ఎమ్మెల్యే దన్నుంది..ఏమైనా చేస్తా
కాకినాడ సిటీ : ఎమ్మెల్యే.. అందునా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే దన్ను ఉంటే ఏం చేసినా ఎదురుండదన్న అహంకారంతో.. దౌర్జన్యపూరితంగా వ్యవహరించిన మాకిరెడ్డి భాస్కర్ అనే వ్యక్తి ప్రజల ప్రతిఘటనను చవి చూడాల్సి వచ్చింది. తన జోలికి ఎవరూ రాలేరని రుబాబుకు పాల్పడిన ఆయనను చివరికి కాకినాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాకినాడఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని రైతుబజార్లో గురువారం జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. మాకిరెడ్డి ఇప్పటి కే రైతుబజార్‌లోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి మూడు షాపులతో షెడ్ వేసుకుని అద్దె వసూలు చేసుకుంటున్నారు. రైతు బజార్ విస్తరణ నేపథ్యంలో తాను ఆక్రమించిన స్థలంలోని షాపులు పోతాయనే భయంతో బుధవారం మార్కెటింగ్ శాఖ ఇంజనీరింగ్ సిబ్బంది చేపట్టిన సర్వేను మాకిరెడ్డి అడ్డుకున్నారు.
తనకు అధికార పార్టీ దన్నుందని హెచ్చరించారు. అంతటితో ఆగక గురువారం ఉదయం రైతుబజార్‌కు వెళ్లి అధికారులను విస్తరణకు సంబంధించిన మ్యాప్, ప్లాన్ ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే ప్లాన్ తమ వద్ద లేదని అధికారులు చెప్పడంతో వారిని దుర్భాషలాడారు. ఎస్టేట్ అధికారితో పాటు ఇద్దరు సిబ్బందిని గదిలో నిర్బంధించి బయట తాళం వేశారు. దీంతో రైతుబజార్ వ్యాపారులు ఆందోళనకు దిగారు. మాకిరెడ్డి వారిని కూడా లక్ష్యపెట్టక కులం పేర్లతో దుర్భాషలాడారు. విషయం తెలుసుకుని టూ టౌన్ పోలీసులు రైతుబజార్‌కు వచ్చారు. వారితోనూ దురుసుగా ప్రవర్తించారు. వ్యాపారులు మాకిరెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దౌర్జన్యం కేసు నమోదు చేశారు. ఎస్టేట్ అధికారులను నిర్బంధించిన గది తాళాలను తీయించారు.
రైతుబజార్ వ్యాపారుల ర్యాలీ
తమను, రైతుబజార్ ఎస్టేట్ అధికారులను దుర్భాషలాడి, దౌర్జన్యపూరితంగా వ్యవహరించిన మాకిరెడ్డి భాస్కర్‌పై కేసు నమోదు చేయాలని, అతని నుంచి రక్షణ కల్పించాలని రైతుబజార్ వ్యాపారులు డిమాండ్ చేశారు. భాస్కర్ రుబాబును నిరసిస్తూ రైతుబజార్‌ను మూసివేసి, టూ టౌన్ పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. స్టేషన్లో వ్యాపారులు అతనిపై ఫిర్యాదు చేశారు. తరచూ మాకిరెడ్డి నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అతను అక్రమంగా నిర్మించిన షాపులను తొలగించి గోడ నిర్మించాలని రైతుబజార్ వ్యాపారుల సంఘ నాయకులు గంగాధర్, గోపాలకృష్ణ, కృష్ణస్వామి డిమాండ్ చేశారు.
ఐఎఫ్టీయూ ఖండన
రైతుబజార్ స్థలాన్ని సర్వే చేసి ఆక్రమణలను తొలగించాలని ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మాకిరెడ్డి వ్యాపారులపై దురుసుగా ప్రవర్తించి, అధికారులను నిర్బంధించడాన్ని ఖండించారు. రైతు బజార్లో సర్వే, ఆక్రమణల తొల గింపు, రైతుబజార్‌కు ప్రహరీ నిర్మించాలని డిమాండ్లతో జిల్లా రెవెన్యూ అధికారి యాదగిరికి వినతిపత్రం అందజేశారు.
మాకిరెడ్డి మావాడు కాడు..
కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుకు మద్దతుదారైన మాకిరెడ్డి భాస్కర్‌తో తమకు సంబంధమే లేదని బుకాయించడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. వనమాడిని అభినందిస్తూ నగరంలో మాకిరెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఆగమేఘాలపై తొలగించారు. ఆ తరువాత అసలు మాకిరెడ్డి భాస్కర్ ఎవరో తమకు తెలియదని, అతనితో తమకు ఎలాంటి సంబంధంలేదని సంఘటన అనంతరం రైతు బజార్‌కు వచ్చిన నగర టీడీపీ అధ్యక్షుడు నున్న దొరబాబు విలేకరులకు చెప్పుకొచ్చారు.