
సాక్షి, చెన్నై : కాంచీపురానికి చెందిన 16 ఏళ్ల బాలుడితో తనకు వివాహం జరిపించాలంటూ 18 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం కలిగించింది. దీన్ని ఎలా పరిష్కరించాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా, గాజులపెళ్లూరుకు చెందిన యువతి తన అక్క ప్రసవం కోసం ఏడాది కిందట కాంచీపురం జిల్లాకు వెళ్లారు. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలుడితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇదిలా ఉండగా యువతి కొన్ని నెలల కిందట తన సొంత గ్రామానికి వెళ్లింది. అక్కడి నుంచి బాలుడితో తరచూ ఫోన్‌లో మాట్లాడేది.
అయితే తరచుగా ఫోన్‌లో మాట్లాడేందుకు బాలుడు నిరాకరించడంతో మనస్తాపానికి గురైన ఆమె గత నెల 10 తేదీన ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబసభ్యులు అమెను ఆస్పత్రిలో చేర్చడంతో చికిత్స పొంది క్రమంగా కోలుకుంది. ఈ క్రమంలో బీఎన్ కండ్రిగ పోలీస్ స్టేషన్‌లో యువతి ఫిర్యాదు చేసింది. అందులో కాంచీపురానికి చెందిన 16 ఏళ్ల బాలుడు తనను వివాహం చేసుకునేందుకు నిరాకరిస్తున్నాడని, దీనిపై చర్యలు తీసుకుని తనను బాలుడి చెంత చేర్చాలని కోరింది. ఫిర్యాదు చేసిన యువతి మేజరైనప్పటికీ బాలుడికి 16 ఏళ్లు మాత్రమే ఉండడంతో వారికి దిక్కుతోచలేదు. ప్రస్తుతం వరదయ్య పాళెం మండలం, పాండూరులో విడిగా జీవిస్తున్న యువతి తనను ప్రేమించి మోసగించిన బాలుడితో వివాహం జరిపించాలని కోరుతూ, తామిరువురు కలిసి తీసుకున్న ఫొటోలతో సోమవారం విలేకరులకు కన్నీటితో తెలిపింది.