Major girl
-
ప్లీజ్.. నాకు పెళ్లి వద్దు
బషీరాబాద్: ‘‘సార్.. నేను డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నా. ఇంకా ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేయాలనేది నా లక్ష్యం. మా అమ్మానాన్న నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు. ఆదివారం నిశ్చితార్థం కూడా పెట్టుకున్నారు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మంచి, చెడు ఆలోచించగలిగే శక్తి నాకు ఉంది. పైగా నేను మేజర్‌ను. దయచేసి ఈ పెళ్లిని ఆపండి సార్.. లేదంటే నా జీవితం అంధకారం అవుతుంది. మీరే నాకు న్యాయం చేయాలి’’అంటూ శనివారం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ గ్రామానికి చెందిన ఓ 20 ఏళ్ల యువతి తల్లిదండ్రులపై తాండూరు గ్రామీణ సీఐ జలందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సీఐ ఆమె తల్లిదండ్రులను ఠాణాకు రప్పించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అమ్మాయి మేజర్ కావడంతో ఆమెకు ఇష్టం లేని పెళ్లి చేయవద్దని వారికి సూచించారు. ‘మంచి సంబంధమని ఇప్పటికే పెళ్లికి అంగీకరించాం. అందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ఆదివారం నిశ్చితార్థం పెట్టుకున్నాక ఇష్టం లేదంటే బంధువుల ఎదుట మా పరువు ఏం కావాలి’అంటూ తల్లిదండ్రులు పోలీసుల ఎదుట కన్నీటిపర్యంతం అయ్యారు. తాము ఇంటికి వెళ్లి మాట్లాడుకుంటామని తల్లిదండ్రులు యువతిని తీసుకొని ఇంటికి వెళ్లారు. యువతి మేజర్ కావడంతో ఇష్టం లేని పెళ్లి చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. కాగా, వరుడి వయస్సు 40 ఏళ్లని తెలుస్తోంది. -
పుట్టింటి పోలీసులు
పోలీసులు పెళ్లి చేశారు. అలాగని మేజర్ అయిన అమ్మాయి, అబ్బాయి ‘మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు’ అని ఆశ్రయం కోరి వచ్చిన వాళ్లకు పెళ్లి చేయడం కూడా కాదు. ఒక పేదింటి అమ్మాయికి పుట్టింటి వాళ్లుగా మారి చేసిన పెళ్లి! రాజస్తాన్‌లో బాగా వెనుకబడిన జిల్లా టోంక్. ఆ జిల్లాలో ఓ చిన్న పట్టణం లాంటి పల్లె దత్వాస్. పోలీసులు పెళ్లి చేసింది ఆ ఊళ్లోని అమ్మాయికే. మమతా మహావర్ నెలల బిడ్డగా ఉన్నప్పుడే తండ్రి పోయాడు. పదేళ్లు నిండే లోపు తల్లి పోయింది. ఇక మిగిలింది తను, అన్న. అతడు కూడా అనారోగ్యంతో మంచం పట్టి, కొంతకాలానికి చనిపోయాడు. మమతకి మిగిలింది చిన్న గూడు, అన్న ఆరోగ్యం కోసం చేసిన అప్పులు. ఆమె ఎంజీఎన్ఆర్ఈజీఏ (మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, 2005) ఉపాధి పనులతో పొట్ట నింపుకునేది. అన్నకూ ఇంత పెట్టేది. అతడు పోయాక రోజూ పనికి పోతూ డబ్బు వెనకేసుకుంది. అప్పులు కొంత కొంత తీరుతూ వచ్చాయి. పూర్తిగా తీరిపోయిన తర్వాత ‘ఉపాధి’ పనుల డబ్బును సర్పంచ్ దగ్గరే దాచుకుంది. ఊళ్లో వాళ్లు మంచి పిల్ల అని మురిసిపోయారు. ఆమెకో వరుణ్ని కూడా వెదకి తెచ్చారు. ఇక పెళ్లే ఆలస్యం. మమత ఆ ఊరి సర్పంచ్ దగ్గరకెళ్లి తనకు పెళ్లి కుదిరిందని చెప్పింది. తను పని చేసిన రోజులకు లెక్కకట్టి డబ్బంతా ఇచ్చేస్తే పెళ్లి పనులు చేసుకుంటానని అడిగింది. సర్పంచ్ మాట తప్పాడు! సర్పంచ్‌కి డబ్బు ఇవ్వబుద్ధి కాలేదు. కాళ్లరిగేలా తిరిగినా మనసు కరగలేదు. పెళ్లి దగ్గరకు వస్తోంది. ఇక మమత పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఉపాధి హామీలో భాగంగా గతంలో ఆ పోలీస్ స్టేషన్ పనులు కూడా చేసి ఉందామె. స్టేషన్ నిర్మాణంలో