విద్యారంగంలోకి మహీంద్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా గ్రూప్ తాజాగా విద్యా రంగంలోకి ప్రవేశించింది. మహీంద్రా ఇకోల్ సెంట్రల్ (ఎంఈసీ) పేరిట ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఫ్రాన్స్‌కి చెందిన ఇకోల్ సెంట్రల్ ప్యారిస్, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ)తో కలిపింది. శుక్రవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. టెక్ మహీంద్రా అనుబంధ సంస్థ మహీంద్రా ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ ఈ కళాశాలను నిర్వహిస్తుంది.
విద్యార్థులు కేవలం ఇంజనీరింగ్ విద్యకు మాత్రమే పరిమితం కాకుండా మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు కూడా అలవర్చుకుని అంతర్జాతీయ స్థాయిలో బిజినెస్ లీడర్లుగా ఎదిగేందుకు అవసరమైన శిక్షణను కల్పించేందుకు ఎంఈసీని ఏర్పాటు చేసినట్లు టెక్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ తెలిపారు. 2014 నుంచి తరగతులు మొదలవుతాయని, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సును అందించనున్నామని వివరించారు. నాలుగేళ్లకు బీటెక్, అయిదో ఏట ఎంటెక్ పట్టా పొందవచ్చన్నారు. ప్రారంభంలో 300 మంది విద్యార్థులను చేర్చుకుంటామని, క్రమంగా ఈ సంఖ్య 2,500కి పెరగగలదని మహీంద్రా ఇకోల్ సెంట్రల్ బోర్డు సభ్యుడు సీపీ గుర్నాణీ చెప్పారు. ఐఐటీ ఎంట్రన్స్ ఆధారంగా విద్యార్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని వివరించారు. ఫీజు వివరాలపై ఇంకా కసరత్తు జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. తర్వాత దశల్లో చెన్నై, జైపూర్, పుణె, గోవా తదితర ప్రాంతాల్లో అనుబంధ క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు వివరించారు.