పెట్టుబడులే లక్ష్యంగా బాబు దావోస్ పర్యటన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దావోస్ పర్యటన సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనమిక్ ఫోరం) 46వ సదస్సుకు చంద్రబాబుతో పాటు 9 మంది సభ్యుల బృందం పర్యటించనుంది.
ఇప్పటికే దావోస్ నగరంలో ప్రచార రథంతో కొత్త తరహా ప్రచారానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘మేక్ ఆంధ్రప్రదేశ్ యువర్ బిజినెస్’ పేరుతో రూపొందించిన బస్సు దావోస్ వీధులను చుట్టేస్తుంది. ఈ సదస్సుకు నగరంలో పరుగులు పెడుతున్న ప్రచారం రథంతో పాటు అక్కడ ఏర్పాటుచేసిన హోర్డింగులు స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
‘మేక్ ఆంధ్రప్రదేశ్ యువర్ బిజినెస్’ అనే నినాదం ప్రపంచ పెట్టుబడిదారులకు, వాణిజ్యవేత్తలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడుల సమీకరించిన రాష్ట్ర ప్రభుత్వం రెట్టించిన ఉత్సాహంతో దావోస్ పర్యటనకు బయలుదేరనుంది.