Main stars
-
తప్పుగా అర్థం చేసుకోరు
గోపీకృష్ణ, మహేంద్ర షిల్పా, ప్రియా అగస్త్య ముఖ్య తారలుగా ఎస్.గుండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రుణం’. భీమినేని సురేష్, జి.రామకృష్ణారావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా గుండ్రెడ్డి మాట్లాడుతూ– ‘‘తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండే పిల్లలకు తల్లిదండ్రుల మీద, వారి బంధాలు, బాంధవ్యాలు, ఇంట్లో జరిగే చిన్న చిన్న అపార్థాల చుట్టూ ఈ చిత్రకథ ఉంటుంది. ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్న చిన్న విషయాలను తప్పుగా అర్థం చేసుకోవడం తగ్గుతుంది’’ అన్నారు. ‘‘ఇద్దరు స్నేహితుల కుటుంబాల మధ్య నడిచే కథ ఇది’’ అన్నారు జి.రామకృష్ణారావు. ‘‘ఈ సినిమాకి మంచి టీమ్ కుదిరింది. ఇదే టీమ్‌తో మేలో మరో చిత్రం స్టార్ట్ చేయబోతున్నాం’’ అని భీమినేని సురేష్ అన్నారు. -
అందరికీ దగ్గరవుతాడు!
చంద్రమోహన్, ప్రభాకర్, చిన్న, రాంజగన్ తదితరులు ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘పాషా అందరివాడు’. పలువురు బాల నటీనటులు నటించిన ఈ చిత్రాన్ని సాయి సూరజ్ ఫిలింస్ పతాకంపై స్వీయదర్శకత్వంలో ఎస్.కె. సైదా సూరజ్ రూపొందించారు. ఈ శనివారం చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చంద్రమోహన్ మాట్లాడుతూ -‘‘దర్శకుడు ఎంతో మమకారంతో ఈ సినిమా తీశారు. సమాజానికి మంచి సందేశం ఇవ్వాలనే తపనతో తీసిన చిత్రం ఇది. ఈ మధ్య నేనెలాంటి కథలో నటించాలనుకున్నానో, ఎలాంటి డైలాగులు చెప్పాలనుకున్నానో ఈ చిత్రం అలాంటిదే’’ అని చెప్పారు. మా ‘పాషా అందరివాడు’ అందరికీ దగ్గరవుతాడనే నమ్మకం ఉందని సైదా సూరజ్ తెలిపారు.