పని చేసిన అమ్మాయి ఇప్పుడు న్యాయం కోసం మెట్లెక్కింది. సర్పంచ్ దగ్గర నుంచి రావాల్సిన డబ్బు వచ్చినా కూడా అది పెళ్లి ఖర్చులకు సరిపోయేట్టు కనిపించలేదు. చివరికి పోలీసులు తామే అదనంగా కొంత డబ్బు ఇచ్చి మమత పెళ్లి చేయడానికి ముందుకొచ్చారు. స్టేషన్లో పెళ్లి మండపం రెడీ అయింది. పోలీసులే అమ్మాయి తరఫు వారు. హెడ్ కానిస్టేబుల్ దయారామ్.. మమత తండ్రి పాత్ర తీసుకున్నాడు. ఇటీవలే అక్షయ తృతీయ రోజు పెళ్లి చేశారు. సర్పంచ్ ఇవ్వాల్సిన డబ్బును విడిపించి మమత చేతిలో పెట్టి అత్తగారింటికి పంపించారు.‘‘సర్పంచ్ మొదటే ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేసి ఉంటే మమత పెళ్లి అన్నీ అమర్చినట్లు ఇంత చక్కగా జరిగేది కాదేమో. దేవుడు ఆమెకు లక్షణంగా పెళ్లి చేయడానికే ఇదంతా చేశాడు’’ అని సంతోషపడుతున్నారు ఆమె ఆత్మీయులు. పోలీసోళ్లు పుట్టింటోళ్లయితే అత్తగారింటి వాళ్లు అమ్మాయిని చక్కగా చూసుకుంటారని కూడా నవ్వుతూ అనుకుంటున్నారు. – మను -
మైనర్ బాలుడిని పెళ్లాడేందుకు యువతి పోరాటం
సాక్షి, చెన్నై : కాంచీపురానికి చెందిన 16 ఏళ్ల బాలుడితో తనకు వివాహం జరిపించాలంటూ 18 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం కలిగించింది. దీన్ని ఎలా పరిష్కరించాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా, గాజులపెళ్లూరుకు చెందిన యువతి తన అక్క ప్రసవం కోసం ఏడాది కిందట కాంచీపురం జిల్లాకు వెళ్లారు. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలుడితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇదిలా ఉండగా యువతి కొన్ని నెలల కిందట తన సొంత గ్రామానికి వెళ్లింది. అక్కడి నుంచి బాలుడితో తరచూ ఫోన్లో మాట్లాడేది. అయితే తరచుగా ఫోన్లో మాట్లాడేందుకు బాలుడు నిరాకరించడంతో మనస్తాపానికి గురైన ఆమె గత నెల 10 తేదీన ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబసభ్యులు అమెను ఆస్పత్రిలో చేర్చడంతో చికిత్స పొంది క్రమంగా కోలుకుంది. ఈ క్రమంలో బీఎన్ కండ్రిగ పోలీస్ స్టేషన్లో యువతి ఫిర్యాదు చేసింది. అందులో కాంచీపురానికి చెందిన 16 ఏళ్ల బాలుడు తనను వివాహం చేసుకునేందుకు నిరాకరిస్తున్నాడని, దీనిపై చర్యలు తీసుకుని తనను బాలుడి చెంత చేర్చాలని కోరింది. ఫిర్యాదు చేసిన యువతి మేజరైనప్పటికీ బాలుడికి 16 ఏళ్లు మాత్రమే ఉండడంతో వారికి దిక్కుతోచలేదు. ప్రస్తుతం వరదయ్య పాళెం మండలం, పాండూరులో విడిగా జీవిస్తున్న యువతి తనను ప్రేమించి మోసగించిన బాలుడితో వివాహం జరిపించాలని కోరుతూ, తామిరువురు కలిసి తీసుకున్న ఫొటోలతో సోమవారం విలేకరులకు కన్నీటితో తెలిపింది. -
అమ్మాయి మేజర్ అబ్బాయి మైనర్!
అధికారులు వచ్చేలోగా బాల్యవివాహం శివ్వంపేట : మెదక్ జిల్లా శివ్వంటపే మండలం తాళ్లపల్లి తండాలో మైనర్ అబ్బాయి, మేజర్ అమ్మాయిలకు వివాహం జరిగింది. తండాకు చెందిన 20 ఏళ్ల అమ్మాయికి, కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ పంచాయతీ ఉసేన్గడ్డ తండాకు చెందిన 16 ఏళ్ల యువకుడితో శనివారం ఉదయం 11:30కి పెళ్లి చేసేందుకు ఇరుకుటుంబాలు ఏర్పాట్లు చేసుకున్నారు. బాల్యవివాహం జరుగుతుందని తెలుసుకున్న రెవెన్యూ, పోలీస్, ఐసీడీఎస్ సిబ్బంది ఉదయం 9 గంటలకు తండాకు చేరుకోగా అప్పటికే పెళ్లి చేసేశారు. అయితే అధికారులు వారికి కౌన్సెలింగ్ నిర్వహించి అమ్మాయిని అబ్బాయి వెంట అత్తగారింటికి పంపించమని రాతపూర్వకంగా రాయించుకున్నారు.