పేర్కొంది. ఈ పోటీలో గెలుపొందిన ఓ విద్యార్థి బృందం.. స్టార్టప్ పెట్టుబడులకై జడ్జీల నుంచి ఆఫర్‌ను సైతం సొంతం చేసుకుందని వెల్లడించింది. అదే విధంగా విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించిన డిజైన్ అండ్ ప్రొటోటైప్ కాంటెస్ట్‌లో 12 బృందాలు పాల్గొన్నాయని వెల్లడించింది. ఈ కార్యక్రమం గురించి ఎంఈసీ డైరెక్టర్ ప్రొఫెసర్ యాజులు మెడ్యూరీ మాట్లాడుతూ..‘2018లో నిర్వహించిన సింపోజియంకు మంచి ఆదరణ లభించింది. అందుకే ఈసారి జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించాం. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనున్న తరుణంలో ఇలాంటి కార్యక్రమాలు యువ పారిశ్రామికవేత్తలను వెలికితీసేందుకు దోహదపడతాయి’ అని పేర్కొన్నారు. కాగా మహీంద్ర గ్రూప్‌లో భాగమైన అంతర్జాతీయ కళాశాల ఎంఈసీని మహీంద్ర యాజమాన్యం 2013లో హైదరాబాద్‌లో నెలకొల్పిన సంగతి తెలిసిందే. -
సామాజిక బాధ్యతగా ఎంఈసీ
ప్రపంచస్థాయి బోధన, వసతులతో ‘మహీంద్ర’కళాశాల పూర్తిగా పరిశ్రమలతో అనుసంధానం... విద్యార్థికి ఏటా ఇంటర్న్‌షిప్ ‘సాక్షి’తో మహీంద్ర ఎకోల్ సెంట్రల్ బోర్డు సభ్యుడు రాహుల్ భూమన్ సాక్షి, హైదరాబాద్: దేశ పారిశ్రామికరంగంపై తనదైన ముద్రవేసిన మహీంద్ర గ్రూప్ ఇప్పుడు సమాజానికి తనవంతు చేయూతగా విద్యారంగంలోకి అడుగుపెట్టిందని మహీంద్ర ఎకోల్ సెంట్రల్(ఎంఈసీ) బోర్డు సభ్యుడు రాహుల్ భూమన్ పేర్కొన్నారు. ఎంఈసీ ఇంజనీరింగ్ కాలేజీ ద్వారా ప్రస్తుత ఇంజనీరింగ్ విద్యకు భిన్నంగా నేచురల్ సెన్సైస్‌పై ప్రధానంగా దృష్టిపెడుతూ అంతర్జాతీయ బోధన ప్రమాణాలు, మౌలిక వసతులతో నిపుణులైన ఇంజనీర్లను తయారుచేయనున్నట్లు తెలిపారు. ఎంఈసీ ఏర్పాటు లక్ష్యాలపై ఆయన సాక్షితో మాట్లాడారు. సాక్షి: రాష్ట్రంలో ఐఐటీ, ఎన్ఐటీ, బిట్స్, ట్రిపుల్‌ఐటీలు, వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంఈసీ అవసరమేంటి? రాహుల్: సామాజిక బాధ్యతగా మహీంద్ర గ్రూప్ ఈ కళాశాలను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుత విద్యావిధానం పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా లేదు. ఆ అవసరాలను తీర్చడానికి ప్రపంచస్థాయి విద్యాసంస్థను నెలకొల్పే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. సాక్షి: ఎంఈసీ ఇతర విద్యాసంస్థలకు ఏవిధంగా భిన్నం? రాహుల్: ఐఐటీలు సహా ఇంజనీరింగ్ కాలేజీలన్నీ 40 ఏళ్ల నాటి కరికులమ్‌తో బోధిస్తున్నాయి. ఆ కరికులమ్ ఉత్పత్తిరంగానికి ఉద్దేశించినది. కానీ ఇప్పుడు ఉత్పత్తిరంగ వాటా కేవలం 18 శాతమే. అందుకే యూరప్ విద్యావిధానంలో 200 ఏళ్ల అనుభవమున్న ఎకోల్ సెంట్రల్, జేఎన్టీయూహెచ్లతో ఒప్పందం చేసుకుని ఐదేళ్ల ఎంటెక్ డిగ్రీ కోర్సు కోసం అంతర్జాతీయస్థాయి పారిశ్రామిక అవసరాలను తీర్చగలిగే కరికులం రూపొందించాం. సాక్షి: ప్రస్తుత కరికులంతో ఉపయోగం లేదా? రాహుల్: అది పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా లేదు. ఆత్మవిశ్వాసం, భాష, టీంవర్క్, ప్రాజెక్టు రూపకల్పన నైపుణ్యాలు లోపించాయి. మా ఐదేళ్ల కోర్సులో ఫ్రెంచ్ భాష కూడా నే ర్పిస్తాం. తొలి రెండున్నరేళ్లు నేచురల్ సెన్సైస్, బేసిక్ సెన్సైస్ బోధిస్తాం. ఆ తర్వాతే స్పెషలైజేషన్ బోధనలు ఉంటాయి. సాక్షి: ఎంఈసీలో మౌలిక వసతులు ఎలా ఉంటాయి? రాహుల్: ఎంఈసీది సమీకృత అనుసంధానిత వ్యవస్థ. ప్రపంచంలో ఎక్కడినుంచైనా ముఖాముఖిగా బోధనలు వినే, పారిశ్రామిక నిపుణులతో మాట్లాడే సదుపాయాలు ఉన్నాయి. పరిశోధనలు లక్ష్యంగా ఎనర్జీ, ఇన్ఫ్రా, మెటీరియల్ సైన్స్, డిఫెన్స్, కంప్యూటింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ రంగాలకు సంబంధించి ల్యాబ్‌లను ఏర్పాటు చేశాం. సాక్షి: ఎలాంటి బోధన వసతులు ఉంటాయి? రాహుల్: పరిశోధనల ప్రాతిపదికగా బోధనలు ఉంటాయి. అధ్యాపకులు వారి సమయంలో సగాన్ని పరిశోధనలకే