Mainpuri Bypoll Result: ములాయం కోడలు డింపుల్ యాదవ్ భారీ విజయం
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు దేశంలోని 5 రాష్ట్రాల్లో 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒక లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా గురువారం వెలువడుతున్నాయి. ఇందులో ఉత్తర ప్రదేశ్‌లోని మెయిన్ పూరి లోక్‌సభ స్థానం కూడా ఒకటి. సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ములాయం సింగ్ యాదవ్ అక్టోబర్‌లో మృతి చెందడంతో మెయిన్‌పూరి లోక్‌సభకు ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక్కడి నుంచి ఎస్పీ తరపున ములాయం కోడలు, అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ బరిలో నిలిచారు.
మెయిన్‌పూరి ఉపఎన్నికలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి డింపుల్ యాదవ్ చరిత్రను తిరగరాస్తూ భారీ విజయాన్ని అందుకున్నారు. దాదాపు మూడు లక్షల బంపర్ మెజార్టీతో మెయిన్‌పూరిని కైవసం చేసుకున్నారు. తన సమీప బీజేపీ అభ్యర్థి రఘురాజ్ షాక్వాపై 2,88,461 ఓట్ల భారీ తేడాతో విజయ కేతనం ఎగరవేశారు. మొయిన్‌పూరి విజయంపై డింపుల్ యాదవ్ స్పందించారు.. తన గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసిన సమాజ్‌వాదీ పార్టీ మద్దతుదారులందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనను నమ్మినందుకు మెయిన్‌పురి ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విజయం నేతాజీకి (దివంగత ములాయం సింగ్ యాదవ్) అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ములాయం సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్‌కు నమ్మకస్తుడైన రఘురాజ్ సింగ్ షాక్యాను బీజేపీ రంగంలోకి దింపినా ఓటర్లు మాత్రం డింపుల్‌వైపు మొగ్గుచూపారు. ఒకానొక దశలో ఆమె వెనుకంజలో ఉన్నట్లు కనిపించినా.. మళ్లీ పుంజుకొని మెజార్టీ సాధించారు. సమాజ్‌వాదీకి కంచుకోటగా పిలిచే మొయిన్‌పూరిలో సైకిల్ పరుగులు పెట్టడంతో పార్టీ శ్రేణులు ఆనందోత్సహంలో మునిగిపోయారు.
చదవండి: గుజరాత్ ఎన్నికలతో చరిత్ర సృష్టించిన ఆప్.. దేశంలో తొమ్మిదో పార్టీగా రికార్డ్
కాగా మెయిన్‌పురి లోక్‌సభ స్థానం నుంచి ములాయం ఐదుసార్లు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ములాయం సింగ్ యాదవ్ 94వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి ప్రేమ్ సింగ్‌పై విజయం సాధించారు. ఇప్పుడు డింపుల్ యాదవ్ రెండు లక్షలకుపైగా మెజార్టీతో గెలుపొందడం గమనార్హం.
మహారాష్ట్రలో పుట్టిపెరిగిన డింపుల్ యాదవ్.. లక్నోలో చదువుకునే టైంలో అఖిలేష్‌కు పరిచయం అయ్యారు. ఇద్దరిదీ ప్రేమవివాహం. రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. 2009 ఎన్నికల్లో తొలిసారి ఫిరోజ్‌బాద్ నుంచి పోటీ చేసి రాజ్‌బబ్బర్ చేతిలో ఓటమి పాలయ్యారు డింపుల్. ఆపై 2012లో భర్త తన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో కన్నౌజ్ ఉప ఎన్నికల్లో ఆమె గెలిచారు. ఆపై రెండేళ్లకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ మళ్లీ అక్కడి నుంచే ఎంపీగా నెగ్గారు. 2019లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసి.. పదివేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి సుభ్రత్ పాథక్ చేతిలో ఓటమి పాలయ్యారు ఆమె.
చదవండి: Himachal Election Results: కాంగ్రెస్ ఘన విజయం.. సీఎం రాజీనామా