మంజునాథ కమిషన్ ముట్టడిద్దాం
కాపులను బీసీల్లో చేరిస్తే అన్యాయమైపోతాం
అమలాపురం బీసీ సంఘాల సమావేశంలో తీర్మానం
అమలాపురం రూరల్ :'ఆర్థికంగా అభివృద్ధి చెందిన కాపులను బీసీల జాబితాలో చేరిస్తే బీసీలకు తీరని అన్యాయం జరుగుతుంది. జిల్లాలోని బీసీ కులాలన్నీ ఐక్యంగా దీనిని ప్రతిఘటించాలి. ఈనెల 28న విచారణకు వస్తున్న మంజునాథ కమిషన్‌ను ముట్టడించాలి' అని జిల్లా బీసీ సంఘాల సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. జిల్లా బీసీ సంఘాల సమావేశం బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి అధ్యక్షతన అమలాపురంలోని సూర్యనగర్ కమ్యూనిటీ హాల్లో సోమవారం జరిగింది. చిట్టబ్బాయి మాట్లాడుతూ తాము ఇతర కులాలకు వ్యతిరేకం కాదన్నారు. బీసీల్లో చేర్చడాన్ని వ్యతిరేకించే వారికి..చేర్చాలని కోరుతున్న వారికి జిల్లాలో ఒకేచోట మంజునాథ కమిషన్ విచారించడం వల్ల కులాల మధ్య వైషమ్యాలు, ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కమిషన్ ఆ రెండు సామాజిక పక్షాలను ఒకే రోజు కాకండా వేర్వేరు తేదీల్లో విచారణ నిర్వహించాలని చిట్టబ్బాయి సూచించారు. ఈనెల 28న జిల్లా నలుమూలల నుంచి బీసీ సంఘాలన్నీ సంఘటితమై మంజూనా«థ కమిషన్‌కు తమ వాదన వినిపించి వినతిపత్రం ఇవ్వాలని చిట్టబ్బాయి కోరారు.
28న ఛలో కాకినాడకు తరలిరండి
జెడ్పీ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఆధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ బీసీ సంఘాలన్నీ ఐక్యంగా ఉండి బీసీలకు జరిగే నష్టంపై మంజునా«థ కమిషన్‌కు తమ వాదన వినిపించాలన్నారు. వినతిపత్రాలు తయారు చేసేందుకు డ్రాప్టింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని, జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి మోటార్‌సైకిళ్లు, కార్ల ద్వారా ఛలో కాకినాడకు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ జనాభా తామాషా ప్రకారంగా ఆర్థికంగా వెనుకబడి కులవృత్తులున్నవారిని మాత్రమే బీసీల్లో చేర్చాలనే నిబంధన ఉందన్నారు. ఇప్పటికే 93 కులాలు ఉండాల్సిన బీసీల్లో 149 కులాలను చేర్చడం వల్ల బీసీలకు న్యాయం జరగడం లేదన్నారు. రిజర్వేషన్లు పెంచడానికి అభ్యంతరం చెబుతున్న కమిషన్లు, కాపులను ఏ విధంగా బీసీల్లో చేర్చుతారని ప్రశ్నించారు. రాష్ట్ర బీసీ జేఏసీ కన్వీనర్ కుడుపూడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ రాజ్యంగ ప్రకారంగా కాపులను బీసీల్లో చేర్చే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. బీసీ సంఘాల ప్రతినిధులు కుడుపూడి పార్థసారథి, చెల్లుబోయిన శ్రీనివాసరావు, వాసంశెట్టి గంగాధరరావు, మార్గాని నాగేశ్వరరావు, బూడిగ శ్రీనివాసరావు, యిళ్ల సత్యనారాయణ, మట్టపర్తి నాగేంద్ర, యిళ్ల శేషారావు, కుడుపూడి బాబు, వాసంశెట్టి సుభాష్, చొల్లంగి వేణుగోపాల్, వాసంశెట్టి తాతాజీ, పంపన రామకృష్ణ, డి.వెంకటేశ్వరరావు, పాలెపు ధర్మారావు, బిళ్ల శ్రీనివాసరావు, రాజులపూడి భీముడు, రెడ్డి సురేష్, పాలాటి బాలయోగి, మావూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.