కేటాయిస్తారు. వారిలో 40 శాతం మంది విదేశీ ప్రొఫెసర్లే. అధ్యాపకులు, విద్యార్థుల నిష్పత్తి 1:10గా ఉంటుంది. సాక్షి: విద్యార్థులకు మీ సంస్థలో ఎలాంటి అవకాశాలు ఉంటాయి? రాహుల్: ఇక్కడే చదివే విద్యార్థులకు విదేశాల్లో 6 నెలల ఇంటర్న్‌షిప్ తప్పనిసరి. దీనివల్ల అంతర్జాతీయ పనితీరుపై అవగాహన వస్తుంది. దీనికితోడు విద్యార్థి ఐదేళ్లపాటు ప్రతి ఏటా ఇంటర్న్‌షిప్ చేయాలి. హైదరాబాద్‌లో మహీంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రాన్స్ వర్సిటీ ఎకోల్ సెంట్రల్తో భాగస్వామ్యం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఐఐటీ, ట్రిపుల్ఐటీ, ఎన్ఐటీ, బిట్స్ వంటి విద్యాసంస్థల సరసన మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ చేరబోతోంది. ట్రాక్టర్లు, కార్లు, రవాణా వాహనాలు, వ్యవసాయ ఉత్పత్తులు, ఐటీ రంగాల్లో ప్రసిద్ధిగాంచిన మహీంద్ర గ్రూప్ హైదరాబాద్‌లో మహీంద్ర ఎకోల్ సెంట్రల్ (ఎంఈసీ) ఇంజనీరింగ్ కాలేజీని స్థాపిస్తోంది. ఫ్రాన్స్‌కు చెందిన యూనివర్సిటీ ఎకోల్ సెంట్రల్ భాగస్వామ్యంతో బహదూర్‌పల్లిలోని టెక్ మహీంద్ర క్యాంపస్ (గతంలో సత్యం క్యాంపస్)లో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 200 కోట్ల వ్యయంతో నెలకొల్పుతోంది. ఇప్పటికే భవన నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. ఇంజనీరింగ్‌లో ఐదేళ్ల సమీకృత ఎంటెక్ కోర్సును అందించేందుకు జేఎన్టీయూహెచ్తో ఒప్పం దం చేసుకుంది. వచ్చే ఏడాదే అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. జేఈఈ-మెయిన్ ర్యాంకుల ఆధారంగా కాలేజీ సీట్లు భర్తీ చేయనున్నారు. తొలి ఏడాది 300 సీట్లు, రెండో ఏడాది 360 సీట్లు, మూడో ఏడాది 420 సీట్లు భర్తీచేయనున్నారు. తొలి ఏడాది సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచీల్లో అడ్మిషన్లు ప్రారంభమవుతాయి. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మృగ్యమవుతున్న తరుణంలో విద్యాసంస్థలకు పారిశ్రామిక అనుసంధానమనే ఆలోచనలతో మహీంద్ర గ్రూప్ ఎంఈసీని ఏర్పాటు చేస్తోంది. -
విద్యారంగంలోకి మహీంద్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా గ్రూప్ తాజాగా విద్యా రంగంలోకి ప్రవేశించింది. మహీంద్రా ఇకోల్ సెంట్రల్ (ఎంఈసీ) పేరిట ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఫ్రాన్స్‌కి చెందిన ఇకోల్ సెంట్రల్ ప్యారిస్, జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ)తో కలిపింది. శుక్రవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. టెక్ మహీంద్రా అనుబంధ సంస్థ మహీంద్రా ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ ఈ కళాశాలను నిర్వహిస్తుంది. విద్యార్థులు కేవలం ఇంజనీరింగ్ విద్యకు మాత్రమే పరిమితం కాకుండా మేనేజ్మెంట్ నైపుణ్యాలు కూడా అలవర్చుకుని అంతర్జాతీయ స్థాయిలో బిజినెస్ లీడర్లుగా ఎదిగేందుకు అవసరమైన శిక్షణను కల్పించేందుకు ఎంఈసీని ఏర్పాటు చేసినట్లు టెక్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ తెలిపారు. 2014 నుంచి తరగతులు మొదలవుతాయని, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సును అందించనున్నామని వివరించారు. నాలుగేళ్లకు బీటెక్, అయిదో ఏట ఎంటెక్ పట్టా పొందవచ్చన్నారు. ప్రారంభంలో 300 మంది విద్యార్థులను చేర్చుకుంటామని, క్రమంగా ఈ సంఖ్య 2,500కి పెరగగలదని మహీంద్రా ఇకోల్ సెంట్రల్ బోర్డు సభ్యుడు సీపీ గుర్నాణీ చెప్పారు. ఐఐటీ ఎంట్రన్స్ ఆధారంగా విద్యార్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని వివరించారు. ఫీజు వివరాలపై ఇంకా కసరత్తు జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. తర్వాత దశల్లో చెన్నై, జైపూర్, పుణె, గోవా తదితర ప్రాంతాల్లో అనుబంధ క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు వివరించారు.