సివిల్స్ మెయిన్ ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: గత ఏడాది డిసెంబర్లో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ ప్రకటించింది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులు మార్చి 20వ తేదీ నుంచి మొదలయ్యే ఇంటర్వ్యూలో పాల్గొనాల్సి ఉంటుంది. వీరు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాల్సి ఉంటుందని యూపీఎస్సీ ప్రకటించింది. అర్హత పొందిన వారి పేర్లను http://www.upsc.gov.inలో చూసుకోవచ్చని తెలిపింది. ఇంటర్వ్యూలకు హాజయ్యే వారు ఈ- సమ్మన్ లెటర్లను అందుకోని అభ్యర్థులు వెంటనే యూపీఎస్సీ కార్యాలయంలో సంప్రదించాలని కోరింది.
వ్యక్తిత్వ పరీక్ష లేదా ఇంటర్వ్యూకు సంబంధించి ఎలాంటి ఉత్తరాలు పంపించబోమని పేర్కొంది. ఇంటర్వ్యూ తేదీ, సమయానికి సంబంధించి ఎటువంటి మార్పులు చేయబోమని కూడా స్పష్టం చేసింది. అనర్హులైన అభ్యర్థుల మార్కులషీట్లను 15 రోజుల్లోగా వెబ్సైట్లో ఉంచుతామని తెలిపింది. వాటిని 60 రోజుల వరకు చూసుకోవచ్చని వివరించింది.